చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి విలువ...పరిస్థితులు ఇలాగే కొనసాగితే..

By Sandra Ashok KumarFirst Published Apr 16, 2020, 12:01 PM IST
Highlights

కరోనా వైరస్ ప్రభావంతో వివిధ రంగాల పరిశ్రమలు దెబ్బ తింటున్నాయి. అలాగే ఆయా దేశాల కరెన్సీలు చిక్కిపోయి విలవిల్లాడుతున్నాయి. తాజాగా రూపాయి విలువ అమెరికా డాలర్ మారకంపై 76.74 వద్దకు చేరుకున్నది. ఇది చారిత్రక కనిష్ట స్థాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మున్ముందు 77.50కి పతనం కావచ్చునని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ముంబై: రూపాయి విలువ క్రమంగా పడిపోతున్నది. రోజుకొక కనిష్ఠ స్థాయికి జారుకుంటున్న మారకం విలువ గురువారం ఫారెక్స్ మార్కెట్‌లో 30 పైసలు పతనమై 76.74కి పడిపోయింది. ఇది చారిత్రక కనిష్ట స్థాయి. 

కరోనా వైరస్ ప్రభావంతో స్టాక్ మార్కెట్లతోపాటు వివిధ దేశాల కరెన్సీల విలువ పడిపోతున్నది. ఈ క్రమంలో రూపాయిపైనా ప్రభావం పడుతున్నది. దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో బలహీనతలు, బ్యాంకులు అమెరికా డాలర్ల కొనుగోలుకు దిగడంతో రూపాయి మారకం విలువ పతనమైంది. 

రెలీగేర్ బ్రోకింగ్ మెటల్, ఎనర్జీ అండ్ కరెన్సీ రీసెర్చ్ విబాగం ఉపాధ్యక్షుడు సుగంధా సచ్ దేవ మాట్లాడుతూ రూపాయి మారకం విలువ మున్ముందు రూ.77.50కి పడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కానీ కొద్దికాలంగా అమెరికా డాలర్ పుంజుకుంటున్నది. గత వారం అమెరికా ఫెడ్ రిజర్వు స్టిమ్యులేషన్ ప్యాకేజీ ప్రకటించడమే దీనికి కారణం. 

also read  కరోనా ఎఫెక్ట్: భారత విమాన రంగంలో... 20 లక్షల ఉద్యోగాలు గోవిందా..గోవిందా..

అంతకుముందు బుధవారం రూపాయి విలువ కనిష్ఠ స్థాయికి పడి పోయింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్‌ పెరుగడం, దేశీయ స్టాక్‌ మార్కెట్లు కుదేలవడం కరెన్సీ పతనానికి ఆజ్యంపోశాయి. 

బుధవారం ప్రారంభంలో భారీగా లాభపడిన దేశీయ కరెన్సీ విలువ చివరకు డాలర్‌తో పోలిస్తే 17 పైసలు క్షీణించి 76.44కి జారుకున్నది. కరోనా వైరస్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలనున్నట్లు రేటింగ్‌ ఏజెన్సీల హెచ్చరికలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది.

రూ.76.07 వద్ద ప్రారంభమైన మారకం విలువ ఒక దశలో రూ.75.99 గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 17 పైసలు పతనం చెంది రూ.76.48 వద్ద ముగిసింది. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి  లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫారెక్స్‌ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపిందని ఫారెక్స్‌ డీలర్‌ వెల్లడించారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు భారీగా తగ్గాయి. బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 3.72 శాతం తగ్గి 28.50 డాలర్లకు పడిపోయింది. 
 

click me!