రూ.2 కోట్ల కారు... అదుపు తప్పి తుక్కు తుక్కు

By Arun Kumar P  |  First Published Mar 27, 2019, 3:17 PM IST

లగ్జరీ, స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ‘లంబోర్ఘినీ’ తాజాగా అభివృద్ధి చేసిన సరికొత్త స్పోర్ట్స్ కారు మూడు రోజుల క్రితం నిర్వహించిన ప్రదర్శనలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దాని ఖరీదు అక్షరాల రూ.2.2 కోట్లు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరలైంది.


లండన్: ప్రదర్శన కోసం తీసుకొచ్చిన సరికొత్త లంబోర్గిని స్పోర్ట్స్ కారు క్షణాల్లో తుక్కైపోయింది. ఈ వీడియోను ‘సూపర్‌ కార్స్‌ ఆన్‌ ది స్ట్రీట్స్‌’ అనే యూట్యూబ్‌ ఛానల్‌ అప్‌లోడ్‌ చేసింది. వెంటనే  ఇది వైరలైంది. ఈ నెల 24 మధ్యాహ్నం 1.30 గంటలకు లండన్ నగరంలో జరిగిన లంబోర్గిని హరికేన్‌ ప్రదర్శనలో ఈ ఘటన చోటు చేసుకొంది.  

ఒక ఇరుకైన వీధిలో విలాసవంతమైన కార్లు వరుసగా కొలువుదీరి ఉన్నాయి. కార్లు ప్రదర్శన ఇస్తున్నాయి. అదే సమయంలో గ్రే కలర్‌ లంబోర్గిని హరికేన్‌ కారు అక్కడికి వచ్చింది. ఆ కారు ఖరీదు దాదాపు రూ.2.2 కోట్లు. ఆ కారు తన వంతు రాగానే రయ్‌మని దూసుకు వెళ్లింది. 

Latest Videos

కొన్ని క్షణాల్లోనే అదుపు తప్పి పక్కన ఉన్న చెట్టును, ఆ తర్వాత గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు బాయ్ నెట్‌ పూర్తిగా దెబ్బతింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. కన్నీటి పర్యంతమవుతూ డ్రైవర్‌ దానిలో నుంచి బయటకు వచ్చాడు.

కోట్ల విలువ చేసే కారు పూర్తిగా దెబ్బ తిన్నందుకు భావోద్వేగానికి గురయ్యాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సంబంధిత డ్రైవర్‌పై భారీగా ఫైన్ విధించడంతోపాటు అతడి లైసెన్స్ రద్దు చేయాలని ప్రతిపాదించారు. మరి కొందరు ఇటువంటి కార్లు నడిపే హక్కు వారికి లేదని కామెంట్లు చేశారు. 

click me!