కరోనా మహమ్మారిని నియంత్రించడానికి విధించిన లాక్ డౌన్ అమలులో ఉండటం వల్ల నాలుగు కోట్ల మందికి మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉండవని అంచనా. ఇప్పటికే 2.5 కోట్ల మంది తమ మొబైల్ ఫోన్లు పని చేయక, విడి భాగాలు దొరకక ఇబ్బందుల పాలవుతున్నారని ఐసీఈఏ ఆందోళన వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లు, విడి భాగాల అమ్మకాలపై ఇలానే నిషేధం కొనసాగితే మే నెలాఖరు నాటికి నాలుగు కోట్ల మంది వినియోగదారుల వద్ద మొబైల్ హ్యాండ్ సెట్లు ఉండబోవని ఓ అంచనా. ఇదివరకే వారి వద్ద ఉన్న మొబైల్ పాడైపోవడమో, ఆగిపోవడం వల్ల ఈ విధంగా జరిగే అవకాశం ఉన్నదని ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ (ఐసీఈఏ) పేర్కొంది.
ఇప్పటికే 2.5 కోట్ల మంది తమ మొబైల్ ఫోన్లు సరిగా పనిచేయక, కొత్త ఫోన్లు కొనలేక, విడిభాగాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారని ఐసీఈఏ పేర్కొంది. లాక్‌డౌన్ వేళ కేవలం నిత్యావసరాల విక్రయాలకు మాత్రమే అనుమతి ఉంది.
లాక్ డౌన్ అమలులో ఉండటం వల్ల మొబైల్, విడిభాగాల అమ్మకాలపై నిషేధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆపిల్, ఫాక్స్‌కాన్, షియోమీ వంటి కంపెనీలు సభ్యులుగా ఉన్న ఐసీఈఏ వీటి అమ్మకాలపై నిషేధం ఎత్తివేయాలని కోరుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలిపింది.
దేశంలో ప్రతి నెలా 2.5 కోట్ల కొత్త మొబైళ్ల అమ్మకాలు జరుగుతాయని ఐసీఈఏ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 85 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉన్నారని, ఇందులో కనీసం 0.25 మంది మొబైల్ సరిగా పనిచేయక ఇబ్బంది పడుతున్నారని పేర్కొంది.
also read ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్..ఉచితంగా డిస్నీ, హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్..
ఈ లెక్కన 2.5 కోట్ల మంది కొత్త మొబైళ్లు దొరక్క, పాత వాటిని రిపేర్ చేయించుకోలేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్లు ఐసీఈఏ తెలిపింది. లాక్ డౌన్ ఐదో వారం నుంచి టెలికం, ఇంటర్నెట్, బ్రాడ్ కాస్ట్, ఐటీ సర్వీసుల నిర్వహణకు అనుమతినిచ్చిన కేంద్రం మొబైల్ ఫోన్ల విక్రయానికి మాత్రం అంగీకరించలేదు.
ఏప్రిల్ 20 నుంచి ఆన్‌లైన్‌లో మొబైళ్లు, టీవీలు, ఫ్రిజ్‌లు విక్రయాలకు తొలుత అనుమతి ఇచ్చినా ఒక్కరోజు ముందు ఈ నిర్ణయాన్ని కేంద్ర హోం శాఖ వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మొహింద్రూ స్పందిస్తూ ‘దశలవారీగా మొబైల్ ఫోన్లను ఆన్‌లైన్‌లో, రిటైల్‌గానూ విక్రయాలు జరిపేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం’ అని తెలిపారు.
ట్రేడర్స్ బాడీ కైట్, ఐసీఈఏ ఈ మేరకు హోంమంత్రి, హోంశాఖ కార్యదర్శి, వాణిజ్య-పరిశ్రమలశాఖ మంత్రి, డీపీఐఐటీ సెక్రటరీ తదితరులను కలిసి వినతిపత్రం సమర్పించామని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మొహింద్రూ చెప్పారు.