కరోనా మహమ్మారి ఓ వైపు విజృంభిస్తున్న ఆపత్కాల సమయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న ఆకతాయిలపై పోలీసులు సీరియస్ చర్యలు ప్రారంభించారు.
సిరిసిల్ల: ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరోవైపు దానిపై సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న తప్పుడు వార్తలు రాష్ట్ర ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం కరోనా నివారణకే కాదు ఇలాంటి తప్పుడు వార్తలను కట్టడి చేయడానికి సీరియస్ చర్యలు తీసుకుంటోంది. అలా సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ ఆకతాయిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సిరిసిల్ల పట్టణం శివనగర్ కాలనీకి చెందిన నాగుల శ్రీనివాస్ అనే యువకుడు సోషల్ మీడియాలో ఓ వర్గాన్ని టార్గెట్ గా చేసుకుని పోస్ట్ పెట్టాడు. ఫేస్ బుక్ లో ఓ వర్గ ప్రజలను కించపరుస్తూ చేసిన పోస్టు వైరల్ గా మారి స్థానిక పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శ్రీనివాస్ పై క్రిమినల్ కేసు నమోదు చేసింది.
ఇలాంటి ఆకతాయి చర్యలకు ఎవరు పాల్పడినా వదిలిపెట్టేది లేదని... రాష్ట్రం ఆపత్కాలంలో వున్నపుడు ఇలాంటి చర్యలు ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించే అవకాశం వుందని పోలీసులు తెలిపారు. ప్రజలంతా సంయమనంతో వుండాలని... సోషల్ మీడియాను ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉపయోగించొద్దని సిరిసిల్ల వాసులకు పోలీసులు సూచించారు.