కరోనా: వలస కార్మికుల కోసం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

By narsimha lodeFirst Published Mar 31, 2020, 4:28 PM IST
Highlights

కరోనా కారణంగా వలస కార్మికులకు భోజనంతో పాటు వసతి సౌకర్యం కల్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరో వైపు కార్మికుల ఆరోగ్యంతో పాటు అనారోగ్యానికి వారు గురైతే చికిత్స కోసం ప్రాధాన్యత ఇవ్వాలని కోర్టు కేంద్రానికి సూచించింది.

న్యూఢిల్లీ: కరోనా కారణంగా వలస కార్మికులకు భోజనంతో పాటు వసతి సౌకర్యం కల్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరో వైపు కార్మికులు  అనారోగ్యానికి  గురైతే చికిత్స కోసం ప్రాధాన్యత ఇవ్వాలని కోర్టు కేంద్రానికి సూచించింది.

లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా వేలాది మంది వలస కార్మికులు పని లేకుండా రోడ్డున పడ్డారని దాఖలైన పిటిషన్ ను మంగళవారం నాడు సుప్రీంకోర్టు విచారించింది.

ఇవాళ ఉదయం 11 గంటల వరకు వలస కూలీలు ఎవరూ కూడ రోడ్లపై లేరని కేంద్ర హోంశాఖ సెక్రటరీ  చెప్పారని  సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పారు. వలస కూలీలు తమకు సమీపంలో ఉన్న కేంద్రాల్లో ఆశ్రయం పొందారన్నారు. అంతరాష్ట్ర వలసలను కూడ నిషేధించినట్టుగా ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

వలస కార్మికులకు ఆహారం, మందులను ప్రభుత్వమే అందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.వలస కార్మికులను భయాలను పొగొట్టేందుకు ప్రభుత్వం వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించింది.

కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహల్లో వలంటీర్లకు బాధ్యతలు అప్పగించాలని సుప్రీం కోరింది.  ఈ షెల్టర్ నిర్వహణల బాధ్యతలను పోలీసులకు అప్పగించకూడదని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇల్లు లేని పేదలు, కార్మికుల కుటుంబాలకు ఆహారం అందుబాటులో ఉంచామని కేంద్రం స్పష్టం చేసింది. మధ్యాహ్న భోజనం తయారు చేసే ఏజన్సీలు, రైల్వే క్యాటరర్స్, మత సంస్థలు, కార్పోరేటర్స్ ద్వారా ఆహారం అందించేలా చర్యలు తీసుకొన్నట్టుగా కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Also read:నిజాముద్దీన్ మర్కజ్‌లో ప్రార్థనలు: ఎఫ్ఐఆర్‌కు ఢిల్లీ సర్కార్ ఆదేశం

ఫేక్ న్యూస్ నివారణకు ప్యానెల్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. కరోనా గురించి ప్రజలకు కచ్చితమైన సమాచారాన్ని అందించేందుకు పోర్టల్ ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీం కోర్టు. అంతేకాదు కరోనాపై నిపుణుల కమిటిని కూడ ఏర్పాటు చేయాలని కూడ ఉన్నత న్యాయస్థానం కోరింది.

కరోనా కారణంగా వలస కార్మికుల పరిస్థితితో పాటు ఇతర విషయాలపై కేంద్రం సుప్రీంకోర్టుకు కేంద్రం మంగళవారం నాడు స్టేటస్  రిపోర్టును సమర్పించింది. కరోనా నివారణకు ఇప్పటివరకు తీసుకొన్న చర్యల గురించి కూడ సుప్రీంకు కేంద్రం వివరించింది.

 

click me!