దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంక్షుభిత సమయంలోనూ మెరిసింది. గతేడాది చివరి త్రైమాసికంలో ఆరు శాతంతో పెరిగిన లాభం రూ.4,335 కోట్లుగా నమోదు చేసుకున్నది. కరోనా వైరస్ నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి వల్ల గైడెన్స్ అంచనాకు విరామం ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఉండబోవని పేర్కొన్నది. అలాగే ఉద్యోగుల తొలగింపు ఉండబోవని కూడా కుండబద్ధలు కొట్టింది. ఇక ఫ్రెషర్స్‌కు కూడా నియామకాలు ఉంటాయని భరోసా కల్పించింది.
దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.4,335 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.4,078 కోట్ల లాభంతో పోలిస్తే 6.3 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 8 శాతం పెరిగి రూ.23,267 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్‌ఈకి ఇన్ఫోసిస్ సమాచారం అందించింది. 2018-19 ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.21,539 కోట్లు ఆర్జించింది.
కరోనా వైరస్ మహమ్మారితో వ్యాపార రంగంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో 2020-21 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు అంచనాను విడుదల చేయడం లేదని సంస్థ ప్రకటించింది. సానుకూల పరిస్థితులు నెలకొన్న తర్వాతే గైడెన్స్‌ను ప్రకటించనున్నట్లు తెలిపింది.
కంపెనీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ సంస్థ ఉద్యోగుల్లో 93 శాతం మంది ఇంటి నుంచే విధులు నిర్వహించారని తెలిపారు. వర్క్ ఫ్రం హోం ద్వారా క్లయింట్లకు నిరాటంకంగా సేవలు అందించినట్లు చెప్పారు.
ఈ వైరస్ దెబ్బకు స్వల్పకాలంపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని సలీల్ పరేఖ్ చెప్పారు. ఈ కష్టకాలంలోనూ క్లయింట్లకు నాణ్యమైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.90,791 కోట్ల ఆదాయం (9.8 శాతం వృద్ధి)పై రూ.16,639 కోట్ల నికర లాభాన్ని(8 శాతం అధికం) నమోదు చేసుకున్నది.
also read ఆకట్టుకుంటున్న హానర్ స్మార్ట్ ఫోన్లు... తక్కువ ధరకే లేటెస్ట్ ఫీచర్లతో...
గత ఆర్థిక సంవత్సరానికి ప్రతిషేరుకు రూ.9.50 తుది డివిడెండ్‌ను ప్రకటించింది ఇన్ఫోసిస్. డాలర్ రూపంలో కంపెనీ ఆదాయం 1.4 శాతం తగ్గింది.
వీటిలో డిజిటల్ సేవలు అందించడం ద్వారా సంస్థకు 1,341 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది. గతేడాది మొత్తానికి 12,780 మిలియన్ డాలర్ల(8.3 శాతం వృద్ధి) ఆదాయంపై 2,724 మిలియన్ డాలర్ల(ఒక్క శాతం వృద్ధి) నిర్వహణ లాభాన్ని ఆర్జించింది.
కరోనా వైరస్ మహమ్మారి ఇన్ఫోసిస్ సిబ్బందికీ అంటుకున్నది. అంతర్జాతీయంగా పలువురు సిబ్బందికి కరోనా వైరస్ సోకిందని తాజాగా ఇన్ఫోసిస్ వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన సంస్థ..ఆ యూనిట్‌లో పనిచేస్తున్న ఇతర సిబ్బందికి అత్యవసరంగా కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది.
ఈ వైరస్ బారిన పడిన వారిని క్వారంటైన్‌కు తరలించినట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. అయితే ఎంతమందికి సోకిన విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. ఈ వైరస్ సోకిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో టచ్‌లోనే ఉన్నట్లు, అన్ని విధాలా ఆదుకుంటున్నట్లు వెల్లడించింది.
ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందన్న అంచనాతో ఇన్ఫోసిస్ షేరు భారీగా లాభపడింది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర 3.75 శాతం పెరిగి రూ.652.90 వద్ద ముగిసింది.
కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఏటా ఇచ్చే ప్రమోషన్లు, వేతన పెంపులు ఈ ఏడాది లేవని ప్రకటించింది. మరోవైపు ఉద్యోగాల కోతలు ఉండబోవని స్పష్టం చేసిన సంస్థ.. గతంలో ఆఫర్ ఇచ్చిన వారందరితోపాటు, ఫ్రెషర్లనూ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని వెల్లడించింది.