డిల్లీలో కరోనా కలకలం... మర్కజ్ నిజాముద్దిన్ పెద్దలపై చర్యలు

By Arun Kumar P  |  First Published Mar 31, 2020, 8:20 PM IST

మర్కజ్ నిజాముద్దిన్ లో మార్చి 22 నుండి ఇప్పటివరకు ఏం జరిగిందో తబ్లిక్ జమాత్ సంస్థ వివరించింది. 


డిల్లీ: తబ్లీక్ జమాత్ కు చెందిన అంతర్జాతీయ హెడ్ క్వార్టర్స్ లో దాదాపు వందేళ్లుగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మర్కజ్ నిజాముద్దీన్ ప్రతినిధులు తెలిపారు. ప్రతీ కార్యక్రమం 3 నుంచి 5 రోజులే ఉంటుందని...ఏడాది ముందే కార్యక్రమ తేదీలు ఖరారవుతాయన్నారు. దేశవిదేశీ యాత్రికుల సౌలభ్యం దృష్ట్యా తేదీల ఖరారు అవుతాయని వెల్లడించారు.

జనతా కర్ప్యూ ప్రకటించగానే రైళ్లు రద్దు కావడంతో కార్యక్రమం నిలిపివేశామని... రైళ్లు ఒక్కసారిగా నిలిచిపోవడంతో 22న చాలామంది ఢిల్లీలో చిక్కుకున్నారని వివరించారు. 22న రాత్రి 9 గంటల వరకూ జనతా కర్ఫ్యూ దృష్ట్యా ఎవరూ బయటికి రాలేదని...ఆ తర్వాత స్వస్ధలాలకు వెళ్ళాలని అనుకున్నా చాలా మందికి సాధ్యం కాలేదన్నారు.

Latest Videos

జనతా కర్ఫ్యూ ఎత్తేయగానే ఢిల్లీ ప్రభుత్వం 31 వరకూ లాక్ డౌన్ ప్రకటించిందని....దీంతో ఎవరికి తోచిన మార్గాల్లో స్వస్ధలాలకు బయలుదేరారని అన్నారు. 23న కేంద్రం ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ పొడిగించడంతో మరిన్ని సమస్యలొచ్చాయని అన్నారు. 

లాక్ డౌన్ పొడిగింపుతో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఢిల్లీలోనే వారిని ఉంచామని...24న లాక్ డౌన్ నేపథ్యంలో మర్కజ్ మూసేయాలని ఢిల్లీ పోలీసులు నోటీసిచ్చారని తెలిపారు. 24నే ప్రభుత్వం నుంచి 17 వాహనాల పాస్ లు తీసుకుని కొందరు వెళ్లిపోయారని... మిగిలిన కొందరికి ఢిల్లీ ప్రభుత్వం ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించిందన్నారు.

28న ఢిల్లీ పోలీసులు లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన పేరుతో నోటీసులిచ్చారని... కానీ స్ధానిక అధికారులతో తమ సంప్రదింపుల వివరాలతో సమాధానం ఇచ్చామని తెలిపారు.  29న సోషల్ మీడియా పుకార్లతో కేజ్రివాల్ మర్కజ్ పెద్దలపై చర్యలకు ఆదేశించారని పేర్కొన్నారు. 

లాక్ డౌన్ సందర్భంగా మర్కజ్ లో చిక్కుకున్న వారిని ఇళ్లకు పంపేందుకే ప్రయత్నించామని.... ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినా ఫలించకపోవడంతో మర్కజ్ లో జనం ఉండిపోయారన్నారు. కేజ్రీవాల్ కార్యాలయం వాస్తవాలను నిర్ధారించుకోవాలని మనవి చేస్తున్నట్లు...ఈ మొత్తం ఎపిసోడ్ లో తాము ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని తబ్లీక్ జమాత్ ప్రతినిధులు వెల్లడించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం మర్కజ్ ను క్వారంటైన్ ఆస్పత్రిలో మార్చుకోవచ్చన్నారు. వందేళ్ల చరిత్రలో తాము ప్రతిసారీ ప్రభుత్వాలకు సహకరించామని...ఇప్పటికీ అధికారుల సూచనల మేరకు నడుచుకునేందుకు తాము సిద్ధమేనని ఈ సంస్థ తెలిపింది. 

click me!