సబ్ ప్రైమ్ క్రైసిస్: మళ్లీ మాంద్యం అంచున ప్రపంచం

By sivanagaprasad kodatiFirst Published Sep 23, 2018, 5:17 PM IST
Highlights

యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం అంచుల్లో ఉన్నదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బ్రెగ్జిట్ సమస్యకు తోడు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, చైనా - అమెరికా వాణిజ్య యుద్ధం వంటి అంశాలు ప్రపంచ దేశాలను ఆర్థిక సంక్షోభం దిశగా తీసుకెళ్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి.

దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో అవకతవకలతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సబ్ ప్రైమ్ సంక్షోభం పొంచి ఉన్నదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ ప్రపంచ దేశాలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటాయని అంటున్నారు ఆర్థిక నిపుణులు. దిగ్గజ అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ లేమాన్‌ బ్రదర్స్‌ దివాలా ఊబిలో చిక్కుకుని ఇప్పటికి పదేళ్లయింది. తాజాగా బ్రెగ్జిట్.. పెట్రోలియం ధరలు.. చైనా - అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తదితర సమస్యలు పొంచి ఉన్నాయి.

10 ఏళ్ల క్రితం సబ్ ప్రైమ్ సంక్షోభం తర్వాత ఒకదాని తర్వాత మరొకటిగా చుట్టుముట్టిన సమస్యలు అమెరికా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాయి. దీని ప్రభావాన్ని ప్రపంచ దేశాలు చవిచూశాయి కూడా. మళ్లీ దశాబ్ద కాలం తర్వాత 2008 మాదిరి సమస్యలు తలెత్తడానికి ఆస్కారం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

అప్పట్లో తలెత్తిన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నుంచి ప్రపంచ దేశాలను గట్టెక్కించాలన్న ఏకైక లక్ష్యంతో అన్ని  దేశాలు కలసికట్టుగా కదిలాయి. కుప్పలు తెప్పలుగా, కట్టలు కట్టలుగా కరెన్సీని విచ్చలవిడిగా ముద్రించాయి. ఇంచుమించు 300 లక్షల కోట్ల డాలర్లు ఆర్థిక వ్యవస్థల్లోకి చొచ్చుకు వచ్చాయి. ప్రస్తుత మన కరెన్సీ ప్రకారం చూస్తే.. దాదాపు 20 వేల లక్షల కోట్ల రూపాయలు. ఈమొత్తంలో అధికశాతం ఫైనాన్షియల్‌ మార్కెట్లలోకి ప్రవేశించింది. 

ఇదే సమయంలో పలు దేశాలు వడ్డీ రేట్లను తగ్గించేశాయి. తద్వారా నిధుల లభ్యతను పెంచేశాయి. దీంతో ఎక్కువ వడ్డీ గిట్టుబాటయ్యే సాధనాల్లోకి నగదు తరలిపోయింది. ఓరకంగా చెప్పాలంటే.. ఎక్కువ వడ్డీనిచ్చే కొన్ని నాసిరకపు పెట్టుబడుల్లోకి సైతం నగదు తరలిపోయింది. ఇప్పుడదే పెద్ద సమస్యగా మారింది. ఎక్కువ వడ్డీ మాట దేవుడెరుగు.. అసలు సొమ్ములైనా తిరిగొచ్చే పరిస్థితులున్నాయా? అన్న సందేహాలు కలిగే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఇది గత సంక్షోభ పరిస్థితులను పునరావృతం చేసే స్థితిగతులను సృష్టిస్తోంది.

ప్రపంచ కరెన్సీలకు ప్రామాణికం డాలరన్న విషయం మనకందరికీ తెలిసిందే. సంక్షోభ వేళ వర్థమాన దేశాలు అధిక స్థాయిలో డాలర్లు సమకూర్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అదే సమయంలో అమెరికాలో వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉండటం.. వర్థమాన మార్కెట్లు ఊరిస్తూ ఉండటంతో.. నిధులు ఇటువైపు మళ్లాయి శక్తి పుంజుకునే ప్రక్రియలో వర్థమాన దేశాలు ప్రపంచ పెట్టుబడులపై ఎక్కువగా ఆధారపడిపోయాయి.

అవన్నీ బలుపు కాదని.. వాపు మాత్రమే నని తెలుసొచ్చేసరికి పరిస్థితి పీకల్లోతు ముంచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనే స్వరాలు వినవస్తున్నాయి. దానికి సంకేతాలు కూడా కానవస్తున్నాయి. ఇప్పుడిప్పుడే అమెరికాలో వడ్డీరేట్లు పెరగడం మొదలైంది. ఇన్నాళ్లు వర్థమాన మార్కెట్లను అంటిపెట్టుకుని ఉన్న రుణదాత సంస్థలు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునే ప్రయత్నిస్తాయి. దీంతో వర్థమాన దేశాల బుడగ భళ్లుమంటుందని ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు.

ఒకదానితో ఒకటి ముడిపడి ఉండటం.. పెట్టుబడుల విషయంలో పరస్పరం ఆధారపడిపోవడం.. ఏ ఒక్కదానికి సమస్య వచ్చినా.. రెండోది ఒడుదొడుకుల్లో చిక్కుకునే పరిస్థితులు ఎదురవడం.. నియంత్రణ వైఫల్యాలు గత సంక్షోభానికి ప్రధాన తార్కాణాలు. ఈ సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నాయి. రేపోమాపో ఇవన్నీ చాపకింద నీరులా ముంచేసే ప్రమాదం లేకపోలేదని కొలంబియా యూనివర్సిటీ న్యాయవిభాగ ఆచార్యులు, న్యాయమూర్తి కత్రిన్ పేర్కొన్నారు ‌.

ఆస్తుల విలువలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. ఒక మోస్తరు పెట్టుబడితో ఏదైనా ఆస్తిని సమకూర్చుకోవడం సామాన్యుడి వల్ల కాని పరిస్థితులు ఉన్నాయి. అంటే రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. అదే సమయంలో చేతిలో పుష్కలంగా డబ్బులున్న వ్యక్తి పెట్టుబడి పెడదామంటే సరైన సాధనాలే కనబడట్లేదు. ఎందుకంటే ఇప్పటికే వాటి స్థాయికి మించి రేట్లు పెరిగిపోవడంతో పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ సాహసం చేయరు. దీన్నిబట్టి చూస్తే మార్కెట్లో దిద్దుబాటు (కరెక్షన్‌) రావాల్సిన అవసరం ఉందని అర్థమవుతోంది. 

ఆర్థిక సమస్య పరిష్కారానికి ధరలు దిగి రావాల్సిన పరిస్థితి ఉందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క చిన్న సమస్య తలెత్తినా ప్రపంచ మార్కెట్లు ఏ క్షణాన్నైనా కుప్ప కూలిపోవచ్చు. బహుశా అది బ్రెగ్జిట్‌ సమస్య కావొచ్చు. అమెరికా-చైనా  మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం కావొచ్చుననని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. 

click me!