కేంద్రం ఒత్తిడితో దిగొచ్చిన వాట్సాప్: గ్రీవెన్స్ అధికారిగా కోమల్ లాహిరి

By Arun Kumar PFirst Published Sep 24, 2018, 10:35 AM IST
Highlights

ఎట్టకేలకు ఫేస్ బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ దిగి వచ్చింది. భారతదేశంలో ఫేక్ న్యూస్, వదంతుల నియంత్రణకు ఫిర్యాదుల అధికారిగా అమెరికాకు చెందిన కోమల్ లాహిరిని నియమిస్తున్నట్లు వెబ్‌సైట్‌లో అప్ డేట్ చేసింది. 

న్యూఢిల్లీ: ప్రముఖ మెసెంజర్‌ యాప్ వాట్సాప్‌ భారత్‌లో నకిలీ వార్తల వ్యాప్తిని నియంత్రించేందుకు మరో అడుగు ముందుకు వేసింది. వాట్సాప్ ద్వారా నకిలీ వార్తలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయన్న భారత ప్రభుత్వ ఆందోళనపై వాట్సాప్ సానుకూలంగా స్పందించింది. వీటిని నియంత్రించాలన్న ప్రభుత్వ ఆదేశాలకు సానుకూలంగా స్పందిస్తూ వాట్సాప్‌ భారత్‌లో గ్రీవెన్స్‌ అధికారిగా కోమల్‌ లాహిరిని నియమించింది. అమెరికాకు చెందిన కోమల్‌ వాట్సాప్ గ్లోబల్‌ కస్టమర్‌ ఆపరేషన్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. 

భారత్‌ వాట్సాప్‌లో తలెత్తే సమస్యలపై కోమల్‌ లాహిరి చర్యలు తీసుకోనున్నారు. అనంతరం వాట్సాప్ వెబ్‌సైట్‌లో ‘గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ ఫర్‌ ఇండియా’ అని అప్‌డేట్‌ చేసింది. వాట్సాప్‌ వినియోగదారులు ఈ అధికారికి ఫిర్యాదు ఈ- మెయిల్‌ ద్వారా గానీ, లిఖిత పూర్వకంగా గానీ ఫిర్యాదు చేయవచ్చని వాట్సాప్‌ తెలిపింది. అమెరికాలోని టెక్నాలజీ కంపెనీలు అనుసరిస్తున్న విధానాల ప్రకారం ఈ అధికారి పనిచేయన్నారని సమాచారం. 

వాట్సాప్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం వినియోగదారులు వాట్సాప్‌లోని ‘సెట్టింగ్స్’ కింద ఉండే ఆప్షన్ ద్వారా కంపెనీ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించాలి. నేరుగా అధికారిని కలిసి కూడా ఫిర్యాదులను సమర్పించవచ్చు. భారత్‌లో నకిలీ వార్తల వ్యాప్తిని నియంత్రించడానికి ప్రత్యేక సాఫ్టవేర్‌ను తయారు చేయాలని భారత్‌ వాట్సాప్‌ను కోరింది. అయితే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ తయారీ అసాధ్యమని వాట్సాప్‌ తేల్చి చెప్పింది. 

దీని వల్ల వినియోగదారుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని స్పష్టం చేసింది. కనీసం గ్రీవెన్స్ అధికారినైనా నియమించాలని కోరగా ఇందుకు వాట్సాప్ సానుకూలంగా స్పందించి అధికారిని నియమించింది. వాట్సాప్ ఇండియా గ్రీవెన్స్ అధికారి నియామకంపై వాట్సాప్ అధికార ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు. గత నెలాఖరులోనే వాట్సాప్ భారత్ వ్యవహారాలపై గ్రీవెన్స్ ఆఫీసర్ నియామకం పూర్తయిందని సమాచారం. 

ప్రస్తుతం భారతదేశంలో వాట్సాప్ వినియోగదారులు 20 కోట్ల మంది ఉంటారని అంచనా. గత జూలైలో ఒక్కో వినియోగదారుడి నుంచి ఐదుగురికి మాత్రమే వాట్సాప్ మెసేజ్ లు పంపేందుకు సంస్థ యాజమాన్యం పరిమితం చేసింది. 

click me!
Last Updated Sep 24, 2018, 10:35 AM IST
click me!