భారత్‌లో మర్కజ్ కల్లోలం.. తెలంగాణ నుంచి వెయ్యిమంది: ఈటల

By Siva Kodati  |  First Published Apr 1, 2020, 10:21 PM IST

భారతదేశంలో కరోనాను అదుపు చేస్తున్నామని ఇక మరికొన్ని వారాల్లో పరిస్ధితిలో మార్పు వస్తుందని ప్రభుత్వాలు భావిస్తున్న సమయంలో ఢిల్లీలో జరిగిన మర్కజ్ వ్యవహారం ఒక్కసారిగా దేశంలో వైరస్ వ్యాప్తికి కారణమైంది.


భారతదేశంలో కరోనాను అదుపు చేస్తున్నామని ఇక మరికొన్ని వారాల్లో పరిస్ధితిలో మార్పు వస్తుందని ప్రభుత్వాలు భావిస్తున్న సమయంలో ఢిల్లీలో జరిగిన మర్కజ్ వ్యవహారం ఒక్కసారిగా దేశంలో వైరస్ వ్యాప్తికి కారణమైంది.

దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కార్యక్రమానికి హాజరైన వారిని వెతికి పట్టుకునే పనిలో పడ్డాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. రాష్ట్రం నుంచి దాదాపు 1000 మందికి పైగా ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లారని ఆయన చెప్పారు.

Latest Videos

Also Read:గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగి మృతి: బంధువుల ఆగ్రహం, వైద్యుల దాడి

వీరిలో 160 మంది మినహా అందరినీ గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదని ఈటల పేర్కొన్నారు.

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 10 మందికి బుధవారం నెగిటివ్ వచ్చిందని, మరోసారి వారికి పరీక్షలు నిర్వహించి డిశ్చార్జ్ చేస్తామని రాజేందర్ స్పష్టం చేశారు. బుధవారం ఇద్దరిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.

డిశ్చార్జ్ అయినవారు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉంటారని మంత్రి చెప్పారు. ఢిల్లీలోని మర్కజ్‌‌ గురించి ముందుగా తామే కేంద్రానికి సమాచారం అందించామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా లాక్‌డౌన్ ప్రకటించింది తెలంగాణయేనని మంత్రి గుర్తుచేశారు.

Also Read:హోమ్ మంత్రికి కేసీఆర్ ఇంట్లోకి నో ఎంట్రీ, గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు

కాగా తెలంగాణలో కరోనా వైరస్ బారినపడి మరో వ్యక్తి మరణించాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు మరణించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య ఏడుకి చేరింది.

మరోవైపు గాంధీ ఆసుపత్రిలో రోగి మరణించిన విషయాన్ని తెలిపిన తర్వాత అదే ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు తీవ్ర ఆగ్రహానికి గురై అక్కడి డాక్టర్లపై దాడి చేసినట్లు సూపరింటెండెంట్ చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శ్రవణ్ తెలిపారు. 

click me!