కరోనా సంక్షోభం వేళ పౌర విమానయాన రంగంలో తొలి వేటు పడింది. 45 వేల మంది సిబ్బంది గల బ్రిటిష్ ఎయిర్వేస్ 12 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
లండన్: కరోనా సంక్షోభం విమానయాన పరిశ్రమపై తీవ్రంగానే పడింది. ప్రపంచవ్యాప్తంగా ప్యాసింజర్ విమాన సర్వీసులన్నీ నిలిచిపోవటంతో వివిధ దేశాల విమానయాన సంస్థలు తమ ఉద్యోగులను తొలగించే పనిలోపడ్డాయి.
కరోనాతో సంస్థ పునర్నిర్మాణం తప్పదన్న బ్రిటిష్ ఎయిర్వేస్
తొలిసారి బ్రిటిష్ ఎయిర్‌వేస్ దాదాపు 12వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపింది. కరోనా సంక్షోభం తర్వాత సంస్థను పునర్‌నిర్మించే క్రమంలో ఉద్యోగులను తొలగించక తప్పదని బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
కరోనా సంక్షోభం నుంచి కోలుకోవడానికి ఏళ్ల గడువు
ఈ సంక్షోభం నుంచి కోలుకోవడానికి ఏళ్లు పడుతుందని ఈ ఇంటర్నేషనల్ కన్సాలిడేటెడ్ ఎయిర్ లైన్స్ గ్రూప్ తెలిపింది. ఈ ఇంటర్నేషనల్ కన్సాలిడేటెడ్ ఎయిర్ లైన్స్ సంస్థకు లిబిరియా, ఎయిర్ లింగస్, వౌలింగ్ అనుబంధ సంస్థలు ఉన్నాయి.
సర్వీసులు నడవక తొలి త్రైమాసికంలో నష్టాల బాట
ప్రయాణ సర్వీసులు లేక ఈ ఏడాది తొలి త్రైమాసికంలో బ్రిటిష్ ఎయిర్వేస్ నష్టాలను చవి చూసింది. గతేడాది తొలి త్రైమాసికంలో 135 మిలియన్ల డాలర్ల లాభాలు గడించిన 580 మిలియన్ల డాలర్ల నష్టాన్ని చవి చూసింది.
బ్రిటిష్ ఎయిర్వేస్ సంస్థకు 45 వేల మంది సిబ్బంది
బ్రిటిష్ ఎయిర్వేస్ రెవెన్యూ కూడా 13 శాతం అంటే 4.6 బిలియన్ల యూరోలకు పడిపోయింది. ఈ సంస్థ 45 వేల మంది ఉద్యోగులను కలిగి ఉన్నది. ఇందులో 16,500 మంది క్యాబిన్ సిబ్బంది పని చేస్తున్నారు. క్యాబిన్ సిబ్బందిలో 3,900 మంది పైలట్లు ఉన్నారు.
2019 నాటి డిమాండ్ రావాలంటే ఏళ్లు పడుతుందన్న లుఫ్తాన్సా
2019 నాటి స్థాయికి విమాన సర్వీసులకు ప్రయాణికుల నుంచి డిమాండ్ రావడానికి కొన్నేళ్లు పడుతుందని బ్రిటిష్ ఎయిర్వేస్ సంస్థ ప్రత్యర్థి ఎయిర్ లైన్స్ లుఫ్తాన్సా పేర్కొంది. మరోవైపు వైమానిక రంగం కోలుకోవడానికి మరో రెండు-మూడేళ్లు పట్టొచ్చని అమెరికా విమానాల తయారీ సంస్థ బోయింగ్ సీఈవో డేవిడ్ కాల్‌హూన్ చెప్పారు.
డివిడెండ్ల పునరుద్ధరణకు ఐదేళ్ల టైం పడుతుందన్న బోయింగ్
విమాన ప్రయాణాలకు మునపటి డిమాండ్ రావాలంటే సమయం పడుతుందని బోయింగ్ కంపెనీ సీఈవో డేవిడ్ కాల్‌హూన్ అభిప్రాయపడ్డారు. తమ డివిడెంట్ రేట్లను పునరుద్ధరించడానికి మరో ఐదేళ్ల సమయం పడుతుందని, అలాగే వచ్చే ఆరు నెలల్లో కంపెనీ అప్పులు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
స్పైస్ జెట్ పైలట్లకు రెండు నెలల జీతాల కోత
స్పెస్ జెట్ తమ పైలట్లకు ఏప్రిల్, మే నెలల జీతాలు చెల్లించేది లేదని తెలిపింది. కార్గో విమానాలు నడిపిస్తున్న పైలట్లకు మాత్రం వేతనాల్లో కోతపెట్టలేదు. అది కూడా విమానాలు నడిపిన గంటలకు లెక్కగట్టి చెల్లింపులు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు తమ పైలట్లకు సంస్థ ప్రతినిధులు లేఖ రాశారు.
ఆంక్షలు తొలగించగానే సర్వీసుల ప్రారంభానికి స్పైస్ జెట్
విమాన ప్రయాణాలపై కేంద్రం ఆంక్షలు సడలించిన వెంటనే సర్వీసులను పెంచేందుకు సిద్ధమవుతున్నట్టు స్పైస్ జెట్ తెలిపింది. భారత విమానయాన సంస్థల్లో అత్యంత చౌకగా సేవలు అందించే స్పైస్‌జెట్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఇదిలా ఉండగా ఇండిగో మాత్రం మెజారిటీ ఉద్యోగులకు ఏప్రిల్ నెల పూర్తి జీతం ఇస్తామని ఇది వరకే ప్రకటించింది.