బర్త్ డే వేడుకల కోసం ప్రజల ప్రాణాలతో బీజేపీ ఎమ్మెల్యే చెలగాటం, కేసు నమోదు

By Sree sFirst Published Apr 6, 2020, 9:46 AM IST
Highlights

మహారాష్ట్ర వార్ధా జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దాదారావ్ కెచే తన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు రేషన్ పంచుతున్నాడని తెలిసి దాదాపుగా ఒక 100 మంది ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఈ తతంగం నడుస్తుండగానే పోలీసులు అక్కడకు చేరుకొని వారిని చెదరగొట్టేసారు. 

కరోనా వైరస్ నేపథ్యంలో దేశమంతా నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కొనసాగుతుండడంతో... నిత్యావసరాలు మినహా వేరే ఏ ఇతర దుకాణాలకు కూడా తెరిచి ఉంచడానికి అనుమతి లేదు. 

ప్రజలు నిత్యావసరాలు కొనడానికి బయటకు వెళ్లినా ఖచ్చితంగా సోషల్ డిస్టెంసింగ్ పాటించాల్సిందే. ఇంకొన్ని రాష్ట్రాల్లోనయితే... ఏకంగా కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇంతటి నిషేధాజ్ఞలు ఉండగా కొందరు మాత్రం అధికారం చేతిలో ఉంది కదా అని తమకు ఇష్టం వాచినట్టు ఈ నియమాలను తుంగలో తొక్కుతూ... ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. 

తాజాగా ఇలాంటి ఒక సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. బీజేపీ కి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే తన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు ఉచి త రేషన్ పంచాడు. ఈ సమయంలో ఇలా పంచడం మంచిదే అని అంతా అనొచ్చు. కానీ ఆయన ఇంటింటికి వెళ్లి పంచకుండా... ప్రజలనే తన ఇంటి వద్దకు రమ్మన్నాడు. ప్రజలంతా అక్కడకు చేరుకోవడంతో ఇన్ని రోజులుగా నిర్వహిస్తున్న లాక్ డౌన్ కు అర్థం లేకుండా పోయిందని అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. 

వివరాల్లోకి వెళితే... మహారాష్ట్ర వార్ధా జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దాదారావ్ కెచే తన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు రేషన్ పంచుతున్నాడని తెలిసి దాదాపుగా ఒక 100 మంది ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఈ తతంగం నడుస్తుండగానే పోలీసులు అక్కడకు చేరుకొని వారిని చెదరగొట్టేసారు. 

సదరు ఎమ్మెల్యే అధికారుల నుండి ఇందుకు సంబంధించి ముందస్తు అనుమతులు తీసుకోలేదని, అతని మీద అంటువ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. 

మరోపక్క ఎమ్మెల్యే మాత్రం ఈ ఘటనతో తనకు ఏ విధమైన సంబంధం లేదని, ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని ఆరోపించారు. ఒక్కసారిగా 100 మంది వరకు చేరుకోవడంతో అధికారులు ఎవరు వచ్చారు ఏ ప్రాంతం వారు అని ఆరా తీశారు. ఎవరైనా క్వారంటైన్ లో ఉన్న ఇండ్ల నుంచి వచ్చారా అనే విషయమై లోతుగా దర్యాప్తును ఆరంభించారు. 

click me!