స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లైనా ఆశించిన ఫలితాలు దక్కలేదు:కేసీఆర్

By narsimha lode  |  First Published Aug 22, 2022, 6:31 PM IST

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా కూడా దేశం ఆశించిన స్థాయిలో పురోభివృద్ది సాధించలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. 


హైదరాబాద్:ఉన్మాద స్థితిలోకి దేశాన్ని నెట్టివేస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. దేశం అనుకున్నంత పురోగమించడం లేదన్నారు. భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమాన్ని హైద్రాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సీఎం కేసీఆర్.

ఎందరో చేసిన త్యాగాలతోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన  విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. గాంధీజీ గురించి ఈ తరం పిల్లలకు తెలియదన్నారు. కానీ కొందరు గాంధీజీని చులకన చేసి మాట్లాడడాన్నికేసీఆర్ తప్పుబట్టారు. ఐక్యరాజ్యసమితితో పాటు  ప్రపంచ దేశాలు మహత్మాగాంధీని పోగడ్తలతో ముంచెత్తే విషఁయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. 

Latest Videos

undefined

  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందిందని కేసీఆర్ గుర్తు చేశారు. సుమారు కోటి మందికిపైగా ఏక కాలంలోనే జాతీయ గీతాలాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా కూాడ పేదల ఆశలు ఇంకా నెరవేరలేదన్నారు. బడుగు వర్గాల ప్రజల్లో  ఆక్రోశం ఇంకా ఉందని కేసీఆర్ చెప్పారు. అనేక వర్గాల ప్రజల్లో స్వాతంత్ర్య ఫలాలు అందలేదనే ఆవేదన ఉన్న విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. వీటన్నింటిని విస్మరించి ఒక్క ఉన్మాద స్థితిలోకి దేశాన్ని నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.  ఈ కుత్సిత ప్రయత్నాలు తెలిసి కూడా చూస్తూ ఉండడం సరైంది కాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 

ధీరోధాత్తులు, మేథావులు, వైతాళికులు కరదీపికలుగా మారి సమాజాన్ని సరైన మార్గంలో నడిపిస్తారో ఆ సమాజం పురోభివృద్ది సాధిస్తుందని  సీఎం చెప్పారు. మన దేశం ఆశించిన స్థాయిలో అభివృద్ది సాధించలేదన్నారు. కులం, జాతి, పేద, ధనిక అనే బేధం లేకుండా అందరిని కలుపుకొని  ఒక ఉజ్వలమైన రీతిలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని పలు కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని కేసీఆర్  ఈ సందర్భంగా ప్రస్తావించారు.అనంతరం రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులను సీఎం కేసీఆర్ సన్మానించారు. తొలుత ఎల్బీ స్టేడియంలో జాతీయ పతాకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ ముగింపు వేడుకలు ముగింపును పురస్కరించుకొని  ఎల్బీ స్టేడియంలో ి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. 


 

click me!