కరోనా వైరస్ తర్వాత నెలకొన్న పరిణామాలు భారత్‌లో మరో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికేలా ఉన్నాయి. డ్రాగన్ లో ఉత్పాదక కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలకు భారత్ ఆశా కిరణంగా కనిపిస్తున్నది. ఇటీవలి వరకు ఆసియా దేశాల్లో చైనా కేంద్రంగా తమ వ్యాపార, పారిశ్రామిక రంగాలను అమెరికా సహా పలు అభివృద్ధి చెందిన దేశాలు విస్తరిస్తున్నాయి. అయితే, ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి చైనాలోనే పుట్టడం, అక్కడ ఉత్పాదక రంగం స్తంభించిపోవడం అంతర్జాతీయ సంస్థలను ఆర్థికంగా కుంగదీసింది.
న్యూఢిల్లీ: ఆసియాలో చైనా ఆధిపత్యానికి రోజులు దగ్గర పడ్డాయి. భారత్ రూపంలో డ్రాగన్ జోరుకు అడ్డుకట్ట పడేలా కనిపిస్తున్నది. ప్రపంచ జీడీపీలో అమెరికా తర్వాత స్థానంలో ఉంటూ, విశ్వ ఉత్పాదక కేంద్రంగా ఎదుగుతున్న చైనా పరుగులకు కరోనా వైరస్ బ్రేకులు వేసింది.
ప్రస్తుతం మానవాళి మనుగడే ప్రశ్నార్థకంగా మారిన ఈ మహమ్మారి.. గ్లోబల్ ఎకానమీని కుప్పకూల్చింది. ఈ క్రమంలో చైనా తయారీ రంగ సామర్థ్యం కూడా దెబ్బతిన్నది. అక్కడి విదేశీ సంస్థలన్నీ తమ కంపెనీలను మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
undefined
ఇది ఆయా దేశాలను తీవ్రంగా ప్రభావితం చేయగా, చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌ను మలుచుకోవాలన్న భావన సర్వత్రా వ్యక్తమవుతున్నది. అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి, భారత్‌లోని ఆ దేశ బడా కంపెనీల ప్రతినిధుల మధ్య గత వారం ఓ సమావేశం జరిగింది.
భారత్‌లోని అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఈ సమావేశాన్ని నిర్వహించింది. చైనా నుంచి వ్యాపారాలను తరలించడం, వాటిని భారత్‌లో నెలకొల్పడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.
చైనాలో వ్యాపారం చేస్తున్న అమెరికా సంస్థలకు ప్రత్యామ్నాయ పెట్టుబడి కేంద్రంగా భారత్ ఉండగలదన్న ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ట్రంప్ సర్కార్ సైతం ఇందుకు మద్దతు పలికింది.
‘ప్రస్తుతం చైనాలో జరుగుతున్న పలు పారిశ్రామిక కార్యకలాపాలకు అంతకంటే అనువైన దేశంగా భారత్ త్వరలోనే అవతరించగలదు’ అని అమెరికా విదేశాంగ శాఖలో దక్షిణాసియా దేశాల అసిస్టెంట్ కార్యదర్శి థామస్ వజ్దా విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత్‌లో అమెరికా సంస్థల విస్తరణకు వీలుగా ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందించాలని అమెరికా ఆధారిత కంపెనీలు కోరుతున్నాయి. అప్పుడే చాలా సంస్థలు భారత్‌కు వస్తాయని అంటున్నాయి. ఈ మేరకు మోదీ సర్కార్‌కు స్పష్టంగా తెలియజెప్పాల్సిన అవసరం ఉందని ఆయా సంస్థలు అమెరికా నాయకత్వానికి సూచిస్తున్నాయి.
భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు ఉన్నందున ఈ అంశాన్ని వీలైనంత త్వరగా తేల్చుకుంటే ఇరు దేశాలకు లాభదాయకమని వజ్దా అభిప్రాయపడుతున్నారు. కాగా, ఇటీవలి సమావేశంపై మాట్లాడేందుకు భారత్‌లోని అమెరికా దౌత్య వర్గాలు, దేశంలోని అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ వర్గాలు నిరాకరిస్తున్నాయి.
అయితే కరోనాతో చితికిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయడానికి విదేశీ పెట్టుబడులు చాలా అవసరమని, కాబట్టి అమెరికా సంస్థలను వ్యూహాత్మకంగా ఆకట్టుకోవడానికి ఇదే సరైన సమయమని కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రగతి శాఖ.. వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి ఈ అంశంపై అభిప్రాయ సేకరణ చేపడుతున్నది. ఇందుకోసం పలు మంత్రిత్వ శాఖలు, ఇతర శాఖల నుంచి సంయుక్త కార్యదర్శులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
‘కరోనా వైరస్ నేపథ్యంలో చైనాకు వాటిల్లే నష్టం.. భారత్‌కు లాభం కాగలదు. దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించాలి. పెట్టుబడులను ఆకట్టుకునేలా రాష్ర్టాలు శ్రమించాలి. ప్రస్తుతం చైనా నుంచి ఇతర దేశాలకు తమ ఉత్పాదక కేంద్రాలను తరలించాలని చాలా సంస్థలు చూస్తున్నాయి. ఈ అవకాశాలను భారత్ అందిపుచ్చుకోవాలి. అందుకు ఇదే సరైన సమయం’ అని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.