11 ఏళ్లలో గరిష్ఠ స్థాయికి విద్యుత్ వాహనాలు: నీతి ఆయోగ్

By Siva Kodati  |  First Published Apr 7, 2019, 11:43 AM IST

2030 నాటికి భారతదేశంలో విద్యుత్ వాహనాల వినియోగం గరిష్ఠ స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ నిర్ధారించింది. ప్రభుత్వం కూడా బడ్జెట్, బడ్జెటేతర రాయితీలు కల్పించి దశల వారీగా విద్యుత్ వాహనాలను ఉత్పత్తిని ప్రోత్సహించాలని సూచించింది. 


భారతదేశంలో విద్యుత్ వాహనాల వినియోగం 2030 నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని నీతి ఆయోగ్ రూపొందించిన నివేదిక పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఫేమ్-2’ పథకం వల్ల సుమారు 80 శాతం ద్విచక్ర వాహనాలు, 30% ప్రైవేట్ కార్లు విద్యుత్ వినియోగానికి అనువుగా మారతాయని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది.

‘భారత్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్: ప్రోగ్రెస్ టు డేట్ అండ్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్’ అనే పేరుతో నీతి ఆయోగ్, రాకీ మౌంటేన్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా ఈ నివేదిక రూపొందించాయి.

Latest Videos

‘ఫేమ్ -2’ కింద కొనుగోలు చేసే వాహనాలకు రాయితీలు కల్పించడంతో ఆయిల్ వినియోగం ఆదా చేయడంతోపాటు కర్బన ఉద్గారాల నుంచి ఉపశమనం లభిస్తుందని తేల్చింది.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పూర్తిస్థాయిలో ‘ఫేమ్-2’ అమల్లోకి వస్తే 2030 నాటికి 30 శాతం ప్రైవేట్ కార్లు, 70 శాతం వాణిజ్య వినియోగ కార్లు, 40 శాతం బస్సులు, 80 శాతం ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు విద్యుత్ వినియోగానికి అనువుగా మారతాయి‘ అని ఈ నివేదిక పేర్కొన్నది. 

ఫేమ్-2తో నేరుగా ఆదా చేసే కంటే విద్యుత్ వాహనాల జీవిత కాలంలో పలు రెట్లు కర్బన ఉద్గారాల నుంచి లబ్ధి చేకూరుతుంది. ‘ఫేమ్-2’ అమలులోకి తేవడంతో 2030 నాటికి 846 మిలియన్ల టన్నుల కర్బన ఉద్గారాల ఉత్పత్తి కాకుండా ఆదా అవుతుంది.

ఫేమ్ -2 పథకం కింద పని చేయనున్న విద్యుత్ బస్సులు తమ జీవిత కాలంలో 3.8 బిలియన్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాయి. తద్వారా 5.4 మిలియన్ల టన్నుల కర్బన ఉద్గారాల నుంచి మినహాయింపు లభిస్తుంది. అంటే దాని విలువ రూ.17.2 వేల కోట్లు అని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొన్నది. 

విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని, ద్రవ్య, ద్రవ్యేతర రాయితీలను కల్పించడం ద్వారా దశల వారీగా విద్యుత్ వాహనాల ఉత్పత్తిని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని నీతి ఆయోగ్, రాకీ మౌంటేన్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్త నివేదిక ప్రభుత్వానికి సూచించింది. విద్యుత్ వినియోగంలో కీలకమైన బ్యాటరీల తయారీకి ప్రోత్సాహాలు కల్పించాలని పేర్కొన్నది. 

click me!