లాక్‌డౌన్ లో ఆటోమొబైల్‌ కంపెనీల కొత్త మార్గాలు.. ఆన్‌లైన్‌ ద్వారా కార్ల అమ్మకాలు..

By Sandra Ashok Kumar  |  First Published Apr 28, 2020, 12:10 PM IST

కరోనా మహమ్మారి వ్యవస్థలో భారీగానే మార్పులు తీసుకొచ్చింది. ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం హోం’కు పరిమితం కాగా, దాదాపు ఏడాది కాలానికి పైగా సేల్స్ లేక ఉసూరుమంటున్న ఆటోమొబైల్ సంస్థలు తమ విక్రయాల కోసం ఆన్ లైన్ బాట పట్టాయి. 
 


న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో షోరూమ్‌లు మూతబడటంతో ఆటోమొబైల్‌ కంపెనీలు అమ్మకాల కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయి. తాజాగా ఆన్‌లైన్‌ బాట పడుతున్నాయి.

వాహనాల కొనుగోలు దారులు డీలర్ల దగ్గరకు రావాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే కొనుగోళ్లు జరిపేందుకు వీలుగా సేల్స్‌ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభించినట్లు హోండా కార్స్‌ ఇండియా సోమవారం వెల్లడించింది. ’హోండా ఫ్రమ్‌ హోమ్‌’ పేరిట ప్రత్యేక పథకాన్ని మొదలుపెట్టినట్లు వివరించింది.

Latest Videos

దీనితో దేశంలో ఎక్కడినుంచైనా, ఎప్పుడైనా బుకింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుందని హోండా కార్స్‌ తెలిపింది. త్వరలో దీన్ని దేశవ్యాప్తంగా అన్ని డీలర్‌షి‌లకు కూడా అనుసంధానం చేయనున్నట్లు సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేశ్‌ గోయల్‌ చెప్పారు.

మరోవైపు, హ్యుండాయ్‌ మోటార్స్ కూడా ఇటీవలే క్లిక్‌ టు బై పేరిట ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభించింది. దేశంలోని తన 500 డీలర్లకు పైగా గల నెట్ వర్క్‌ను హ్యుండాయ్ ఆన్‌లైన్ జాబితాలో చేర్చేసింది. టాటా మోటార్స్ సైతం క్లిక్ టు బై వేదికను మొదలుపెట్టింది. 
 
జర్మనీ ఆటోమొబైల్‌ దిగ్గజాలు ఫోక్స్‌వ్యాగన్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్‌ బెంజ్ కూడా భారత్‌లో ఆన్‌లైన్‌ అమ్మకాలు ప్రారంభించినట్లు వెల్లడించాయి. ఇంటి నుంచే కస్టమర్లు తమకు నచ్చిన మోడల్‌ ఎంపిక చేసుకుని, బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించేలా సేల్స్, సర్వీసెస్‌ పోర్ట్‌ఫోలియోను డిజిటలీకరణ చేసినట్లు ఫోక్స్‌వ్యాగన్‌ తెలిపింది.

అటు లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సైతం ‘కాంటాక్ట్‌లెస్‌ ఎక్స్‌పీరియన్స్‌’ పేరిట ఆన్‌లైన్‌ విక్రయాలకు శ్రీకారం చుట్టింది. దీని ద్వారా కొత్త, ప్రీ–ఓన్డ్‌ బీఎండబ్ల్యూ కార్లను కొనుగోలు చేయొచ్చని, సర్వీస్‌ బుక్‌ చేసుకోవచ్చని, ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు జరపవచ్చని సంస్థ భారత విభాగం తాత్కాలిక ప్రెసిడెంట్‌ అర్లిండో టెక్సీరా తెలిపారు. 

also read ఉద్యోగులకు గుడ్ న్యూస్: జీతాల్లో కోత లేదు... కొలువులు యధాతథం

ఇక మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా కూడా ’మెర్క్‌ ఫ్రం హోమ్‌’ పేరిట ఆన్‌లైన్‌ సేల్స్‌ ప్లాట్‌ఫాంను రూపొందించినట్లు వెల్లడించింది. తమ డీలర్ల వద్ద కార్ల స్టాక్ ఉంటుందని, అయితే, కొనుగోలుదారులు తమకు నచ్చిన మోడల్ కారు కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. 

మెర్సిడెజ్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓ మార్టిన్ స్కెవెంక్ మాట్లాడుతూ ఫుడ్ ఆన్ లైన్ ఆర్డర్ మాదిరిగానే మెర్సిడెజ్ కార్ల కొనుగోలుకు కూడా ఆన్ లైన్ లో ఆర్డర్లు ఇవ్వొచ్చునన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాహనాల కొనుగోలు దారుల్లో 25 శాతం మంది 2025 నాటికి ఆన్ లైన్ కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు.  

ఎంజీ మోటార్స్, మారుతి సుజుకి, టయోటా తదితర ఆటోమొబైల్ సంస్థలు ఆన్ లైన్ విక్రయాల బాట పట్టాయి. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత డిజిటల్ సేల్స్ పెరుగుతున్నాయని ఆటోమొబైల్ సంస్థలు తెలిపాయి. లాక్ డౌన్ తర్వాత భయాందోళనతో షోరూములకు వచ్చే కస్టమర్లు తగ్గిపోయారని పేర్కొన్నాయి. 

ఆటోమోటివ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ జాటో డైనమిక్స్ అధ్యక్షుడు రవి భాటియా మాట్లాడుతూ ఆటోమొబైల్ సంస్థలు ఇంతకుముందే ఆన్ లైన్ విక్రయాల్లోకి దిగితే బాగుండేదన్నారు. వెబ్ సైట్లలో కార్ల ధరలు, మోడల్స్, ఫీచర్లను అప్ డేట్ చేస్తే వినియోగదారులకు సౌలభ్యంగా ఉంటుందన్నారు. అలాగే ఆయా సంస్థల వెబ్ సైట్లలో తమ డీలర్ల జాబితాను కూడా జత చేస్తే సత్ఫలితాలు ఉంటాయని తెలిపారు. 

పలు ఆటోమొబైల్ సంస్థలు ఆన్ లైన్ లోనే వాహనాల సర్వీసింగ్ బుకింగ్ నమోదు చేసుకుంటున్నాయి. ఒకవేళ అందుబాటులో ఉంటే మున్ముందు ఆన్ లైన్ లోనే సర్వీసింగ్ బుక్ చేసుకుంటామని భారత్ లో సగం మందికి పైగా వాహనాల వినియోగదారులు పేర్కొన్నారని డెల్లాయిట్ కన్సల్టెన్సీ తెలిపింది. 

click me!