కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కుబేరుల సంపదపైనా పడింది. అది ప్రతియేటా ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించే కుబేరుల జాబితా బయట పెట్టింది. భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ ‘ఫోర్బ్స్’ జాబితాలో స్థానం పొందారు. భారీగా రిలయన్స్ సంపద హరించుకుపోయినా సంపన్న భారతీయులలో అగ్రస్థానం ఆయనదే. ఆయన సంపద విలువ 36.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుడిగా కొనసాగుతున్నారు.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ కుబేరుల సంపదపై స్పష్టంగా కనిపిస్తున్నది. ఫోర్బ్స్ తాజా జాబితాలో భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ 36.8 బిలియన్ డాలర్లతో 21వ స్థానంలో ఉన్నారు. గతంతో పోల్చితే ముకేశ్ సంపద తరిగిపోవడం గమనార్హం. దీంతో ఆయన ర్యాంక్ కూడా పడిపోయింది.
అయినప్పటికీ దేశీయ ధనవంతుల్లో ముకేశ్‌దే అగ్రస్థానం. కాగా, రిటైల్ దిగ్గజం డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ ఆయన కుటుంబం సంపద విలువ 13.8 బిలియన్ డాలర్లుగా ఉన్నది. జాబితాలో 78వ స్థానంలో ఉన్నారు.
టాప్-100లో భారత్ తరఫున ముకేశ్, దమానీలకు మాత్రమే చోటు దక్కడం గమనార్హం. టాప్-200లో మాత్రం 10 మంది ఉన్నారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారు.
కరోనా కష్టకాలంలోనూ అమెజాన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బేజోస్ ప్రపంచ సంపన్నుడిగా నిలిచారు. ఫోర్బ్స్ తన 34వ వార్సిక బిలియనీర్ల జాబితాను రిలీజ్ చేసింది. 113 బిలియన్ల డాలర్ల సంపదతో జెఫ్ బేజోస్ తొలి స్థానంలో నిలిచారు. రెండవ స్థానంలో 98 బిలియన్ డాలర్ల సంపదతో బిల్ గేట్స్ నిలిచారు.
ఎల్‌వీఎంహెచ్ సంస్థ సీఈవో బెర్నార్డ్ అర్నాల్ట్ .. ఫోర్బ్స్ జాబితాలో మూడవ స్థానానికి ఎగబాకారు. ఆయన సంపద 76 బిలియన్ల డాలర్లుగా ఉన్నది.
ఇక వారెన్ బఫెట్ నాలుగవ స్థానానికి పడిపోయారు. బఫెట్ ఆస్తులు 67.5 బిలియన్ డాలర్లు ఉన్నట్లు ఫోర్బ్స్ పేర్కొన్నది. అయితే తాజా లిస్టులో జెఫ్ బేజోస్ మాజీ భార్య మెకంజీ బేజోస్ చేరడం గమనార్హం. 36 బిలియన్ల డాలర్ల సంపదతో ఆమె లిస్టులో 22వ స్థానంలో నిలిచారు.
also read లాక్‌డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు ఖాయం...భారత్ జీడీపీ 1.6%ఓన్లీ..
ఆరో స్థానంలో సోషల్ మీడియా దిగ్గజం మార్క్ జుకర్ బర్గ్ 66.6 బిలియన్ డాలర్ల సంపదతో నిలిచారు. కోవిడ్ మహమ్మారి వల్ల సంపన్నుల జాబితా నుంచి సుమారు 267 మంది ఔటయ్యారు. దాదాపు వెయ్యి మంది వరకు తమ ఆస్తులను కోల్పోయారు.
ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో నలుగురు తెలుగువాళ్లకి చోటు దక్కింది. 3.5 బిలియన్ డాలర్ల సంపదతో దివీస్ లాబోరేటరీస్ అధినేత మురళీ దివీ, ఆయన కుటుంబం ముందు వరుసలో ఉన్నది.
ఆ తర్వాతీ స్థానాల్లో పిచ్చి రెడ్డి (1.6 బిలియన్ డాలర్లు), పీవీ కృష్ణా రెడ్డి (1.6 బిలియన్ డాలర్లు), అరబిందో ఫార్మా అధిపతి పీవీ రాంప్రసాద్ రెడ్డి (1.4 బిలియన్ డాలర్లు) ఉన్నారు. వీరిలో ఇద్దరు ఔషధ రంగానికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు మౌలిక రంగంలో ఉన్నారు. పీపీ రెడ్డీ, పీవీ కృష్ణా రెడ్డీ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సారథులుగా ఉన్నారు.
ఇంకా భారత్ నుంచి చోటు దక్కించుకున్న వారిలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్, హిందుజా బ్రదర్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్ చైర్మన్ ఉదయ్ కొటక్, టెలికం దిగ్గజం ఎయిర్ టెల్ అధినేత సునీల్ మిట్టల్, సెరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనావాలా, గౌతం ఆదానీ, స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ ఉన్నారు.