కరోనా ఎఫెక్ట్: కరీంనగర్ లో బస్టాండ్, కర్నూల్ లో నడిరోడ్డు... ఎలా మారాయంటే

By Arun Kumar P  |  First Published Mar 27, 2020, 7:05 PM IST

కరోనా వైరస్ ప్రభావంతో కర్నూల్ లో  నడిరోడ్డు, కరీంనగర్ లో బస్ స్టాండ్ లు మరో అవతారం ఎత్తాయి.  



కరోనా కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలకు వెసులుబాటు కలిగించేందుకు అధికారులు వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు నిత్యావసర సరుకులైన కూరగాయలు పప్పు దినుసుల కోసం ఎగబడిన జనాలను కంట్రోల్ చేసేందుకు... వాటిని వివిధ ప్రాంతాలకు విస్తరించారు అధికారులు. ఈ  క్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లోను వాహనాలతో కిటకిటలాడే స్థలాలు కూరగాయల మార్కెట్లుగా మారాయి. 

కర్నూలు నగర వ్యాప్తంగా 8 కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేయడంతో పాటు సామాజిక దూరం పాటించేలా ప్రత్యేక మార్కింగ్ ఇచ్చారు... అయితే కర్నూలు నగరంలో సరిపడా అంత స్థలం లేకపోవడంతో ప్రధాన రహదారుల్లో నే కూరగాయల దుకాణాలు ఓపెన్ చేసారు. దీంతో కూరగాయల కొనుగోలు కోసం వచ్చిన ప్రజలంతా విస్తుపోయారు.

Latest Videos

 తమ జీవితంలో ఇటువంటి దృశ్యాలు చూస్తామని కలలో కూడా అనుకోలేదు అంటూ వారి ఎగ్జైట్మెంట్ ను బయట పెట్టారు. కూరగాయల ధరలు నిత్యావసర సరుకులు కంట్రోల్ లోనే ఉండటంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చే కొనుగోలు అమ్మకం దారులకు మున్సిపల్ సిబ్బంది ప్రత్యేకంగా శానిటైజర్లతో చేతులు శుభ్రపరిచిన తర్వాతనే ప్రభుత్వం ఏర్పాటుచేసిన మార్కెట్లోకి అనుమతిస్తున్నారు.

 ఉదయం 6 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినియోగదారులకు సమయం కేటాయించి న అధికారులు ఆ తర్వాత అడుగు బయట పెడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. కర్నూలు జిల్లాలోని ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన కరోనా రహదారి మార్కెట్లు అందరికీ అందుబాటు లోకి తెచ్చారు.

ఇక కరోనా వైరస్ పుణ్యమా అని కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ కూరగాయల మార్కెట్ గా రూపాంతరం చెందబోతోంది. వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న మెయిన్ మార్కెట్‌ను ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు మార్చాలని అధికారులు నిర్ణయించారు. దీంతో కరీంనగర్ బస్‌స్టేషన్ లో సమీప ప్రాంతాల్లో నివసించే వారు కూరగాయలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈమేరకు ప్లాట్ ఫాంలపై కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు.

బస్సులు నిలిపే ప్రాంతంలో ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ వెజిటేబుల్స్ కొనుక్కునేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం అవసరమైన చర్యలు కూడా చేపట్టారు. శనివారం నుంచి బస్‌స్టేషన్ లో కూరగాయల అమ్మకాలు ప్రారంభించనున్నామని జిల్లా అధికారులు తెలిపారు.

click me!