భారత్‌కు బ్రిక్స్ బ్యాంక్ చేయూత.. 100 కోట్ల డాలర్ల లోన్‌కు ఓకే

By Sandra Ashok Kumar  |  First Published May 14, 2020, 1:24 PM IST

కరోనా కష్టకాలం వేళ భారతదేశానికి రుణ సాయం చేసేందుకు న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ ముందుకు వచ్చింది. ఎమర్జెన్సీ అసిస్టెంట్ ప్రొగ్రామ్ కింద 100 కోట్ల డాలర్ల రుణం ఇవ్వడానికి అంగీకరించింది. 


షాంఘై: కరోనా వైరస్‌ నియంత్రణ కోసం భారత ప్రభుత్వం చేస్తున్న పోరుకు అండగా నిలిచేందుకు బ్రిక్స్ బ్యాంకు ముందుకు వచ్చింది. భారత్‌కు రుణ సహాయం అందించి బ్రిక్స్‌ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు మద్దతుగా నిలిచింది. ఎమర్జెన్సీ అసిస్టెంట్ ప్రొగ్రామ్ లోన్‌ కింద 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7,500 కోట్లు) రుణ సహాయం అందించినట్లు మీడియా ప్రకటన ద్వారా బ్యాంకు వెల్లడించింది. 

ఈ మేరకు గత నెల 30వ తేదీన భారతదేశానికి రుణ సాయం అందజేసేందుకు ఆ బ్యాంకు డైరెక్టర్ల నుంచి ఆమోద ముద్ర లభించింది. వైరస్ విజృంభణ వల్ల కలిగిన సామాజిక, ఆర్థిక నష్టాలను తగ్గించడానికి ఈ రుణం దోహదపడనుంది. 

Latest Videos

undefined

‘విపత్తు సమయంలో సభ్య దేశాలకు సహకరించడానికి ఎన్‌డీబీ కట్టుబడి ఉంది. కొవిడ్-19 కట్టడిలో భారత ప్రభుత్వం అభ్యర్థన, తక్షణ ఆర్థిక అవసరాలకు స్పందనగా ఎమర్జెన్సీ అసిస్టెంట్ ప్రొగ్రాం లోన్‌ ఆమోదించాం’ అని బ్యాంకు ఉపాధ్యక్షుడు, సీఓఓ గ్జియాన్‌ ఝు తెలిపారు.

also read  ప్రైవేట్ ఉద్యోగులకు ఊరట..పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ తగ్గింపు..

వైద్య రంగం అత్యవసర ప్రతిస్పందన, జనవరి 1, 2020 నుంచి సామాజిక బలోపేతం కోసం ఇప్పటి వరకు చేసిన ఖర్చులు, అలాగే మార్చి 1, 2021 వరకు కొవిడ్ 19 కట్టడిలో భాగంగా సామాజిక భద్రతకు అయ్యే వ్యయం ఈ ప్రొగ్రామ్ పరిధిలోకి వస్తాయి. సభ్య దేశాల సహాయార్థం బ్యాంకు తీసుకున్న చర్యలను ఎన్‌డీబీ బోర్డు ఆఫ్‌ గవర్నర్స్‌ స్వాగతించింది. 

అలాగే గత నెల 20వ తేదీన జరిగిన ఐదో వార్షిక సమావేశంలో కొవిడ్-19తో జరిపే పోరాటంలో బ్రిక్స్‌ దేశాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని సూచించింది. ఎన్‌డీబీ బ్యాంకును బ్రిక్స్‌ డెవలప్‌మెంట్ బ్యాంకు అని కూడా అంటారు. 

బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆఫ్రికా దేశాలు కలిసి దీన్ని ఏర్పాటు చేశాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, స్థిరమైన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం నిధులు సమీకరించడం దీని ముఖ్య లక్ష్యాలు.
 

click me!