ప్రముఖ వోక్స్ వ్యాగన్ సంస్థ దేశీయ విపణిలోకి లిమిటెడ్ ఎడిషన్ పోలో, వెంటో ఆవిష్కరించింది. మూడో దశ లాక్ డౌన్ తర్వాత నిబంధనలను సడలించడంతో పలు ఆటోమొబైల్ సంస్థలు సరికొత్త భద్రతా ప్రమాణాల మధ్య కార్యకలాపాలు ప్రారంభించాయి.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించడానికి విధించిన లాక్‌డౌన్ దెబ్బతో మూతబడిన వ్యాపార కార్యకలాపాలను ఆటోమొబైల్ సంస్థలు క్రమంగా పునఃప్రారంభిస్తున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుండాయ్, వోక్స్‌వ్యాగన్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ తదితర ఆటోమొబైల్ సంస్థలు కూడా షోరూమ్‌లు తెరవడంతోపాటు ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేపడుతున్నాయి. తాజాగా ఆడి ఇండియా, రెనాల్డ్ తదితర కంపెనీలు ఈ జాబితాలో చేరాయి.
వోక్స్‌వ్యాగన్ దేశీయ మార్కెట్లోకి సరికొత్త పోలో, వెంటో కార్లను సోమవారం ప్రవేశపెట్టింది. ‘టీఎస్‌ఐ ఎడిషన్'గా బీఎస్ 6 శ్రేణిలో వచ్చిన ఈ మోడళ్లలో పోలో ధర రూ.7.89 లక్షలు, వెంటో రూ.10.99 లక్షలు నిర్ణయించారు. ఒక లీటర్ పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యంతో ఉన్న ఈ వాహనాల్లో పోలో మైలేజీ లీటర్‌కు 18.24 కిలోమీటర్లు, వెంటో మైలేజీ 17.69 కిలోమీటర్లు ఉంటుందని వోక్స్‌వ్యాగన్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.
also read అరెస్టు చేస్తే ముందు నేనే ఉంటా : ఎలన్ మస్క్
ఫ్రాన్స్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్డ్ భారత్‌లో తమ కార్పొరేట్ ఆఫీస్‌ను, ఎంపికచేసిన కొన్ని డీలర్‌షిప్‌లు.. సర్వీస్ సెంటర్లను పునఃప్రారంభించింది. కొత్త భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా 194 షోరూమ్స్, వర్క్‌షాప్‌లను తిరిగి తెరిచినట్లు రెనో ఇండియా కార్యకలాపాల విభాగం సీఈవో వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. మిగతా షోరూములను దశల వారీగా ప్రారంభించేందుకు అనుమతి తీసుకుంటామని చెప్పారు.
మూడో ఫేజ్ లాక్‌డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డీలర్‌షిప్‌లు, సర్వీస్ సెంటర్లను ఈ నెల నాలుగో తేదీ నుంచి క్రమంగా తెరుస్తున్నట్లు బజాజ్ ఆటో వెల్లడించింది. సర్వీసు సెంటర్లలో పూర్తిగా భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నట్లు తెలిపింది. బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ మాట్లాడుతూ కరోనా ప్రభావంతో నూతన పని పద్దతులు అమలు చేయాల్సి వచ్చిందన్నారు.
పంజాబ్, బీహార్ రాష్ట్రాల్లోని ఉత్పాదక ప్లాంట్లను పునఃప్రారంభించినట్లు హీరో సైకిల్స్ వెల్లడించింది. మొత్తం సామర్థ్యంలో 30 శాతం మేర ఉత్పత్తి మొదలుపెట్టినట్లు వివరించింది. అలాగే స్వల్ప సిబ్బందితో కార్పొరేట్ ఆఫీస్ కూడా తెరిచినట్లు సీఎండీ పంకజ్ ఎం ముంజల్ చెప్పారు. ఈ నెల నాల్గో తేదీ నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. 800 మంది ఉద్యోగులు నూతన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా విధులకు హాజరయ్యారని హీరో సైకిల్స్ తెలిపింది.