జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ భారత దేశ విక్రయాలపై పెదవి విరిచింది. ఎన్నికల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది. అయితే తాజాగా 4.7 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం గల ‘ఎఎంజీ43 4మాటిక్ కౌప్’ మోడల్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది.
జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ దేశీయ మార్కెట్లోకి సరికొత్త మోడల్ కారును ఆవిష్కరించింది. తాజాగా భారత దేశ విపణిలోకి మెర్సిడెస్ బెంజ్.. ఏఎంజీ సీ 43 4మాటిక్ కౌప్ కారును ఆవిష్కరించింది. దీని ధర రూ.75 లక్షలుగా నిర్ణయించినట్లు బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో మార్టిన్ స్కేవెంక్ తెలిపారు.
రెండు డోర్లు కల ఏఎంజీ సీ43 4మాటిక్ కౌప్‌ను మూడు లీటర్ల వీ6 పెట్రోల్ ఇంజిన్‌తో తయారు చేసింది. 287 కిలోవాట్ల పవర్ సామర్థ్యం గల ఈ కారు కేవలం 4.7 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది.
ప్రస్తుత సంవత్సరంలో పది కార్లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ ప్రవేశపెట్టిన రెండో కారు ఇది కావడం విశేషం. మొత్తంమీద ఈ ఏడాదిపై ఆశావాద దృక్ఫతంతో ఉన్నట్లు, భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా పలు కార్లపై రాయితీ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
అయితే ఈ ఏడాది కార్ల విక్రయాలపై మెర్సిడెస్ బెంజ్ పెదవి విరిచింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎన్నికల తర్వాతే కార్ల విక్రయాలు పుంజుకుంటాయని మెర్సిడెస్ బెంజ్ వర్గాలు పేర్కొన్నాయి.
అమ్మకాలు నిలకడ స్థాయిలో ఉన్నాయని, గతేడాది పోలిస్తే భారీగా పెరిగే అవకాశాలేమి కనిపించడం లేదని, షోరూంలను సందర్శించడానికి ఎంతోమంది కస్టమర్లు వస్తున్నారని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ స్కేవెంక్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్లను కొనుగోలు చేసేందుకు సంశయిస్తున్నారని చెప్పారు.
అధిక వడ్డీరేట్లు, నిధుల కొరత కారణంగా నాన్-బ్యాంకింగ్ సంస్థలు రుణాలు ఇవ్వలేకపోవడం, వినియోగదారులు ఖర్చులను అదుపులో పెట్టుకోవడం వంటి కారణాలతో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో సెంటిమెంట్ బలహీనంగా ఉన్నదని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ స్కేవెంక్ అభిప్రాయపడ్డారు.
సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో అంతకుముందు రెండు నెలల పాటు కార్ల విక్రయాలు పడిపోనున్నాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ స్కేవెంక్ చెప్పారు.
ఫలితాల తర్వాత సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైతే భారీగా పుంజుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చేనెల 11వ తేదీ నుంచి నుంచి మే 19వ తేదీ వరకు ఏడు విడుతల వారిగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి.