
బ్యాంకు ఉద్యోగాలు సాధించాలని ఎంతో మంది యువత భావిస్తుంటారు. ఆ ఉద్యోగం మంచి సెక్యూరిటీని అందిస్తుంది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో పనిచేసే ఓ స్కేల్-3 మేనేజర్‌కు సంబంధించిన ఫార్మ్-16 ఒకటి వైరల్ అయింది. అందులో ఆయన జీతం రూ.35.24 లక్షలుగా ఉంది. ఓ మేనేజర్ కు ఇంత జీతమా అని ఇప్పుడు పెద్ద చర్చ మొదలైపోయింది. అయితే ఎస్‌బీఐ మేనేజర్ కు చేతికి ఎంత వస్తుంది అనే సందేహం ఎక్కువ మందికి ఉంటుంది.
స్కేల్-3 మేనేజర్‌గా ప్రమోషన్
వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ఈ ఉద్యోగి ఎనిమిదేళ్ల క్రితం ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)గా తన కెరీర్ మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన స్కేల్-3 మేనేజర్ స్థాయికి ప్రమోషన్ పొందారు. ఆయన ఫార్మ్-16లో కనిపించిన రూ.35.24 లక్షల వార్షిక ఆదాయం కనిపిస్తోంది. ఫార్మ్-16లో కనిపించే ఈ మొత్తంలో నెలవారీ జీతం మాత్రమే ఉండదు. నాలుగేళ్లకోసారి వచ్చే లీవ్ ఫేర్ కన్సెషన్ (LFC) ఎన్‌క్యాష్‌మెంట్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ లాంటి వన్-టైమ్ బెనిఫిట్స్ కూడా ఇందులో కలిపి ఉంటాయి. అందుకే ఈ మొత్తాన్ని నేరుగా నెల జీతంగా గానీ, చేతికొచ్చే జీతంగా గానీ అనుకోవడం సరికాదు.
చేతికొచ్చే జీతం ఎంత?
ఉద్యోగి జీతం నుంచి ఆదాయపు పన్ను (Income Tax), నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) కంట్రిబ్యూషన్లతో పాటు... తీసుకున్న ఇల్లు, కారు, టూ-వీలర్ లోన్ల EMIలు కూడా కట్ అవుతాయి. ఈ కోతలన్నీ పోగా మిగిలిన అసలు జీతమే (Take-home salary) బ్యాంక్ అకౌంట్‌లో పడుతుంది. ఈ వైరల్ సంఘటన, గ్రాస్ శాలరీకి, టేక్-హోమ్ శాలరీకి మధ్య ఉన్న తేడాపై జనాల్లో అవగాహన కూడా లేదు. ఫార్మ్-16లో కనిపించే మొత్తం వార్షిక ఆదాయమే ఉద్యోగి చేతికి వస్తుందనుకోవడం పొరపాటు. స్కేల్ 3 మేనేజర్ కు అతి తక్కువగా చేతికి నెలకు 90,000 రూపాయలు వస్తుంది. అలాగే సీనియారిటీని బట్టి లక్షన్నర రూపాయల వరకు చేతికి అందుతుంది.