విజయ్ మాల్యా అప్పగింత మరింత ఆలస్యం!!

By Sandra Ashok KumarFirst Published Jun 5, 2020, 10:26 AM IST
Highlights

విజయ్ మాల్యాను భారత్‌కు ఇప్పట్లో అప్పగించే అవకాశాలు కనిపించడం లేదు. దీనికి చట్టపరంగా తాము పరిష్కరించాల్సిన విషయం ఒకటి ఉన్నదని బ్రిటిష్ హై కమిషన్ పేర్కొనడమే నిదర్శనం.
 

న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకులకు దాదాపు రూ.9000 కోట్ల మేరకు రుణాలు ఎగవేసి లండన్‌లో తలదాచుకున్న కింగ్ ఫిషర్స్ మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియ ఇప్పట్లో జరిగే పనికాదని తెలుస్తోంది. బ్రిటన్ చట్టాల ప్రకారం మాల్యాను తిరిగి ఇండియాకు  రప్పించడం సమీప కాలంలో కష్టమే అనే సందేహం వ్యక్తమవుతోంది. 

చట్ట పరమైన నిబంధనల కారణంగా భారతదేశానికి అప్పగించలేమని బ్రిటిష్ హైకమిషన్ ప్రతినిధి వ్యాఖ్యలను ఉటంకిస్తూ సీఎన్‌బీసీ రిపోర్టు చేసింది. యూకే హైకమిషన్ ఈ విషయాన్ని ధృవీకరించిందని కూడా తెలిపింది. 

చట్ట సమస్యలను పరిష్కరించిన తరవాత మాత్రమే మాల్యాను పంపిస్తామని బ్రిటిష్ హై కమిషన్ పేర్కొంది. దేశీయ ఆంగ్ల టీవీ చానెల్ ‘ఎన్డీటీవీ’ కూడా ఇదే సంగతి పేర్కొంది. 

ఇది చాలా గోప్యమైన వ్యవహారమంటూ ఇంతకుమించి వివరాలను అందించేందుకు బ్రిటిష్ హై కమిషన్ ప్రతినిధి నిరాకరించారు. అలాగే ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా అంచనా వేయలేమన్నారు. 

వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని బ్రిటిష్ హై కమిషన్ ప్రతినిధి తెలిపారు. ముఖ్యంగా బ్రిటన్ చట్టపరమైన కారణాల వల్ల మాల్యాను అప్పగింత ఆదేశాలపై యూకే హోంశాఖ మంత్రి ప్రీతి పటేల్ సంతకం చేయక పోవడమే జాప్యానికి కారణమనే అంచనాలు నెలకొన్నాయి.

also read వడ్డీ మాఫీ చేస్తే బ్యాంకులకు లక్షల కోట్ల నష్టం: ఆర్‌బి‌ఐ

మరోవైపు మాల్యా న్యాయవాది ఆనంద్ దూబే కూడా మాల్యాను వెనక్కి రప్పించే వ్యవహారం తమ దృష్టిలో లేదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. కాగా పరారీలో ఉన్న మాల్యాను ముంబైకి తరలించనున్నారని, ఆయనతో పాటు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అధికారులు ఉంటారంటూ పలు వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. 

విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలని లండన్‌ హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పునకు వ్యతిరేకంగా మ్యాల్యా బ్రిటన్‌ సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకొనేందుకు గతనెలలో అనుమతి నిరాకరించడంతో ఇక ఆయనను భారత్‌కు తిరిగి తీసుకురావడం లాంఛనమేనని అంతా భావించారు. 

బ్రిటన్ అప్పగింత చట్టం ప్రకారం ఆ దేశ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన 28 రోజుల్లో సంబంధిత దేశానికి సదరు నిందితుడు లేదా? వ్యక్తిని అప్పగించాలి. కానీ ఆయా నేరస్థులు శరణార్థులుగా బ్రిటన్‌లో ఆశ్రయం పొందేందుకు అప్పీలు చేసుకొంటే.. దాన్ని పరిష్కరించే వరకు వారిని స్వదేశానికి అప్పగించే వీలు ఉండదు.

అయితే శరణార్థిగా మాల్యా బ్రిటన్‌లో ఆశ్రయం పొందేందుకు అప్పీలు చేసుకున్నాడో లేదో తెలియదని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ విజయ్ మాల్య అప్పగింత విజయవంతంగా పూర్తయితే ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత ఘన విజయంగానే భావించవచ్చు. 

click me!