లాక్‌ డౌన్ దెబ్బ: మీడియా అండ్ వినోద రంగాలు ఢమాల్... క్రిసిల్ అంచనా

By Sandra Ashok Kumar  |  First Published May 12, 2020, 1:11 PM IST

కరోనా మహమ్మారి ప్రభావం మీడియా, వినోద రంగంపై తీవ్రంగా ఉండబోతున్నది. 2020-21లో ఆ రెండు రంగాల ఆదాయం 16శాతం తగ్గనున్నదని క్రిసిల్ తెలిపింది. మీడియా, వినోద రంగ రాబడి రూ.1.3 లక్షల కోట్లకు పరిమితం కానున్నదని క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది.  
 


న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో మీడియా, వినోద రంగాలకు అడ్వర్టైజ్‌మెంట్‌, సబ్‌స్ర్కిప్షన్‌ ఆదాయం భారీగా తగ్గిందని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంటోంది. ప్రస్తుతం 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ ఇండస్ట్రీ మొత్తం ఆదాయం 16 శాతం క్షీణించవచ్చని తాజా నివేదికలో అంచనా వేసింది. 

మీడియా, వినోద రంగ మొత్తం ఆదాయంలో ప్రకటనల ద్వారా సమకూరే వాటా 45 శాతం. యాడ్స్‌పై రాబడి ఈసారి 18 శాతం వరకు తగ్గవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. 55 శాతం వాటా కలిగిన సబ్‌స్ర్కిప్షన్‌ రాబడి 14 శాతం వరకు పడిపోవచ్చని క్రిసిల్‌ అంటోంది.

Latest Videos

2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈ ఇండస్ట్రీ టర్నోవర్‌ రూ.1.3 లక్షల కోట్లకు పడిపోవచ్చని క్రిసిల్ తెలిపింది. దేశంలోని 78 మీడియా, వినోద సేవల సంస్థల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ నివేదిక రూపుదిద్దుకున్నది.

గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో మీడియా, వినోద రంగ ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.1.55 లక్షల కోట్లకు చేరి ఉంటుందని క్రిసిల్ పేర్కొన్నది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2018-19)లో 10 శాతం వృద్ధితో రూ.1.42 లక్షల కోట్లుగా నమోదైంది 

ఇప్పటికే మందగమనంలో కొనసాగుతున్న ఆర్థిక వ్యవస్థ.. కరోనా సంక్షోభంలో పూర్తిగా కుదేలైంది. తత్ఫలితంగా ఈసారి పరిశ్రమ రెవెన్యూ గత ఏడాదితో పోలిస్తే రూ.25,000 కోట్లు (16 శాతం) తగ్గవచ్చునని క్రిసిల్ భావిస్తున్నది. 

ఆదాయం తగ్గుదల పరిశ్రమ రుణ చెల్లింపుల సామర్థ్యాన్ని బలహీనపర్చే అవకాశం ఉన్నదని క్రిసిల్ పేర్కొంది. కంపెనీ ఆర్థిక సామర్థ్యం, రికవరీకి పట్టే సమయం ఇండస్ట్రీ పరపతిపై ప్రభావాన్ని చూపనున్నాయి.

also read  2,3 రోజుల్లో వారికి ప్యాకేజీ: కేంద్ర మంత్రి..ఆదుకునేందుకు రూ.4.5 లక్షల కోట్లు...

మీడియా, వినోద రంగానికి ప్రకటనలపై వచ్చే ఆదాయం ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులకు అద్దం పడుతుంది. దీర్ఘకాల లాక్‌డౌన్‌తో ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి దశాబ్దాల కనిష్ఠానికి పడిపోనుంది. ఆర్థిక మందగమనంతో గత ఆర్థిక సంవత్సరంలోనూ ప్రకటనల ఆదాయ వృద్ధి అంతంత మాత్రంగానే నమోదైంది. 

కరోనా సంక్షోభ సంవత్సరంలోనూ డిజిటల్‌ మీడియా ఆదాయం మరింత వృద్ధి చెందనుందని క్రిసిల్‌ పేర్కొంది. వృద్ధి జోరు కాస్త తగ్గవచ్చునని అంటోంది. సంప్రదాయ మాధ్యమాలు టెలివిజన్‌, ప్రింట్‌, రేడియో, ఔట్‌ డోర్‌ మీడియా, సినిమాల ఆదాయం గణనీయంగా తగ్గనుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ సచిన్‌ గుప్తా అన్నారు. 

లాక్‌డౌన్‌ సమయంలో కొత్త కంటెంట్‌ను ప్రసారం చేయలేకపోవడం, ఐపీఎల్‌ వంటి అత్యంత జనాదరణ కలిగిన క్రీడా కార్యక్రమం వాయిదా పడటం టీవీ యాడ్స్‌ రెవెన్యూపై అధిక ప్రభావం చూపిందని క్రిసిల్ తెలిపింది. టీవీ చానెళ్లకు సబ్‌స్ర్కిప్షన్‌ ద్వారా లభించే ఆదాయం మాత్రం ప్రభావితం కాలేదని వెల్లడించింది. 

దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో దినపత్రికలకు డిస్ట్రిబ్యూషన్‌ పరంగా సవాళ్లు ఎదురయ్యాయని క్రిసిల్ తెలిపింది. దాంతో సర్క్యులేషన్‌ ఆదాయం తాత్కాలికంగా తగ్గింది.

అధికంగా ప్రకటనలు ఇచ్చే ఆటోమొబైల్‌, రియల్‌ ఎస్టేట్‌, ఈ-కామర్స్‌ తదితర రంగాల పునరుద్ధరణకు దీర్ఘకాలం పట్టవచ్చునని క్రిసిల్ అంచనా వేసింది. ఈ రంగాల నుంచి దినపత్రికలకు ప్రకటనలు బాగా తగ్గనున్నాయన్నది. 

బాక్సాఫీస్‌ వసూళ్లు అనూహ్యంగా తగ్గిపోవడంతో సబ్‌స్ర్కిప్షన్‌ ఆదాయం పడిపోనున్నదని క్రిసిల్ తెలిపింది. దేశంలో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టా్‌పలు, టాబ్లెట్‌ పీసీలు, పర్సనల్‌ కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల వినియోగం అంతకంతకూ పెరుగుతుండటంతో డిజిటల్‌ మాధ్యమాల ఆదాయ వృద్ధికి దోహదపడుతుందని వెల్లడించింది. 
 

click me!