కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ కష్టాలను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో జీఎస్టీలో కోత విధించాలని డిమాండ్ చేయడానికి ఇది సరైన సమయం కాదని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ విక్రయాలపై దృష్టి సారించింది. ఇప్పటి వరకు 5 వేల బుకింగ్‌లు నమోదయ్యాయి.
ముంబై: వాహనాలపై జీఎస్టీ తగ్గించమని కోరేందుకు ఇది సరైన సమయం కాదని భారత్‌లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ అభిప్రాయపడింది. లాక్‌డౌన్ వల్ల ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి తక్కువగా ఉందని, ఈ పరిస్థితుల్లో డిమాండ్ ఆశించిన ఫలితాలు ఇవ్వదని ఆ సంస్థ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ పేర్కొన్నారు.
‘ఇప్పుడే మనం వాహన తయారీ కేంద్రాలను తిరిగి ప్రారంభిస్తున్నాం. నెల, రెండు నెలల వరకు ఉత్పత్తి సామర్థ్యం చాలా తక్కువగానే ఉండనుంది. ఈ సమయంలో జీఎస్‌టీ కోత విధించమని కోరడం సరైనది కాదు’ అని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఓ సమావేశంలో మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ వెల్లడించారు.
వాహన తయారీ రంగం పునరుజ్జీవానికి కొద్ది రోజుల క్రితం కేంద్రంతో జరిగిన చర్చల్లో భాగంగా వివిధ వాహన సంస్థల అధినేతలు కొన్ని సూచనలు చేశారు. వాటిలో జీఎస్టీ తగ్గింపు ఒకటి. ఉత్పత్తి సామర్థ్యం అత్యధికంగా ఉన్నప్పుడు, డిమాండ్ కంటే సరఫరా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సూచన సహేతుకమని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు.
‘అప్పుడే దానికి ఓ అర్థం ఉంటుంది. జీఎస్టీ తగ్గింపుపై ఆటో పరిశ్రమ, ప్రభుత్వం సరైన సమయంలో పరిశీలించాలి. దాన్ని అమలు చేయాలి. తప్పకుండా అమలు చేయాలి కానీ వెంటనే కాదు’ అని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ చెప్పారు. కాగా, కేంద్రం లాక్‌డౌన్ నిబంధనల్లో కాస్త సడలింపులు ఇవ్వడంతో మారుతి సంస్థ మానేసర్ ప్లాంట్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది.
also read బిఎస్6 ఇంజన్, కొత్త లుక్ తో కవాసాకి నింజా బైక్ లాంచ్..
ఇదిలా ఉంటే ఏప్రిల్ నెలలో జీరో అమ్మకాలతో కుదేలైన మారుతి సుజుకి తాజాగా ఆన్‌లైన్ విక్రయాల్లో జోరందుకుంది. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి ఇప్పటికే 5000 ఆన్‌లైన్ బుకింగ్‌లను సాధించింది. అలాగే మానేసర్ ప్లాంట్ నుంచి 2300 కార్లను డీలర్లకు పంపింది.
నిబంధనల మేరకు కార్లను ఆయా వినియోగదారులకు వారం రోజుల్లో డెలివరీ చేస్తామని మారుతి సుజుకి ప్రకటించింది. భారతదేశంలో 2500 టచ్ పాయింట్లను కలిగి ఉన్న మారుతి సుజుకి తన మూడో వంతు ఔట్‌లెట్లలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించామని తెలిపింది. అయితే చాలా నగరాలు ఇప్పటికీ రెడ్ లేదా ఆరెంజ్ జోన్ల పరిధిలో ఉన్నందున డెలివరీలు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.
కరోనా మహమ్మారి ‘లాక్‌డౌన్’ ఆంక్షలతో మూసివేసిన 1900 వర్క్‌షాప్‌లు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాయని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ వెల్లడించారు. ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల కొనుగోళ్లపై ద్రుష్టి పెట్టిన తమకు భారీ మద్దతు లభిస్తోందని తెలిపారు.