తక్కువ ధరకే మార్కెట్లోకి మహీంద్రా ఎస్‌యూ‌వి ఎలక్ట్రిక్‌ కార్...

By Sandra Ashok KumarFirst Published Jan 10, 2020, 10:48 AM IST
Highlights

 కార్ల వినియోగదారులకు మహీంద్రా అండ్ మహీంద్రా చౌక ధరకే విద్యుత్ కారును అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తోంది. వచ్చే త్రైమాసికంలో విడుదల చేయనున్న ఈకేయూవీ 100 మోడల్ కారు ధర రూ.9 లక్షల లోపే ఉంటుంది.

న్యూఢిల్లీ: భారతదేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ)లో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని చౌక ధరకే అందుబాటులోకి తెచ్చుకునే రోజు ఎంతో దూరంలో లేదని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా చెప్పారు. విద్యుత్ ఎస్‌యూవీ మోడల్ ఈ-కేవీయూ 100 కారును రూ.9 లక్షల లోపే ఈ ఏడాది ఏప్రిల్- జూన్ మధ్య ఆవిష్కరిస్తామన్నారు. 

also read సోనీ కంపెనీ నుండి మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్...

మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి విపణిలోకి అడుగు పెట్టనున్న విద్యుత్ వాహనం ఈకేయూవీ 100 ఇదే ధరలో అందుబాటులో ఉన్న టాటా టైగోర్ ఈవీ, ఎంజీ మోటార్స్ జడ్ఎస్ ఈవీ, టాటా నెక్సన్ ఈవీలతో పోటీ పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈకేయూవీ100 మోడల్ కారును ఎస్110 కోడ్ పేరుతో పిలుస్తున్నారు. 

ఈ ఏడాది మాస్ మార్కెట్‌ను ఆకర్షించే విద్యుత్ వాహనాల్లో మహీంద్రా ఈకేయూవీ100 ఒకటి అని భావిస్తున్నారు. తొలుత 2018 ఆటో ఎక్స్ పోలో దీన్ని ప్రదర్శించారు. ఈకేయూవీ మోడల్ కారు 40 కిలోవాట్ల సామర్థ్యంతోపాటు 53 బీహెచ్పీ, 120 ఎన్ఎం టార్చి విడుదల చేయగల సామర్థ్యం ఉంటుంది. 15.9 కిలోవాట్ల లిథియం ఆయాన్ బ్యాటరీ గల ఈ కారు ఇంజిన్ ఒక్కసారి చార్జి చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 

అక్టోబర్- డిసెంబర్ మధ్య ‘ఆటమ్ (క్వాడ్రి సైకిల్)’, 2021లో ఉన్నత శ్రేణి ఎక్స్ యూవీ 300 మోడల్ కారును విపణిలోకి తీసుకు వస్తామని పవన్ గోయెంకా చెప్పారు. విద్యుత్ వాహనాల (ఈవీ) కొనుగోలు చేయాలంటే ధరలు, చార్జింగ్ వ్యవస్థలు ప్రధాన అవరోధంగా నిలిచాయన్నారు. 

also read ఆటోమొబైల్ రంగంపై కార్మిక సమ్మె ఎఫెక్ట్... మూడు వేల మంది అరెస్ట్...

అందుబాటు ధరలో విద్యుత్ వాహనాలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కొన్ని రకాల చర్యలు తీసుకోవాలని పవన్ గోయెంకా సూచించారు. ఫైనాన్స్‌ను అందించడంలో ప్రాధాన్యం ఇవ్వాలని, కొన్ని రకాల విడిభాగాల దిగుమతులపై సుంకాన్ని తగ్గించాలని పవన్ గోయెంకా చెప్పారు. అప్పుడే దేశంలో ఈ-మొబిలిటీ పెరిగే అవకాశం ఉందని తెలిపారు. 

ప్రస్తుతం మహీంద్రా.. ఈ-వెరిటో, ఈ2ఓ ఎలక్ర్టిక్‌ కార్లను విక్రయిస్తోంది. కాగా, రానున్న కాలంలో మరిన్ని ఎలక్ర్టిక్‌ వాహనాలు వస్తాయని పవన్ గోయెంకా తెలిపారు. రోడ్లపైకి ఎక్కువ వాహనాలు వస్తే వాటిని వినియోగించే వారు పెరుగుతారన్నారు. విద్యుత్ వాహనాల తయారీదారులు ధరలను 8-10 శాతం వరకు తగ్గించాల్సిన అవసరం ఉందని, తాము కూడా ఇదే పనిలో ఉన్నామని పవన్ గోయెంకా చెప్పారు. ఈ దిశగా తాము ఈ-వెర్టిగో ధరను రూ.12 లక్షల నుంచి రూ.11 లక్షలకు తేగలిగామని తెలిపారు. 
 

click me!