కరోనా కష్టాలకు ‘కరెన్సీ ముద్రణ’తోనే చెక్.. కానీ ద్రవ్యలోటు సంగతేంటి?

By Sandra Ashok Kumar  |  First Published May 15, 2020, 10:41 AM IST

కరోనా కష్టాలను కడతేరేందుకు కరెన్సీ ముద్రణే పరిష్కార మార్గం అని కేంద్రం నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తున్నది. రూ.20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం రమారమీ రూ.6.8 లక్షల కోట్ల కరెన్సీ ముద్రించడానికి ఆర్బీఐని కోరనున్నట్లు సమాచారం. అదే జరిగితే ద్రవ్యోల్బణం అదుపుతప్పనున్నదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 


న్యూఢిల్లీ: కరోనా కాటుతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కరెన్సఅ ముద్రణ వైపు అడుగులేస్తున్నదా? నగదు ముద్రణతోపాటు బాండ్ల విక్రయం ద్వారా నిధులను సమీకరించుకోనున్నదా? అంటే అవుననే సమాధానం వస్తుంది.

ప్రస్తుత సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు రూ.20 లక్షల కోట్లతో రెండో విడుత ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన మోదీ సర్కార్‌.. జీడీపీలో 10 శాతానికి సమానమైన ఈ నిధులను ఎక్కడి నుంచి తెస్తుంది? వీటికి పరిష్కారం నగదు ముద్రణేనని అని తెలుస్తున్నది.

Latest Videos

వీటిలో దాదాపు రూ.13 లక్షల కోట్లను వివిధ మార్గాల ద్వారా సమీకరించుకోనున్నట్టు కేంద్రం తెలిపింది. మిగతా రూ.7 లక్షల కోట్లను నగదు ముద్రణ ద్వారా సమకూర్చాలని ఆర్బీఐని కోరక తప్పదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. 

దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దాదాపు రూ.7 లక్షల కోట్ల నగదును ముద్రించనున్నట్టు తెలుస్తున్నది. కొవిడ్‌-19 సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మంగళవారం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఈ మొత్తం నిధుల్లో రూ.6.8 లక్షల కోట్లను నగదు ముద్రణ ద్వారా సమకూర్చాలని కేంద్రం ఆర్బీఐని కోరే అవకాశం ఉన్నదని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ (బీవోఎఫ్‌ఏ) తెలిపింది. 

‘దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మోదీ సర్కార్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 10 శాతం విలువైన ఉద్దీపనలను ప్రకటించింది. ఈ 10 శాతంలో 7.3 శాతం నిధులను కేంద్రం వివిధ మార్గాల్లో సమకూర్చుకోగలదు’ అని బీవోఎఫ్‌ఏ వ్యాఖ్యానించింది.

కానీ మిగిలిన 2.7 శాతం (రూ.6.8 లక్షల కోట్ల) నిధులను కేంద్రానికి సమకూర్చేందుకు రిజర్వు బ్యాంకు నగదును ముద్రించాల్సిన అవసరముంటుందని భావిస్తున్నాం’ అని బీవోఎఫ్‌ఏ గురువారం ఓ నోట్‌లో పేర్కొన్నది.

ఆర్థిక సమతూకం మరీ దారుణంగా దెబ్బతినకుండా చూసుకొంటూ కేంద్ర ప్రభుత్వం ఇంత భారీగా నిధులను సమకూర్చుకోవడం ఎలా సాధ్యమవుతుందన్న దానిపై బీవోఎఫ్‌ఏ భారత ఆర్థికవేత్తలు ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, ఆస్థా గుడ్వాణీ వివరణ ఇచ్చారు. 

లాంగ్‌టర్మ్‌ రెపో ఆపరేషన్స్ (ఎల్టీఆర్వో‌), టార్గెటెడ్‌ లాంగ్‌టర్మ్‌ రెపో ఆపరేషన్స్ (టీఎల్టీఆర్వో‌), క్యాష్‌ రెపోరేట్‌ (సీఆర్‌ఆర్‌) కుదింపు, రుణ మార్గాల ద్వారా ఆర్బీఐ ఇప్పటికే ఈ మొత్తంలో పావు భాగం (250 బేసిస్‌ పాయింట్ల) నిధులను కేంద్రానికి సమకూర్చిందని బీవోఎఫ్‌ఏ నిపుణులు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం రూ.4.2 లక్షల కోట్ల విలువైన అదనపు రుణాలను పొందేందుకు వీలున్నదని బీవోఎఫ్‌ఏ భారత ఆర్థికవేత్తలు తెలిపారు. ఈ రుణాల విలువ జీడీపీలో 110 బేసిస్‌ పాయింట్లని పేర్కొన్నారు.

బ్యాంకులకు మళ్లీ పెట్టుబడులను సమకూర్చేందుకు ప్రభుత్వం రీక్యాప్‌ బాండ్లను జారీచేయవచ్చని, లేదా ఆర్బీఐ రీవాల్యుయేషన్‌ రిజర్వుల నుంచి 127 బిలియన్ల డాలర్లు డ్రా చేయవచ్చని, దీని విలువ జీడీపీలో 25 నుంచి 30 బేసిస్‌ పాయింట్ల వరకు ఉంటుందని బీవోఎఫ్‌ఏ భారత్ ఆర్థిక వేత్తలుతెలిపారు.

