రూపీ@74రికవరీ కష్టమే?: కానీ తాత్కాలికమేనని కేంద్రం సూక్తులు

By pratap reddyFirst Published Sep 24, 2018, 7:35 AM IST
Highlights

రూపాయి విలువ ఈ ఏడాది 13 శాతానికి పైగా పతనమైంది. పరిస్థితి ఇలాగే కొనసాగి 74 దాటితే తిరిగి రికవరీ సాధించడం కష్టమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రూపాయి పతనం సాకుగా దేశీయ స్టాక్ మార్కెట్ల పతనంపై సెబీ, ఆర్బీఐ అప్రమత్తమయ్యాయి. రూపాయి పతనం తాత్కాలికమేనని కేంద్ర ఆర్థిక వ్యవహారాలశాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తేల్చేశారు.

ముంబై: సరిగ్గా ఐదేళ్ల క్రితం 2013లో దేశీయ ఆర్థిక పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం సూక్ష్మ ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. ప్రభుత్వ చురుకైన చర్యలు, రూపాయి పతనాన్ని నివారించేందుకు ఆర్బీఐ పరిమితంగా చర్యలు తీసుకోవడం గమనార్హం. రూపాయి విలువ ప్రస్తుతం 13 శాతానికి పైగా పతనమైంది. అయినా రూపాయి విలువ పతనాన్ని అడ్డుకునేందుకు సుస్థిరం చేసేందుకు చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మర్చండైజ్డ్ ఎగుమతులపై వాణిజ్య యుద్ధం ప్రభావం చూపుతోంది. పరిస్థితులు ఇలాగే ఉంటే రూపాయి విలువ అమెరికా డాలర్‌పై 74కు పతనమైతే మాత్రం తిరిగి రికవరీ కావడం కష్ట సాధ్యమని చెబుతున్నారు. 

2013లో అలా.. ఈ ఏడాది ఇలా


2013 మే నుంచి ఆగస్టు వరకు రూపాయి విలువ 21.7 శాతం పతనమైతే ఆర్బీఐ రంగంలోకి దిగి 14.34 బిలియన్ల డాలర్లను బహిరంగ మార్కెట్లో విక్రయించింది. రెపోరేట్లను 7.25 నుంచి 8 శాతానికి పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. పసిడి దిగుమతులపై ఆంక్షలు మరింత పెంచింది. ప్రస్తుతం 2018 జనవరి నుంచి ఇప్పటివరకు రూపాయి విలువ 14 శాతం వరకు పతనమైతే ఆర్బీఐ జోక్యం చేసుకుని బహిరంగ మార్కెట్లో 23 బిలియన్ల డాలర్లను విక్రయించింది. మరోవైపు రెపోరేట్లను 6 నుంచి 6.5 శాతానికి పెంచేసింది. 

దేశీయ మార్కెట్ల పతనంపై సెబీ, ఆర్బీఐ అలర్ట్


శుక్రవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిన నేపథ్యంలో ఫైనాన్షియల్‌ మార్కెట్లను అతి దగ్గరగా పర్యవేక్షిస్తున్నామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించాయి. సెన్సెక్స్‌ ఒక్కసారిగా 1,127 పాయింట్లను కోల్పోయిన అంశంపై పర్యవేక్షిస్తున్నామని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు విడివిడిగా ప్రకటించాయి.

ఎఫ్‌పీఐల నిబంధనలను సడలించిన సెబీ


విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) దేశీ మార్కెట్‌లో పెట్టే పెట్టుబడుల విషయమై కేవైసీ నిబంధనలను సవరించినట్లు సెబీ వెల్లడించింది.మౌలిక వసతుల కల్పన సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణాల చెల్లింపుల పరంగా విఫలమైనట్లు వెల్లడికావడం, నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలకు సంబంధించి ఆందోళనలు వ్యక్తం కావడం లాంటి పలు ప్రతికూల అంశాల కారణంగా శుక్రవారం మార్కెట్లు ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి మళ్ళిన విషయం తెలిసిందే.   

68-70 స్థాయికి రూపాయి: సుభాష్ చంద్ర గార్గ్


నిత్యవసరేతర వస్తు ఉత్పత్తుల దిగుమతులకు కళ్లెం వేసేలా కేంద్ర ప్రభుత్వం అతిత్వరలో తీసుకోబోయే చర్యలతో రూపాయి బలోపేతం కాగలదని, మళ్లీ 68-70 స్థాయికి చేరుకోగలదన్న కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికి డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 72.20 వద్ద ఉన్నది. 

రూపాయి పతనం తాత్కాలికమే


రూపాయి పతనం తాత్కాలిక పరిణామమని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్  అభివర్ణించారు. కాగా, రూపాయి క్షీణతను అడ్డుకునేందుకు ఇప్పటికే కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఫలితం లేకుండగా, సదరు చర్యలు ఇంకా పూర్తికాలేదని, పూర్తయితే సత్ఫలితాలు వస్తాయని సుభాష్ చంద్ర గార్గ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

click me!