వసతులు కల్పించాకే భారత్‌లోకి లీవ్‌వైర్ ‘ఎలక్ట్రిక్’బైక్: హర్లీ

By Siva Kodati  |  First Published Mar 15, 2019, 1:11 PM IST

భారత్‌లో విద్యుత్ మౌలిక వసతులు కల్పించాకే లీవ్ వైర్ ‘ఎలక్ట్రిక్’ బైక్‌ను తీసుకొస్తామని హ్యార్లీ-డేవిడ్‌సన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ రాజశేఖరన్ తెలిపారు. 


భారతదేశంలో విద్యుత్ వాహనాలు నడిపేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించిన తర్వాతే తాము రంగ ప్రవేశం చేస్తామని అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం ‘హార్లీ డేవిడ్సన్’ పేర్కొంది.

ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల మార్కెట్లో విడుదల చేసిన లీవ్‌వైర్ ఎలక్ట్రిక్ బైకును భారత్‌లో మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నతర్వాతే విడుదల చేయనున్నట్లు హ్యార్లీ-డేవిడ్‌సన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ రాజశేఖరన్ ప్రకటించారు.

Latest Videos

గురువారం అమెరికాకు చెందిన లగ్జరీ బైకుల తయారీ సంస్థ హ్యార్లీ-డేవిడ్‌సన్ భారతీయ మోటార్ బైక్ రైడర్ల కోసం అందుబాటులోకి తీసుకు వచ్చింది. 1,200 సీసీ సామర్థ్యం కలిగిన ఫార్టీ-ఎయిట్ స్పెషల్‌గా విడుదల చేసిన ఈ బైకు ధరను రూ.10.98 లక్షలగా నిర్ణయించింది. 

హ్యార్లీ-డేవిడ్‌సన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ రాజశేఖరన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 1,600 సీసీ సెగ్మెంట్‌లో 90 శాతం మార్కెట్‌తో దూసుకుపోతున్నామని చెప్పారు. ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి 17 మోడల్ బైక్‌లను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 

ప్రస్తుతం ఈ విభాగంలో నాలుగు మోడళ్లను విక్రయిస్తున్నది హార్లీ డేవిడ్సన్. భారత్‌లో ప్రతియేటా 1,600 సీసీ కంటే అధిక సామర్థ్యం కల బైక్‌లు 600 యూనిట్లు అమ్ముడవుతున్నాయి.

గడిచిన కొన్నేళ్లుగా బిగ్ బైక్‌ల విభాగంలో నిలకడైన వృద్ధిని నమోదు చేసుకుంటున్న సంస్థ.. దీంట్లో తొలిస్థానంలో ఉన్నట్లు హ్యార్లీ-డేవిడ్‌సన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ రాజశేఖరన్ చెప్పారు. 

గతేడాదిలో హ్యార్లీ-డేవిడ్‌సన్ 3000 యూనిట్ల విక్రయాలు జరిపింది. ప్రస్తుతం సంస్థ రూ.5.33 లక్షలు మొదలు రూ.50.53 లక్షల లోపు ధర కలిగిన పలు మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్నది. భారత్‌లో చిన్న స్థాయి బైక్‌లకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో సంస్థ 200-500 సీసీ లోపు కెపాసిటీ కలిగిన బైక్‌లను విడుదల చేయనున్నట్లు గతేడాది ప్రకటించింది. 

ఫార్టీ ఎయిట్ స్పెషల్ బైక్‌తోపాటు స్ట్రీట్ గ్లైడ్ మోడల్ బైక్‌ను ఆవిష్కరించింది హార్లీ డేవిడ్సన్. ఫార్టీ ఎయిట్ స్పెషల్ బైక్ ధర రూ.10.98 లక్షలు కాగా, స్ట్రీట్ గ్లైడ్ మోడల్ బైక్ ధర రూ.30.53 లక్షలుగా ఉంటుంది.

స్ట్రీట్ గ్లైడ్ మోడల్ బైక్ 6.5 అంగుళాల టచ్ స్క్రీన్ బూమ్ బాక్స్ జీటీఎస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కలిగి ఉంటుంది. వాతావరణం, కమ్యూనికేషన్లు తదితర అంశాలను తెలిపే ఫీచర్లు చేర్చారు. 

ఇక స్పోర్ట్స్‌స్టర్ ప్లాట్‌ఫామ్‌పై థ్రో బ్యాక్ స్టైలింగ్ ట్రెండ్ బైక్‪గా ఫార్టీ ఎయిట్ బైక్ నిలువనున్నది. 116 ఏళ్ల వారసత్వం కల హార్లీ డేవిడ్సన్ సంస్థ పదేళ్ల క్రితం భారతదేశంలో తన అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది.

ఫార్టీ ఎయిట్ స్పెషల్ బైక్ 49 ఎంఎం ఫోర్క్స్‌తో ఫ్రేమ్ చేసిన 130 ఫ్రంట్ టైర్, ఫోర్జ్ చేసిన అల్టూమినియం ట్రిపుల్ క్లాంప్స్, గ్లాస్ బ్లాక్ తోపాటు 7.25 అంగుళాల పొడవైన టాల్ బాయ్ హ్యాండిల్ బార్ కూడా చేర్చారు.

click me!