పీఎస్‌యూ బాండ్లను జారీచేసే అవకాశం  ఉన్నదని, వీటి విలువ జీడీపీలో 50 బేసిస్‌ పాయింట్ల వరకు ఉంటుందని  బీవోఎఫ్‌ఏ భారత్ ఆర్థిక వేత్తలు అన్నారు. అలాగే చిన్న, మధ్యతరహా సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వమిచ్చే క్రెడిట్‌ గ్యారంటీలు జీడీపీలో 150 నుంచి 200 బేసిస్‌ పాయింట్లకు సమానమని  బీవోఎఫ్‌ఏ భారత్ ఆర్థిక వేత్తలు వెల్లడించారు.

also read జూన్ 11 నాటికి ఇండియాకు విజయ్ మాల్య..? కానీ..

ఇక మిగిలిన 270 బేసిస్‌ పాయింట్లకు సమాన నిధులను కేంద్రానికి సమకూర్చేందుకు ఆర్బీఐ నగదును ముద్రించాల్సిన అవసరం ఉంటుందని  బీవోఎఫ్‌ఏ భారత్ ఆర్థిక వేత్తలు తెలిపారు. జీడీపీలో 80 బేసిస్‌ పాయింట్లకు సమానమైన నిధులను సంక్షేమ చర్యలకు వెచ్చించనున్నట్టు తాజా ప్యాకేజీలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, అయితే వీటి వాస్తవ ఆర్థిక ప్రభావం జీడీపీలో 35 బేసిస్‌ పాయింట్లు మాత్రమేనంటున్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు రూ.20 లక్షల కోట్లతో రెండో విడుత ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన మోదీ సర్కార్‌.. జీడీపీలో 10 శాతానికి సమానమైన ఈ నిధుల్లో దాదాపు రూ.13 లక్షల కోట్లను వివిధ మార్గాల ద్వారా సమీకరించుకోనున్నట్టు ప్రకటించింది. మిగిలిన రూ.7 లక్షల కోట్లను నగదు ముద్రణ ద్వారా సమకూర్చాలని ఆర్బీఐని కోరక తప్పదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. 

అయితే, దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడమే రిజర్వు బ్యాంకు ప్రధాన కర్తవ్యం. కానీ అదనపు నగదు ముద్రణతో రూపాయి విలువ మరింత క్షీణించి ధరలు పెరుగుతాయి. దీంతో ద్రవ్యోల్బణం హద్దులు దాటి దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమై ముప్పు వాటిల్లుతుంది.

ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని రిజర్వు బ్యాంకు 1994లో మన్మోహన్‌సింగ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే నగదు ముద్రణకు స్వస్తి పలికింది. కానీ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో  కేంద్ర ప్రభుత్వం నగదు ముద్రణ కోసం ఆర్బీఐని ఆశ్రయించక తప్పదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

ఆర్బీఐ నగదును ముద్రించి తక్కువ వడ్డీతో కేంద్రానికి ఇవ్వడాన్ని హెలిప్టర్‌ మనీ అంటారు. వస్తు, సేవల కొనుగోలులో ప్రజలకు అసాధారణ రీతిలో సాధికారతను కల్పించి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఇది తోడ్పడుతుంది. 

ముద్రించిన నగదుతో కరెన్సీ నోట్ల సంఖ్య పెరిగి మార్కెట్లోకి మరింత నగదు వస్తుంది. ప్రభుత్వ బాండ్లను కొనుగోలుచేసి ఆర్బీఐ నిధులను సమకూర్చడాన్ని క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ అంటారు. ఈ విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు దీర్ఘకాలంపాటు బాండ్లను సమీకరించేందుకు రిజర్వు బ్యాంకు అనుమతిస్తుంది. హెలికాప్టర్‌ మనీ కంటే క్వాంటిటేలివ్ ఈజింగ్ విధానం ఉత్తమమైనది.

కరోనా కాటుతో అల్లాడుతున్న అమెరికా, జపాన్‌, యూరప్‌లోని పలు సంపన్నదేశాలతోపాటు టర్కీ, ఇండోనేషియా లాంటి దేశాలు క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌, హెలికాప్టర్‌ మనీపై దృష్టిసారించాయి. నగదు ముద్రణతో ఆర్థిక వ్యవస్థలను చక్క దిద్దుకొనేందుకు చర్యలు చేపడుతున్నాయి. 

యూరోజోన్‌లోని దేశాల నుంచి కొనుగోలుచేసే బాండ్లపై యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు పరిమితిని ఎత్తేసింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ తమ ప్రభుత్వానికి తాత్కాలికంగా రుణాలను అందజేసేందుకు సిద్ధమైంది. అదేవిధంగా బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ అపరిమిత మొత్తంలో ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

click me!