ముగిసిన ఆటో ఎక్స్‌పో 2020 షో...సందర్శకుల అనూహ్య రెస్పాన్స్...

By Sandra Ashok KumarFirst Published Feb 13, 2020, 12:14 PM IST
Highlights

గ్రేటర్​ నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్​పో-2020 ముగిసింది. ఈ ఎక్స్​పోలో మొత్తం 70 నూతన ఉత్పత్తులను ఆవిష్కరించింది. 352 ఉత్పత్తులు ప్రదర్శనకు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. ఆటో ఎక్స్​పో -2020ని 6.80 లక్షల మంది సందర్శించారు.

న్యూఢిల్లీ: భారత్​లో ఈనెల ఐదవ తేదీన మొదలైన 'ఆటోఎక్స్​పో 2020' ముగిసిందని ఎక్స్​పో నిర్వాహకులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ నగర శివారులోని గ్రేటర్​ నొయిడాలో జరిగిన ఆటో ఎక్స్​పో 2020లో పలు కంపెనీలు మొత్తం 70 వరకు కొత్త ఉత్పత్తులు ఆవిష్కరించాయి. ఆర్థిక మందగమనం పరిస్థితులను అధిగమించి మరీ ఆటో ఎక్స్​పోను మొత్తం 6.80 లక్షల మంది సందర్శించారని భారత వాహనాల తయారీ సంఘం (సియామ్) తెలిపింది.  

108 కంపెనీల నుంచి 352 ఉత్పత్తుల ప్రదర్శన
ఈసారి ఆటో ఎక్స్​పోలో 108 కంపెనీల నుంచి 352 ఉత్పత్తులు ప్రదర్శనకు వచ్చాయని భారత వాహన తయారీ సంఘం (సియామ్) తెలిపింది. పర్యావరణ అనుకూలమైన వాహనాలకు ఈ ఆటో ఎక్స్​పోలో ప్రాధాన్యం కనిపించింది. ఆటోఎక్స్​పో-2020లో 35 వరకు విద్యుత్ వాహనాలను ఆవిష్కరించగా.. 15 కొత్త కాన్సెప్ట్​ వాహనాలు ప్రదర్శనకు వచ్చాయి.

also read ఆటో ఎక్స్‌పో 2020లో ఉన్న టాప్‌ ఎలక్ట్రిక్‌ కార్లు ఇవే !

ఆటో ఎక్స్ పోకు చైనా కంపెనీలు దూరం
ఈ ఏడాది ఆటో ఎక్స్​పో నుంచి దిగ్గజ వాహన తయారీ సంస్థలు.. టయోటా, బీఎండబ్ల్యూ, ఆడీ, ద్విచక్ర వాహన సంస్థలు హీరో మోటో కార్ప్​, బజాజ్ ఆటో, టీవీఎస్​ మోటార్స్​ దూరంగా ఉన్నాయి. కరోనా వైరస్​ చైనాను వణిస్తున్నందున ఎక్స్​పో నుంచి ఆ దేశ ప్రతినిధులు దూరంగా ఉన్నారు.

ఈ సంస్థల వాహనాల ఆవిష్కరణ
ఆటోఎక్స్​పో 2020లో దిగ్గజ సంస్థలైన మారుతీ సుజుకీ, హ్యుందాయ్​, టాటా మోటార్స్, మహీంద్రా&మహీంద్రా, రెనో, మెర్సిడెజ్​ బెంజ్​, వోక్స్​వ్యాగన్, స్కొడా సహా కొత్తగా కియా, హెక్టార్​ వంటి సంస్థలు తమ విద్యుత్​ వాహనాలను, ఎస్​యూవీ మోడళ్లను ప్రదర్శనకు ఉంచాయి.

ఆటో ఎక్స్ పోలో ఫేస్‌బుక్, జియో సందడి
ఆటోమోటివ్​ కాంపోనెంట్ మ్యానుఫాక్చరర్స్​ అసోసియేషన్ ఆఫ్​ ఇండియా (ఏసీఎంఏ), కన్ఫిడరేషన్ ఆఫ్​ ఇండియా (సీఐఐ)ల భాగస్వామ్యంతో సియామ్​.. ఆటో ఎక్స్​పో 2020ని నిర్వహించింది. ఇందులో ఫేస్ బుక్, జియో కూడా సందడి చేశాయి. 

2020లోనూ పతనంలోనే వాహన పరిశ్రమ
2020లోనూ వాహన పరిశ్రమ పతనంలోనే కొనసాగనుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్‌ సొల్యూషన్స్‌ విశ్లేషించింది. మాంద్యంతో భారత్‌లో నెలకొన్న డిమాండ్‌ లేమి దెబ్బకు తోడు చైనాను ఆర్థికంగా కుదిపేసిన కరోనా వైరస్‌ దేశీయ వాహన రంగంపై ప్రభావాన్ని చూపనున్నదని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే 2020లో భారత వాహన తయారీలో 8.3 శాతం క్షీణించనున్నదని అంచనా వేసింది.

2019లో 13.2 శాతం తగ్గిన వాహనాల ఉత్పత్తి
2019లోనూ ఆటోమొబైల్ వాహనాల ఉత్పత్తి 13.2 శాతం దిగజారింది.. దేశీయ డిమాండ్‌లో నెలకొన్న బలహీనతలు వాహన సేల్స్‌ను దెబ్బ తీయడంతో ప్రస్తుత ఏడాదీ ఈ రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కోనున్నదని ఫిచ్‌ విశ్లేషించింది. ముఖ్యంగా భారత్‌లో తయారు అయ్యే వాహనాలకు విడిభాగాలు అధికంగా చైనా నుంచే సరఫరా కావడం కూడా ఓ కారణమని పేర్కొంది. 

also read ఆటో ఎక్స్ పోలో కార్ల కంపెనీల జోష్‌ ....యాంకర్ల రాకతో

చైనా నుంచి ఇండియాకు 10-30% విడి భాగాలు సరఫరా
చైనా నుంచి ఇండియాకు సరఫరా అయ్యే ఆటోమోటివ్‌ విడిభాగాలు 10-30 శాతం ఉంటాయి. విద్యుత్‌ వాహనాల విభాగంలో ఇవి 2-3 రెట్లు అధికంగా ఉండటంతో భారీగా ఉత్పత్తిలో క్షీణత ఏర్పడవచ్చని పిచ్‌ పేర్కొంది. చైనాలో కరోనా వైరస్‌ పెరగడంతో విడిభాగాల సరఫరా నిలిచి పోయింది. 

జనవరిలోనూ తగ్గిన వాహనాల విక్రయాలు
దీంతో ఇండియాలో వాహనాలు తయారు చేయడానికి అడ్డంకి ఏర్పడి ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఫిచ్ పేర్కొంది. ప్రస్తుత ఏడాది జనవరిలోనూ దేశీయ ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు ఏకంగా 6.2 శాతం పడిపోయాయి. దీంతో వరుసగా మూడవ నెలలోనూ క్షీణత చోటు చేసుకున్నట్లైంది.  

నెమ్మదించిన జీడీపీ గ్రోత్ రేట్
జీడీపీ గ్రోత్ నెమ్మదించడం, వాహన ధరలు పెరగడంతో పాటు కొనుగోలుదారులపై ఒత్తిడి పెరగడంతో దేశీయ పాసింజర్‌ వాహన విక్రయాలు పడిపోయాయని ఆ పరిశ్రమ బాడీ అయినా సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యానుఫ్యాక్చర్స్‌ (సియామ్‌) పేర్కొన్న విషయం తెలిసిందే.

click me!