కరోనా లాక్ డౌన్ ప్రభావం ఆటోమొబైల్ సంస్థలపై గణనీయంగానే పడింది. మహీంద్రా అండ్ మహీంద్రా కొన్ని వాణిజ్య వాహనాలు.. బొలేరో అండ్ స్కార్పియో వాహనాలు మాత్రమే విక్రయించగలిగామని తెలిపింది.
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) అమ్మకాల్లో తగ్గుదల కనిపించింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కొన్ని సడలింపులు ఇచ్చిన తర్వాత గత నెల రెండో వారంలో ఆటోమొబైల్ సంస్థల కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి.
కానీ కంటైన్మెంట్ జోన్లు ఎక్కువగా నగరాల పరిధిలో ఉండటంతో 2019తో పోలిస్తే గత నెల వాహనాల అమ్మకాల్లో 79 శాతం తగ్గుదల నమోదైంది. అలాగే ఎగుమతులు కూడా 80 శాతం మేర తగ్గాయి. మే నెల మొత్తం అమ్మకాలలో 79 శాతం క్షీణించి మే నెలలో 9,560 యూనిట్లకు చేరుకొన్నదని సోమవారం మహీంద్రా అండ్ మహీంద్రా ఓ ప్రకటనలో తెలిపింది.
గత ఏడాది ఇదే నెలలో కంపెనీ 45,521 యూనిట్లను విక్రయించినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఒక ప్రకటనలో తెలిపింది. 2019లో ఇది 43,056 యూనిట్లుగా ఉన్నది. ఎగుమతులు కూడా భారీగా తగ్గిపోయాయి. సోమవారం నాటికి 80 శాతం ఎగుమతులు తగ్గి 484 యూనిట్లకు చేరుకొన్నాయి. అంతకుముందు ఏడాది 2,365 యూనిట్ల వాహనాలు ఎగుమతయ్యాయి.
ట్రాక్టర్ల విక్రయాలు కూడా ఒక్క శాతం తగ్గాయి. మే నెలలో ట్రాక్టర్ల విక్రయాలు ఒక శాతం తగ్గి 24,341 యూనిట్లుగా నమోదయ్యాయిని మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది.
గత ఏడాది మే నెలలో విక్రయాలు 24,704 యూనిట్లుగా ఉన్నాయి. కాగా, దేశీయ ట్రాక్టర్ల విక్రయాలు స్థిరంగా ఉండి గత ఏడాది కన్నా అధికంగా విక్రయాలు నమోదయ్యాయి. గత ఏడాది 23,539 యూనిట్లుగా ఉండగా.. ప్రస్తుతం 24,017 యూనిట్లుగా నమోదైనట్లు సంస్థ పేర్కొన్నది.
also read అమ్మకాల్లేక నీరసించిన ఆటోమొబైల్ రంగం..కానీ అక్కడ ఫుల్ డిమాండ్..
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రభావం నేపథ్యంలో పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్ల కారణంగా మే నెలలో పనితీరు మందగించిందని మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్‌రామ్ నక్రా చెప్పారు. కంపెనీ తన డీలర్‌షిప్‌లలో 70 శాతం తెరిచిందని, రిటైల్ అమ్మకాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
లాక్‌డౌన్ నిబంధనల్లో కొంత సడలింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నందున రాబోయే నెలల్లో డిమాండ్ పెరుగుతుందని ఆశిస్తున్నట్టు విజయ్‌రామ్ నక్రా పేర్కొన్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా ప్రారంభ దశలో కొద్ది సంఖ్యలో వాణిజ్య వాహనాలు, ఎస్‌యూవీ బ్రాండ్ మోడల్ వాహనాలైన బొలేరో, స్కార్పియో వ్యాన్లను ఎక్కువగా విక్రయించామన్నారు.
కేంద్ర ప్రభుత్వ స్థాయిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలించినా, రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షలు కొనసాగుతుండటంతో వాహనాలకు డిమాండ్ తక్కువగా ఉందని మహీంద్రా అండ్ మహీంద్రా చెబుతోంది.
కాగా, కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి విక్రయాలు 89 శాతం పడిపోయాయి. 2019తో పోలిస్తే మారుతి సుజుకి సేల్స్ 89 శాతం పడిపోయి 13,865 యూనిట్లకు చేరుకున్నాయి.
ఇక ఎంజీ మోటార్స్ ఇండియా రిటైల్ విక్రయాల్లో కేవలం 710 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. హలోల్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌లో 30 శాతం పనులు మాత్రమే ప్రారంభించామని ఎంజీ మోటార్స్ వెల్లడించింది.