కరోనా ఎఫెక్ట్‌తో ఆటో ఎక్స్‌పోకు చైనా సంస్థలు డుమ్మా..?

By Sandra Ashok Kumar  |  First Published Feb 4, 2020, 11:30 AM IST

రెండేళ్లకోసారి ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఆటో ఎక్స్ పో జరుగుతుంది. ఈ ఏడాది జరిగే ఎక్స్ పోలో భారీగా పాల్గొనాలని చైనా సంస్థలు ప్రణాళికలు వేసుకున్నాయి. కానీ తానొకటి తలిస్తే, దైవం మరొకటి తలచిందన్నట్లు ప్రపంచానే వణికిస్తున్న ‘కరోనా’ వైరస్ ప్రభావంతో చైనా ఆటోమొబైల్ సంస్థలు ఈ ఎక్స్ పోకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
 


న్యూఢిల్లీ: ‘కరోనా’ వైరస్.. చైనాలోని వుహాన్ నగరం కేంద్రంగా బయటకు వచ్చిన వైరస్ ఇది. ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది. ఢిల్లీలో ఈ వారం ప్రారంభం కానున్న ‘ఆటో ఎక్స్‌పో 2020’ పైనా కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్‌లో రెండేళ్లకోసారి నిర్వహించే ఈ ఆటో షో, ఆటో విడిభాగాల ఎగ్జిబిషన్లలో ఈసారి చైనా కంపెనీలు భారీగా పాల్గొననున్నట్లు వాహన పరిశ్రమ అసోసియేషన్లు ఇప్పటికే ప్రకటించాయి.

ఎంజీ మోటార్స్‌, గ్రేట్‌ వాల్‌ మోటార్స్‌, బీవైడీ తదితర చైనా వాహన కంపెనీలు ఆటో షోలో తమ కొత్త మోడళ్లు ప్రదర్శిస్తాయని భారత వాహన తయారీదారుల సంఘం (సియాయ్‌) తెలిపింది.గతంలోనూ చైనా కంపెనీలు మన ఆటో ఎక్స్‌పోలో పాల్గొన్నా, పెద్ద సంఖ్యలో సంస్థలు రానుండటం ఇదే తొలిసారి. ఇక విడిభాగాల ఎగ్జిబిషన్‌లోనూ 200కు పైగా చైనా కంపెనీలు పాల్గొంటాయని ఆటోమోటివ్‌ కాంపొనెంట్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఏసీఎంఏ) తొలుత తెలిపింది. కానీ, కరోనా వైరస్‌ విజృంభించడంతో పరిస్థితులు తారుమారయ్యాయి.

Latest Videos

undefined

also read హ్యుండాయ్ మోటర్స్ నుండి కొత్త మోడల్ స్పోర్ట్స్ కారు....
 
కరోనా వైరస్ వల్ల అసలు ఆటో షోలో చైనా కంపెనీల ప్రాతినిధ్యంపైనే అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే పలు చైనా వాహన సంస్థల ప్రతినిధులు తమ భారత పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆటో షో వివరాలను రిపోర్ట్‌ చేసేందుకు భారత్‌కు రావాల్సిన 90కి పైగా చైనా జర్నలిస్టుల్లోనూ ఇప్పటికే చాలా మంది టూర్‌ రద్దు చేసుకున్నారు. 

చైనా కంపెనీలకు కేటాయించిన ప్రదర్శన స్లాట్లను, స్టాళ్ల కేటాయింపును మాత్రం రద్దు చేయలేదని ఆటో షో నిర్వాహకులు అంటున్నారు. కాకపోతే, కరోనా వైరస్‌ ప్రభావంతో ఈసారి చైనా ప్రతినిధుల ప్రాతినిధ్యం అంతంత మాత్రమేనని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.ఈ ఏడాది ఆటో షోలో పాల్గొనేందుకు తమ కంపెనీ తరఫున చైనా నుంచి ఎవరూ రావడం లేదని ఎంజీ మోటార్స్‌ ప్రతినిధి తెలిపారు. చైనాలో ఈ వైరస్‌ వ్యాప్తి చెందకముందే తమ ప్రతినిధులు ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చారని గ్రేట్‌ వాల్‌ మోటార్స్‌ అంటోంది.

also read ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు కొత్త టెక్నాలజీ....

ఆటో షో వేదికలోని 40 వేల చదరపు మీటర్ల స్థలంలో చైనా కంపెనీలకు కేటాయించింది 20శాతం. వాహన విడిభాగాల ఎక్స్‌పోలో పాల్గొనబోతున్న చైనా సంస్థలు 200 పైమాటే. ఆటో ఎగ్జిబిషన్ ఈ నెల ఏడో తేదీ నుంచి 12వ తేదీ వరకు ఢిల్లీ నగర శివారుల్లోని గ్రేటర్ నోయిడాలో జరుగనున్నది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఆటో విడిభాగాల సంస్థల ప్రదర్శన ఈ నెల ఆరో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు సాగుతుంది. 

సియాం అధ్యక్షుడు రాజన్ వధేరా స్పందిస్తూ.. ‘భారత ఆరోగ్య శాఖ జారీ చేసిన సలహాలు, సూచనల మేరకు ఈ ప్రదర్శన నిర్వహణ వేదిక వద్ద తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు చర్యలు చేపడుతున్నాం. అవసరమైన మౌలిక వసతులను సైతం ఏర్పాటు చేస్తున్నాం’ అని తెలిపారు.ఏసీఎంఏ ప్రెసిడెంట్‌ దీపక్‌ జైన్‌ మాట్లాడుతూ ‘ఎగ్జిబిషన్‌లో పాల్గొనబోతున్న చైనా కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఇప్పటివరకైతే ఏ సంస్థ కూడా వైదొగలేదు. ప్రదర్శనను సురక్షితంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నాం’ అని చెప్పారు. 

click me!