కరోనా మహమ్మారి నియంత్రణకు విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బందుల పాలైనా ఉద్యోగులను తొలగించబోమని, వేతనాల్లో కోత విధించబోమని స్కోడా-వోక్స్ వ్యాగన్, రెనాల్ట్, ఎంజీ మోటార్స్ తదితర సంస్థలు తెలిపాయి. వోక్స్ వ్యాగన్ సంస్థ మరో అడుగు ముందుకేసి.. పరిస్థితులు సానుకూలించిన తర్వాత బోనస్ చెల్లిస్తామని ప్రకటించింది.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఆట కట్టించడానికి విధించిన లాక్‌డౌన్ వేళ భారత కార్ల కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. లాక్ డౌన్ వేళ తమ కార్ల కంపెనీ ఉద్యోగులకు జీతాల్లో కోత విధించమని, వారిని ఉద్యోగాల నుంచి తొలగించమని స్కొడా-వోక్స్ వ్యాగన్, రేనాల్ట్, ఎంజీ మోటార్స్ ఇండియా కంపెనీలు తాజాగా ప్రకటించాయి.
లాక్ డౌన్ వల్ల తమ వ్యాపారం దెబ్బతిని నగదు రాక తగ్గినా ఉద్యోగులపై ఆ ప్రభావం చూపబోమని కార్ల ఉత్పత్తి కంపెనీలు ఉద్యోగులకు హామీ ఇచ్చాయి. తమ కంపెనీలు దీర్ఘకాలిక ప్రణాళికలకు అనుగుణంగా శ్రామికశక్తిని రక్షించుకోవడం చాలా అవసరమన్నారు.
కనుక అందుకే ఉద్యోగులకు జీతాల కోత విధించక పోగా వారికి బోనస్ చెల్లించి తమ నిబద్ధతను చాటుకుంటామని స్కోడా వోక్స్ వ్యాగన్ తెలిపింది. వ్యాపారం సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత ఉద్యోగులకు బోనస్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది.
ప్రపంచం మొత్తం కరోనా సంక్షోభం నెలకొన్నందున తమ కంపెనీ ఉద్యోగులు భయపడుతున్నారని, కాని తమ కంపెనీ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించబోమని, ఉద్యోగాల్లోనుంచి తొలగించమని రెనాల్ట్ ఇండియా ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లి స్పష్టం చేశారు.
also read ఇండియాపై కన్నేసిన చైనా కంపెనీలు..ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులకు భారీ ప్లాన్..
చైనా కార్ల తయారీ సంస్థ షాంఘై ఆటోమోటివ్ యాజమాన్యంలోని భారతీయ ఆటోమోటివ్ ఎంజీ మోటార్స్ ఇండియా తమ ఉద్యోగులను తొలగించమని, వారికి జీతాలు చెల్లిస్తామని కంపెనీ ప్రకటించింది. తమ కంపెనీ ఉద్యోగుల జీతాల్లో కోత ఉండదని ఎంజీ మోటార్స్ ఇండియా అధ్యక్షుడు రాజీవ్ చాబా చెప్పారు. కరోనా మహమ్మారి వల్ల దెబ్బతిన్న కార్ల కంపెనీల్లో ఎంజీ మోటార్స్ ఒకటి.
2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత ప్యాసింజర్ వాహనాల మార్కెట్ 18 శాతం పతనమైంది. విక్రయాలు ఐదేళ్ల దిగువ కనిష్టానికి పడిపోయాయి. కానీ స్కోడా- వోక్స్ వ్యాగన్, రెనాల్ట్, రియా మోటార్స్, ఎంజీ మోటార్స్ మాత్రం ఆశావాదంతో ఉన్నాయి.
స్కోడా వోక్స్ వ్యాగన్ సంస్థ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ తమ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలను కొనసాగిస్తామని పేర్కొంది. తన 2.0 వ్యూహంలో భాగంగా బిలియన్ యూరోల పెట్టుబడులు పెట్టగలమని తెలిపింది. పలు కంపెనీలు తమకంటూ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తూ కొత్త మోడల్ కార్ల తయారీ, ఆవిష్కరణపై కేంద్రీకరించాయి.