లాక్‌డౌన్‌ పొడిగిస్తే పేదరికంలో కోట్ల మంది.. మాజీ గవర్నర్ ఆందోళన..

By Sandra Ashok KumarFirst Published Apr 27, 2020, 11:39 AM IST
Highlights

కరోనా మహమ్మారిని అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత త్వరగానే కోలుకుంటాం అని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు సున్నా అని ఓ వెబినార్‌లో మాట్లాడుతూ చెప్పారు. అయితే, లాక్ డౌన్ సుదీర్ఘ కాలం కొనసాగిస్తే మాత్రం పేదరికం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  
 

హైదరాబాద్‌: కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించడానికి సుదీర్ఘ కాలంగా లాక్ డౌన్ విధించడం వల్ల కోట్లాది మంది పేదరికంలో చేరిపోతారని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, కొన్ని ఇబ్బందులున్నా.. కరోనా మహమ్మారి నియంత్రించిన తర్వాత భారత ఆర్థిక వ్వవస్థ వేగంగానే కోలుకుంటుందని చెప్పారు. 

అయితే ప్రస్తుత లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగిస్తే మాత్రం కోట్లాది మంది పేదరికం అంచుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని దువ్వూరి సుబ్బారావు హెచ్చరించారు. మంథన్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌ వేగంగానే కోలుకుంటుంది. అలా అని సంబరపడి పోకూడదు. మనది చాలా పేద దేశం. లాక్‌డౌన్‌ను త్వరగా ఎత్తివేయాలి. లేకపోతే పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఉంది’ అన్నారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020- 21)లో జీడీపీ వృద్ధి రేటు చాలా మంది విశ్లేషకులు చెబుతున్న విధంగానే రేటు సున్నా స్థాయికి తగ్గడం లేదా ప్రతికూలంగా ఉండే అవకాశం ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. కరోనాకు రెండు నెలల ముందే దేశ ఆర్థిక వృద్ధి కుదేలైన విషయాన్ని గుర్తు చేశారు.  

also read ధనవంతులపై పిడుగు.. రెవెన్యూ పెంపు కోసం కరోనా టాక్స్... 

కరోనా మహమ్మారిని అదుపు చేసిన తర్వాత తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటామని దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. వృద్ధి రేటు ఇంగ్లీషు అక్షరం ‘వీ’ ఆకారంలో కోలుకుంటుందన్నారు. మిగతా దేశాలతో పోలిస్తే ఈ విషయంలో మన దేశ  పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుందన్నారు.

‘తుపాన్లు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాల తరహాలో కోవిడ్‌-19తో మన మూలధన ఆస్తులేవీ ధ్వంసం కాలేదు. ఫ్యాక్టరీలు, దుకాణాలూ యథాతథంగా ఉన్నాయి. కాబట్టి ఆర్థిక వ్యవస్థ ఇంగ్లీషు అక్షరం ‘వీ’ ఆకారంలో కోలుకుంటుందని అనుకుంటున్నా’ అని దువ్వూరి సుబ్బారావు అన్నారు. 

కరోనా నేపథ్యంలో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇచ్చే రుణాల చెల్లింపులకు ‘పరపతి హామీ’ పథకం లాంటిది ప్రవేశ పెట్టాలని వెబినార్‌లో పాల్గొన్న ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఉషా థోరట్‌ సూచించారు. లేదంటే ఈ సంస్థలకు  మరిన్ని నిధులు సమకూర్చాలన్నారు. 

ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయకపోతే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు.. మొండి బకాయిల భయంతో అప్పులు ఇచ్చేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపవని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఉషా థోరట్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు మరింత ఆర్థిక మద్దతు ఉండాలని కూడా కోరారు.
 

click me!