మేడిన్ ఇండియా: జాగ్వార్ ‘వేలార్’ బుకింగ్స్ షురూ, అందుబాటు ధరలోనే!

By rajesh y  |  First Published Apr 10, 2019, 11:26 AM IST

టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ ‘వేలార్’ మోడల్ కారు దేశీయ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. గమ్మత్తేమిటంటే ఈ కారు ఇండియాలోనే తయారైంది. దీని ధర కేవలం రూ.72.47 లక్షలు మాత్రమే. వీటిని కోరుకునే వినియోగదారులు ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు.
 


న్యూఢిల్లీ: టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్ఐఎల్) కూడా ప్రధాని నరేంద్ర మోదీ ‘మేడిన్ ఇండియా’ ఇన్షియేటివ్‌తో స్ఫూర్తి పొందినట్లు కనిపిస్తోంది. భారత్‌లో తయారు చేసిన రేంజ్‌ రోవర్‌ వేలర్‌ కారు కొనుగోళ్లకు వినియోగదారుల నుంచి బుకింగ్స్‌ ప్రారంభించినట్లు జేఎల్‌ఆర్ మంగళవారం ప్రకటించింది. దీని ధర రూ. 72.47 లక్షలుగా ఉంది. 

జాగ్వార్ లాండ్ రోవర్ వేలార్ మోడల్‌ పెట్రోల్‌, డీజిల్‌ వెర్షన్లలో లభించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ‘ఆటోమొబైల్‌ రంగంలో ఉన్న పోటీని దృష్టిలో పెట్టుకొని అత్యుత్తమ డిజైన్‌, లగ్జరీ, ఆధునిక సాంకేతికను అందిస్తూనే అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న రేంజ్‌ రోవర్‌ వేలార్‌ ప్రజల అభిరుచులకు మరింత దగ్గరగా ఉంటుంది’ అని  జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోహిత్‌ సూరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

Latest Videos

అంతేకాకుండా దేశీయంగా ఈ మోడల్‌ను తయారు చేస్తున్నామంటే భారత మార్కెట్‌పై సంస్థకు ఉన్న నిబద్ధతను తెలిసేలా చేస్తుందని రోహిత్‌ సూరి అన్నారు. ఈ మోడల్‌ను బుక్‌ చేసుకున్నవారికి మే నెల మొదటి వారంలో డెలివరీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ఇప్పటికే ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎఫ్‌, ఎక్స్‌జే, ఎఫ్‌-పేస్‌, డిస్కవరీ స్పోర్ట్‌, రేంజ్‌ రోవర్‌ ఎవోక్ లాంటి మోడళ్లను దేశీయంగా ఉత్పత్తి చేస్తుంది.

2.0 లీటర్ల పెట్రోల్ (184 కిలోవాట్ల), 2.0 లీటర్ డీజిల్ (132 కిలోవాట్ల) సామర్థ్యం గల పవర్ ట్రైన్లు అమర్చారు. దిగుమతి చేసుకున్న జాగ్వార్ లాండ్ రోవర్ కార్ల ధరలతో పోలిస్తే దీని ధర 15 శాతం తక్కువగా ఉంటుంది. బ్రిటన్‌లో మెరుగైన డిజైన్లు, లగ్జరీ, టెక్నాలజీతో రూపుదిద్దుకున్న కార్లకు కాంపిటీటివ్ ధరలకు వినియోగదారులకు ‘వేలార్’ కారు అందుబాటులోకి తెస్తున్నట్లు రోహిత్ సూరి తెలిపారు. 
 

click me!