కరోనా ఎఫెక్ట్: పర్సనల్ వెహికల్స్ కి ఇక ఫుల్ డిమాండ్..ప్రజా రవాణాకు స్వస్తి..

By Sandra Ashok Kumar  |  First Published May 25, 2020, 10:26 AM IST

కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజల అభిరుచులు క్రమంగా మారుతున్నాయి. సామాజిక దూరం పాటించాల్సిన తరుణంలో ప్రజా రవాణాకు ప్రజలు స్వస్తి పలుకనున్నారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత వాహనాలకు గిరాకీ పెరగనున్నది.
 


న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ భయంతో దేశంలో వ్యక్తిగత ప్రయాణికుల వాహనాలకు గిరాకీ పెరగనున్నది. ఆర్టీసీ, రైళ్లు వంటి ప్రజారవాణా వ్యవస్థల్లో ప్రయాణం చేయడానికి ప్రజలు భయపడడమే ఇందుకు కారణం. 

రైళ్లు, బస్సుల్లో ప్రయాణించేటప్పుడు సామాజిక దూరం పాటించాల్సి రావడం, పాటించినా ఎక్కడ కొవిడ్‌-19 కాటేస్తుందోనన్న భయాలు చాలా మందిని వెంటాడుతున్నాయి. దీంతో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత తక్కువ ధర ఉండే చిన్న సైజు ఎంట్రీ లెవల్‌ కార్లకు గిరాకీ ఏర్పడుతుందని మారుతీ సుజుకీ మార్కెటింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ప్రజల కొనుగోలు శకి తగ్గడం కూడా ఎంట్రీ లెవల్‌ కార్లకు డిమాండ్‌ పెంచుతుందని మారుతి సుజుకితోపాటు హోండా, టయోటా, టాటా మోటార్స్, హ్యుండాయ్ వంటి ఆటోమొబైల్ సంస్థలు భావిస్తున్నాయి.

Latest Videos

మారుతి సుజుకి సంస్థ ఇప్పటివరకు ఎగుమతులపై ఫోకస్ చేసింది. కానీ కరోనా నేపథ్యంలో తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే కార్ల ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వబోతున్నదని ఆ సంస్థ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. 

ఆర్థిక లావాదేవీల మందగమనం ప్రభావం వినియోగదారుల నుంచి తక్కువ ధరలో ఉండే ఎంట్రీ లెవల్‌ కార్లకు కొద్దిగా డిమాండ్‌ పెరిగినా ఈ ఏడాది పరిశ్రమకు నిరాశ తప్పదని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. జీఎ్‌సటీ తగ్గించడం వంటి చర్యలు ప్రకటిస్తే తప్ప అమ్మకాలు పుంజుకునే అవకాశం లేదని అంచనా వేస్తున్నాయి.

‘మేం స్మాల్ కార్లు, ఫస్ట్ టైం కొనుగోలుదారుల వైపు ద్రుష్టి మళ్లిస్తున్నాం. మా సంస్థకు దేశవ్యాప్తంగా గల 1800 డీలర్ షిప్‌ల్లో అందుకు డిమాండ్ కనిపించింది. మొత్తం డీలర్ షిప్ షోరూములను తిరిగి త్వరలో ప్రారంభిస్తాం’ అని మారుతి సుజుకి సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. ఇంతకుముందు కూడా వినియోగదారులు ఆకర్షణీయమైన బ్రాండ్ల వైపు ఆసక్తి చూపేవారని శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.

also read మహీంద్రా రూటులో మారుతి సుజుకి..వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌

కరోనా ప్రభావంతో ప్రజా రవాణాతో పాటు షేర్డ్‌ మొబిలిటీకీ చెక్‌పడనుంది. దీంతో ఎంట్రీ లెవల్‌  కార్లతో పాటు ఇంకా తక్కువ ధరలో వచ్చే యూజ్డ్‌ కార్లకూ డిమాండ్‌ పెరుగుతుందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఇక్కడ కూడా కొనుగోలుదారులు బ్రాండ్‌నేమ్‌ కంటే మంచి నిర్వహణతో చూసేందుకు బాగా ఉన్న కార్లనే ఎంచుకుంటారని హోండా కార్స్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేశ్‌ గోయల్‌ చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో ధోరణులను అంచనా వేయడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. 

రెండు నగరాల మధ్య ప్రయాణించాలన్నా వ్యక్తిగత వాహనాల వాడకానికే ప్రజలు ఇక ప్రాధాన్యం ఇస్తారని టయోటా కిర్లోస్కర్ అధికార ప్రతినిధి చెప్పారు. కేవలం ఎంట్రీ లెవల్ కార్లకే కాకుండా వివిధ రకాల మోడల్ కార్లకు డిమాండ్ ఉంటుందని తెలిపారు. 

టాటా మోటార్స్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ కరోనా ప్రభావంతో రవాణా, ప్రయాణాల విషయంలో ప్రజల ద్రుక్పథంలో గణనీయ మార్పులు తీసుకొచ్చిందని చెప్పారు. వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం ఇస్తుండటంతో వ్యక్తిగత వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నదన్నారు. 

ఇదిలా ఉంటే నాలుగు చక్రాల వాహనాల నుంచి కర్బన ఉద్గారాల విడుదలకు ప్రమాణాలపై కేంద్ర రహదారులు, రవాణాశాఖ నిబంధనలను విడుదల చేసింది. సెంట్రల్ మోటార్ వెహికిల్స్ (4వ సవరణ) రూల్స్-2020 పేరిట ఈ గెజిట్ జారీ చేసింది. పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్జీ, బయో మీథేన్, హైడ్రోజెన్, హైడ్రోజెన్ ప్లస్ సీఎన్జీ, డీజిల్, బయో డీజిల్ ఇథనాల్ తదితర వాహనాల నుంచి కర్బన ఉద్గారాల నియంత్రణ పరిమితులను ఇందులో నిర్దేశించింది.

click me!