మహీంద్రా ఎక్స్‌యూవీ 300 రికార్డ్: నెలలోపే 13 వేలు దాటిన బుకింగ్స్‌

By Siva Kodati  |  First Published Mar 15, 2019, 12:18 PM IST

దేశీయ ఆటోమొబైల్ విపణిలో మహీంద్రా అదరగొట్టింది. ఎక్స్‌యూవీ 300 కారును మార్కెట్లోకి విడుదల చేసిన నెల రోజుల్లోనే రికార్డు స్థాయిలో 13 వేల బుకింగ్స్ మార్క్‌ను దాటింది. 


దేశీయ ఆటోమొబైల్ మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా కాంప్యాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ300కి వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి విడుదలచేసిన ఎస్‌యూవీ శ్రేణి కంపాక్ట్‌ ‘ఎక్స్‌యూవీ300’ మోడల్ కారు నెలలోపే రికార్డు నెలకొల్పింది.

గత నెల 14న విపణిలో అడుగు పెట్టిన మహీంద్రా ఎక్స్ యూవీ 300 కోసం ఇప్పటివరకు 13 వేల బుకింగ్స్‌ వచ్చినట్లు సంస్థ తెలిపింది. ఎస్‌యూవీ శ్రేణిలో ఈ మోడల్‌ మొదటి మూడు స్థానాల్లో చోటు దక్కించుకుందని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

Latest Videos

దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ఎస్‌యూవీ కార్ల అమ్మకాల్లో కంపాక్ట్‌ ఎస్‌యూవీల అమ్మకాలు 40 శాతంగా ఉన్నాయి. అంతేకాక ఐదేళ్లుగా వేగంగా పుంజుకుంటున్న సెగ్మెంట్‌ కూడా ఇదే కావడం గమనార్హం.

‘గట్టి పోటీ ఉండే కంపాక్ట్‌ ఎస్‌యూవీ శ్రేణిలో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన మొదటి నెలలోనే 13 వేల బుకింగ్స్‌ రావడమే కాక  మొదటి మూడు స్థానాల్లో నిలిచాం. ఈ విభాగంలో 15 నుంచి 20 శాతం మార్కెట్‌ వాటా సాధించడమే లక్ష్యంగా సంస్థ ప్రణాళికలు వేస్తోంది’ అని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సేల్స్ అండ్ మార్కెటింగ్  చీఫ్‌ విజయ్‌ రాం నక్రా పేర్కొన్నారు. 

ఈ మొత్తం బుకింగ్స్‌లో 75 శాతం టాప్‌ ఎండ్‌ వేరియంట్స్ ఉండటం మాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోందని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ విజయ్ నక్రా అన్నారు.

ఎక్స్‌యూవీ 300 వేరియంట్ కార్ల ధరలు రూ. 7.90 లక్షల నుంచి రూ. 11.99 లక్షలుగా ఉన్నట్లు సంస్థ తెలిపింది. పెట్రోల్‌, డీజిల్‌ రెండు వెర్షన్లలో ఎక్స్‌యూవీ 300  కారు లభిస్తోంది. ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టాటా మోటార్స్ నెక్సాన్‌లకు పోటీగా సంస్థ ఈ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది.

భారత్‌లో అత్యధిక పోటీ విభాగమైన కాంప్యాక్ట్ ఎస్‌యూవీలో తొలి నెలలోనే 13 వేల బుకింగ్‌లు రావడం విశేషమని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ విజయ్ నక్రా పేర్కొన్నారు. 
 

click me!