కరోనా ఎఫెక్ట్: భారత విమాన రంగంలో... 20 లక్షల ఉద్యోగాలు గోవిందా..గోవిందా..

By Sandra Ashok Kumar  |  First Published Apr 16, 2020, 10:54 AM IST

అసలే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న భారత విమానయాన సంస్థలు కరోనా మహమ్మారి వల్ల కుదేలయ్యాయి. ఫలితంగా ఆ రంగంలో 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది.


న్యూఢిల్లీ: ఇంధన ధరలు.. సంస్థల మధ్య పోటీ తదితర సమస్యల మధ్య భారత విమానయాన రంగం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. కరోనా వైరస్ మహమ్మారి చేస్తున్న దాడితో ఆ రంగం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది.

అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దేశీయ విమానయాన సంస్థలు.. కరోనా దెబ్బకు రెక్కలు తెగిన పక్షుల్లా కూలబడ్డాయి. కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ అమలు చేయడం వల్ల వచ్చిన ఆంక్షలతో విమానాలు ఎగిరేందుకు వీల్లేకుండా పోయింది.

దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర ప్రభుత్వం గత నెల 24 నుంచి 21 రోజుల లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే మే 3దాకా ఈ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని మోదీ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతీ విదితమే. 

ఫలితంగా దేశ, విదేశీ విమాన సర్వీసులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఈ రంగంలో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత విమానయాన, దాని అనుబంధ రంగాల్లో 20 లక్షలకుపైగా ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం  (ఐఏటీఏ) బుధవారం హెచ్చరించింది.

ఈ క్రమంలో ఆదాయం లేక విమానయాన సంస్థలకు ఉద్యోగుల జీతాలను చెల్లించడం సవాల్‌గా మారిందని ఐఏటీఏ తెలిపింది. వేతనాల్లో కోత విధించి ఉద్యోగులను తొలగించే పరిస్థితి ఏర్పడుతున్నదని చెప్పింది. ఇప్పటికే చాలా సంస్థలు జీతాల్లేని సెలవులను ఉద్యోగులకు బలవంతంగా ఇచ్చేస్తున్నాయని గుర్తుచేసింది. 

ప్రస్తుతం కార్గో విమానాలు మినహా ప్యాసింజర్‌ విమానాలు ఎగరడం లేదు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న కరోనా అంతానికి మొత్తం రవాణా వ్యవస్థను స్తంభింపజేయడమే ఉత్తమమని కేంద్రం భావించింది. అందుకే విమానయాన రంగం విజ్ఞప్తులను పక్కకు పెట్టింది. దీంతో పాక్షికంగానైనా ఈసారి వెసులుబాటు లభిస్తుందనుకున్న విమాన పరిశ్రమకు నిరాశే ఎదురైంది.

also read భగ్గుమంటున్న బంగారం ధరలు... డిసెంబర్ కల్లా 10గ్రా పసిడి ధర...

భారతీయ విమానయాన పరిశ్రమకు ప్రయాణీకుల నుంచి వచ్చే ఆదాయం దాదాపు రూ.70 వేల కోట్లు దూరమైందని ఐఏటీఏ అంచనా వేసింది. ప్యాసింజర్‌ డిమాండ్‌ 36 శాతం పడిపోయిందన్న ఐఏటీఏ.. ఈ క్రమంలోనే 20 లక్షలకుపైగా ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయన్నది. 

ఈ కష్టకాలంలో ప్రభుత్వం పౌర విమానయాన పరిశ్రమను ఆదుకోవాలని ఐఏటీఏ ఆసియా-పసిఫిక్‌ కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ ఏడీ ఆల్బర్ట్‌ జోయెంగ్‌ కోరారు. కొత్త రుణాల మంజూరు, రుణాల పూచీకత్తు, కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్‌లో మద్దతు అవసరమని అభిప్రాయపడ్డారు. పన్నుల మినహాయింపులు, ప్రోత్సాహకాలతోపాటు ఏరోనాటికల్‌ చార్జీలను పూర్తిగా లేదంటే పాక్షికంగా రద్దు చేయాలని కేంద్రానికి సూచించారు.

కరోనా వైరస్‌ సృష్టిస్తున్న బీభత్సంతో అంతర్జాతీయ విమానయాన కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. దీనివల్ల విమాన పరిశ్రమకు నిమిషానికి సుమారు రూ.3.77 కోట్ల నష్టం వాటిల్లుతున్నదని ఐఏటీఏ వెల్లడించింది.  గత నెల 42,94,685 విమానాలు తిరిగినట్లుగా గుర్తించారు. గతేడాది మార్చితో పోల్చితే ఇది 21.9 శాతం తక్కువ. 

వాణిజ్య విమానాల విషయంలో ఈ తగ్గుదల 27.7 శాతంగా నమోదవడం గమనార్హం. మొత్తంగా పరిశ్రమ 314 బిలియన్‌ డాలర్ల ఆదాయం కోల్పోయిందని, జూన్‌కల్లా ఈ రంగానికి నగదు కొరత తప్పదని ఐఏటీఏ హెచ్చరిస్తున్నది. 

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రపంచవ్యాప్తంగా వందల దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. రాకపోకలపై ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా మార్చి చివరి వారంలో మొదలైన ఈ ప్రభావం.. ఏప్రిల్‌ ప్రథమార్ధం పూర్తిగా కొనసాగింది. ద్వితీయార్ధంలోనూ ఇంతే అన్నట్లుగా ఉన్నది. దీంతో ప్రపంచ విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలో పడటం ఖాయమన్న అభిప్రాయాలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి.

click me!