మార్కెట్‌లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నా ఆటోమొబైల్ దిగ్గజాలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు నిత్యం నూతన మోడల్ కార్లను ఆవిష్కరిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా టయోటా కిర్లోస్కర్ కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ మేరకు ఇన్నోవా క్రిస్టా, ఫార్చూనర్ మోడల్ కార్లను అప్ డేట్ చేసి విపణిలోకి ప్రవేశపెట్టింది. మరోవైపు జర్మనీ లగ్జరీ మోడల్ కారు బీఎండబ్ల్యూ కూడా విపణిలోకి జడ్4 రోడ్ స్టర్ మోడల్ కారును ఆవిష్కరించింది.
ముంబై: టయోటా కిర్లోస్కర్ మోటార్స్ మార్కెట్‌లోకి అప్‌గ్రేడ్ వెర్షన్‌తో కూడిన ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్‌లను విడుదల చేసింది. రూ.14.93 లక్షల నుంచి రూ.33.60లక్షల మధ్యలో వీటి ధర ఉంటుంది. వీటిల్లో పలు కొత్త అప్‌గ్రేడ్‌లను టయోటా అందుబాటులోకి తీసుకొచ్చింది.
హీట్ తగ్గింపు విండోస్, యూఎస్బీ ఫాస్ట్ చార్జింగ్ పోర్టుతో ఇన్నోవా క్రిస్టా
ఇన్నోవా క్రిస్టాలో హీట్ తగ్గించే అద్దాలు, సరికొత్త లెదర్ సీట్లు, యూఎస్‌బీ ఫాస్ట్ చార్జింగ్ పోర్టు వంటివి ఉన్నాయి. దీని ధర రూ.14.93లక్షల నుంచి రూ.22.43లక్షల మధ్యలో ఉంది. ఇన్నోవా టూరింగ్ స్పోర్ట్స్ మోడల్ ధర మాత్రం రూ.18.92 లక్షల నుంచి రూ.23.47లక్షల వరకు ఉంది.
కస్టమర్ల ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఫార్చూనర్, ఇన్నోవా క్రిస్టా అప్‌డేషన్
ఫార్చ్యూనర్ మోడల్ కారులోనూ హీట్‌ని తగ్గించే అద్దాలను అమర్చారు. సీట్లలో మార్పులు చేర్పులు చేశారు. దీని ధర రూ.27.83లక్షల నుంచి రూ.33.60 లక్షల వరకు ఉంది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా ఈ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టయోటా మోటార్స్ డిప్యూటీ ఎండీ ఎన్ రాజ తెలిపారు.
బీఎండబ్ల్యూ జెడ్4 రోడ్‌స్టర్ రూ.64.9లక్షలు
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత విపణిలోకి జెడ్ 4 రోడ్‌స్టర్ సరికొత్త వెర్షన్ కారును విడుదల చేసింది. దీని ధర రూ.64.9లక్షలు పలుకుతుంది. ఇది రెండు వేరియంట్లలో లభించనున్నది. బీఎండబ్ల్యూ జెడ్ 4 ఎస్‌డ్రైవ్20ఐ, బీఎండబ్ల్యూ జెడ్4 ఎం40ఐ మోడళ్లను విడుదల చేసినట్లు తెలిపింది.
జడ్ 4 రోడ్‌స్టర్ ధర రూ.64.9 లక్షల నుంచి మొదలు
బీఎండబ్ల్యూ జెడ్4 ఎస్‌డ్రైవ్ ధర రూ.64.9లక్షలు కాగా, జెడ్4 ఎం40ఐ ధరను రూ.78.9లక్షలుగా నిర్ణయించారు. ‘సుదీర్ఘ చరిత్ర కలిగిన రోడ్‌స్టర్ వాహనాల్లో సరికొత్త బీఎండబ్ల్యూ జెడ్4 రోడ్‌స్టర్ మరింత ఉత్తమమైంది. శక్తివంతమైన ఇంజిన్, ఆకట్టుకునే డిజైన్, రెండు సీట్లు కలిగిన ఈ ఓపెన్‌టాప్ క్లాసిక్ రోడ్‌స్టర్ మిమ్మల్ని రేపటి ప్రపంచంలోకి తీసుకెళ్తుంది’ అని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు హన్స్ క్రిస్టియన్ తెలిపారు.