కశ్మీర్ ఎఫెక్ట్: సెన్సెక్స్ 650 పాయింట్లు పతనం.. రూపీ @70.46

By Arun Kumar PFirst Published Aug 5, 2019, 3:15 PM IST
Highlights

స్టాక్ మార్కెట్లపై కశ్మీర్ ఉద్రిక్తత ప్రభావం గణనీయంగానే పడింది. సోమవారం మధ్యాహ్నం 11.20 గంటలు దాటే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 650 పాయింట్ల వరకు పతనమైంది. 

ముంబై: కశ్మీర్‌లో అనిశ్చితి పరిస్థితుల ప్రభావం దేశీయ మార్కెట్లపై భారీగానే పడింది. సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.35గంటల ప్రాంతంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్‌ 499 పాయింట్లు పతనమై 36,618 వద్ద కొనసాగింది. అదే సమయంలో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) సూచి నిఫ్టీ 164 పాయింట్లు కోల్పోయి 10,832 వద్ద ట్రేడయింది. 

పది గంటలకు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 650 పాయింట్ల పైగా నష్టంతో ట్రేడవుతుండగా, నిఫ్టీ 184 పాయింట్ల నష్టంతో 10,813 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.46 వద్ద కొనసాగుతోంది. ఇక కార్పొరేట్‌ ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. 

శుక్రవారం షార్ట్ కవరింగ్‌తో స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనించాయి. మరోవైపు చైనా యువాన్ విలువ 11 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పతనం కావడం కూడా మార్కెట్ సెంటిమెంట్ దెబ్బ తినడానికి మరో కారణంగా చెబుతున్నారు. 

హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, బ్రిటానియా, బజాజ్‌ ఫినాన్స్‌, హీరో మోటార్‌కార్ప్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. రంగాల వారీగా చూస్తే దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో నమోదవుతుండడం గమనార్హం. యువాన్ పతనం కాగా, ఆసియా ఖండ మార్కెట్లలోనూ డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది. 

click me!