విరాల్ ఆచార్య టార్గెట్!! ఆపై ఉర్జిత్ తదితరుల కట్టడి.. ఇదీ కేంద్రం వ్యూహం

By rajesh yFirst Published Nov 15, 2018, 10:29 AM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం తాననుకున్నదే చేస్తోంది. ఎన్నికల వేళ ప్రజలను ఆకట్టుకునే చర్యలు చేపట్టడానికి వీలుగా నిధులు సమకూర్చాలని ఆర్బీఐ ఒత్తిడి తెస్తున్న కేంద్రం ‘సెక్షన్ 7’ అస్త్రాన్ని ప్రయోగిస్తామన్నది. దీన్ని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య వ్యతిరేకించారు. కేంద్రం భగ్గుమన్నది. పరిస్థితి విషమిస్తే 19న బోర్డు భేటీ తర్వాత ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో కేంద్రం ఒకడుగు వెనుకేసి ఉర్జిత్ పటేల్ ను ఏమనకుండానే పరిస్థితిని తన అదుపులోకి తెచ్చుకోవాలని భావిస్తున్నది. బహిరంగ వ్యాఖ్యలను చేసిన విరాల్ ఆచార్యను సాగనంపి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవాలని కేంద్రం ఎత్తువేసింది. 

ముంబై: మరో ఐదు నెలల్లో మోగనున్న సార్వత్రిక ఎన్నికల నగారా.. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న తరుణం.. ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మ వంటి ఆర్బీఐలో సంక్షోభం ఏర్పడితే మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావాలన్నప్రధాని మోదీ వ్యూహం బెడిసికొట్టే అవకాశాలు ఉన్నాయి. 

ఈ నేపథ్యంలోనే మోదీ సారథ్యంలోని ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? ఈ నెల 19వ తేదీన జరిగే ఆర్బీఐ పాలక మండలి సమావేశం రసాభాసగా ముగియకుండా గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసే పరిస్థితులు తలెత్తకుండా చూసుకుంటున్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు బదులు కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకి మధ్య విభేదాలను ఒక్కమాటలో చెప్పాలంటే సెంట్రల్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేందుకు కేంద్రం చేస్తున్న యత్నాలను బయటపెట్టిన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్యపైనా ప్రభుత్వం గుర్రుగా ఉన్నదా? అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనను పక్కకు తప్పుకోవాలని రకరకాల ఒత్తిళ్లు తెచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఒకవేళ దిగి రాకుంటే అవిశ్వాసం ప్రవేశపెట్టి, మిగతా బోర్డు సభ్యులను తన దారికి తెచ్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం వ్యూహ రచన చేస్తున్నట్లు వినికిడి. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు అస్త్ర శస్త్రాలు సిద్దం చేస్తున్నాయి. అయినా దారికి రాకుంటే అప్పుడు పూర్తిస్థాయిలో 'సెక్షన్‌-7' ప్రయోగానికి కేంద్రం సిద్ధం అవుతోంది. 

ఆర్బీఐతో ఏర్పడిన అభిప్రాయ బేధాలు కొలిక్కి రాని పక్షంలో.. ఇక దూకుడుగానే ముందుకు సాగాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 19న జరిగే ఆర్బీఐ బోర్డు సమావేశంలో పరిణామాలను బట్టి భవిష్యత్ నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి తగినట్లు ప్రభుత్వం తన అస్త్రాలను సమాయత్తం చేస్తున్నట్టుగా సమాచారం.

తొలుత ఆర్బీఐ-కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదాన్ని బయటి ప్రపంచానికి తెలిసేలా ప్రవర్తిస్తూ.. ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా వ్యవహరించిన ఆర్బీఈ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్యపై కక్ష్య సాధింపు చర్యలతో దూకుడును మొదలు పెట్టాలని సర్కారు వర్గాలు భావిస్తున్నట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని వర్గాలను ఉటంకిస్తూ 'లైవ్‌మింట్‌' ఒక వార్తాకథనం ప్రచురించింది. 
వచ్చేవారం జరిగే ఆర్బీఐ బోర్డు సమావేశంలో విరాల్‌ను బాధ్యతల నుంచి తప్పించడానికి మిగతా డైరెక్టర్లతో ప్రభుత్వ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నారని పేరు చెప్పుకోవడానికి ఇష్ట పడని ఓ అధికారి వెల్లడించారు. బోర్డు సమావేశం నాటికి ఉర్జిత్‌, విరాల్‌తో సహా ఆర్బీఐ కీలక కార్యవర్గం దారికొస్తే సరి..! లేకుంటే వచ్చే బోర్డు మీటింగ్‌లో సెక్షన్‌-7లోని వెసులుబాటును ఉపయోగిస్తూ విరాల్‌ ఆచార్యపై అవిశ్వాస తీర్మానాన్ని తేవాలన్నది సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది. 

ఆర్బీఐ అంతర్గత సున్నిత విషయాలను బయటపెట్టడాన్ని తప్పుబడుతూ 11 మంది సభ్యుల్లో కనీసం నలుగురు ఆచార్యపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఇంటికి పంపించే అవకాశాలు ఉన్నాయని సదరు వర్గాలు తెలిపాయి. విరల్‌పై వేటు వేయడం ద్వారా మిగతా అధికారులకు ప్రభుత్వ సీరియస్‌నెస్‌ను పరోక్షంగా వెల్లడించాలన్నఅంతర్గత యోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. 

విరాల్‌ ఆచార్య వికెట్‌ పడితే, మిగతా అధికారులు సర్దుకుంటారని.. అప్పుడు ఆర్బీఐని ఇంటి సంస్థగా మార్చుకోవాలన్న తమ పని కూడా చాలా సులువవుతుందన్నది ప్రభుత్వంలోని కొందరు అధికారుల భావనగా తెలుస్తోంది. ఈ నెల 19న ఆర్బీఐ మీటింగ్‌లో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ మాట్లాడిన తర్వాత  సెక్షన్‌-7పై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. 

సెక్షన్ 7పై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గత అక్టోబర్‌లో జరిగిన బోర్డు మీటింగ్‌లో ఆర్ధిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ ప్రసంగం తర్వాత ఎనిమిది గంటల పాటు బోర్డు సమావేశం జరిగింది. ఈ సమయమంతా ప్రధానంగా రెండు అంశాలపైనే చర్చించినా ఒక ఏకాభిప్రాయానికి రాలేక పోయారు. 

ఈ సారి విరాల్‌ ఆచార్య వ్యాఖ్యలను బహిరంగంగా మీడియా ముందు ఎద్దేవా చేసిన గార్గ్‌ ఆయనపై కక్ష్య సాధింపునకు బోర్డు సమావేశానికి అవసరమైన అస్త్రాలను సమాయత్తం చేసుకుంటున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో 19న ఒక్కరోజు మాత్రమే షెడ్యూల్‌ చేసిన బోర్డు సమావేశంలో కూడా ఎలాంటి నిర్మాణాత్మక నిర్ణయాలను ఆశించలేమని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 

ఇందులో భాగంగానే  స్వయంగా ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) నష్ట నివారణ చర్యలకు దిగినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే గత వారం (ఈనెల 9న) ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ను రహస్యంగా తన కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడినట్లు వార్తలొచ్చాయి. 

ఎలాంటి సమాచారం లేకుండా ఢిల్లీ వచ్చిన ఉర్జిత్‌ పటేల్‌ పీఎంఓలోని సీనియర్‌ అధికారులతో సంప్రదింపులు జరిపా రన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధానితోనూ ఉర్జిత్‌ పటేల్‌ భేటీ అయ్యారని వివిధ అంశాలపై స్పష్టతనిచ్చినట్టుగా పీఎంవో వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో, రుణ నిబంధనలను ఆర్బీఐ సరళీకరించాలని ప్రభుత్వం కోరుకుంటున్న నేపథ్యంలో, ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 

కేంద్రంతో వివాదాస్పద అంశా లను పరిష్కరించుకునే దిశగా రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రయత్నాలు చేస్తోందని.. ఇందులో భాగంగా ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ గత వారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన ట్లుగా ప్రభుత్వం అనుకూల మీడియా ప్రచారం సాగిస్తోంది. పట్టింపులకు పోకుండా రెండు పక్షాలూ కొన్ని విషయాల్లో సర్దుకు పోవాలని నిర్ణయించినట్టు ఈ మీడియా కథనాలను వెల్లడిస్తుండడం విశేషం. 

ప్రధాని మోదీతో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ భేటీ విషయమై ఇటు ప్రభుత్వం నుంచి గానీ అటు ఆర్బీఐ నుంచి గానీ అధికారికంగా ప్రకటన వెలువడలేదు. ప్రభుత్వం-ఆర్బీఐ మధ్య వివాదం తారాస్థాయికి చేరి ఈనెల 19న బోర్డు సమావేశం సందర్భంగా, ఆర్బీఐ గవర్నర్‌ పదవికి ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయనున్నారన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో ఉర్జిత్‌ రహస్యంగా ప్రధానితో సమావేశం కావడం పలు అనుమాల నుకు తావిస్తోంది.
 

click me!