ధనికుల పైనే ఫోకస్: వాస్తవాలు పట్టించుకొని ఆర్థిక సర్వే

By Sandra Ashok KumarFirst Published Feb 1, 2020, 11:40 AM IST
Highlights

కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యం పూర్తిగా సంపన్నుల పక్షమే వహించారు. సంపద స్రుష్టిమీదే కేంద్రీకరించారు. పేదలకిచ్చే సబ్సీడీ రేషన్ ధరలు హేతుబద్దీకరించాలని విశ్లేషించారు. అంతే కాదు పంట రుణాల మాఫీ వల్ల రైతులకు భవిష్యత్‌లో రుణాలు తగ్గుతాయని తన వైఖరేమిటో స్పష్టం చేశారు. కానీ కార్పొరేట్లకు ఇచ్చిన రూ. లక్షల కోట్ల రుణాలు మొండి బాకీలుగా మారినా.. వాటిని కేంద్రం రద్దు చేసిన వైనం ఊసే ఎత్తలేదు.
 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 'ఆర్థిక సర్వే-2020' అసాంతం సంపన్నుల చుట్టే పరిభ్రమించింది. దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తూ సర్కార్‌కు తగు సూచనలు చేయాల్సిన ఆర్థిక సర్వే.. ఈసారి పూర్తి భిన్నంగా ప్రజల ముంగిట్లోకి వచ్చింది. 

ఆర్థిక వ్యవస్థలోని లోటుపాట్లు, మంద గమనం, ప్రజలు పడుతున్న ఇబ్బందులను సర్కార్‌కు ఎత్తి చూపలేక పోయిందని, సర్కార్ నిర్ధేశిత లక్ష్యాలకు అనుగుణంగా సర్వే రూపుదిద్దుకున్నట్లు కనిపిస్తోంది. సర్వేను రూపొందించిన కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణ్యం బృందం ప్రభుత్వ ఆలోచన తీరుకనుగుణంగానే ఆర్థిక సర్వేను తయారు చేసినట్టు కనిపిస్తోందన్న విమర్శలున్నాయి.

also read Budget 2020: బడ్జెట్ ప్రసంగం.. అరుణ్ జైట్లీకి నిర్మలమ్మ నివాళి

ఈ ఏడాది ఆర్థిక సర్వే ప్రధాన లక్ష్యం 'సంపద సృష్టిం’చడమేనని కృష్ణమూర్తి సుబ్రమణ్యం పేర్కొన్నారు. దేశంలో సంపదను సృష్టించే వారిని తాము తగు విధంగా గౌరవిస్తామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం నాడు నిర్దేశించినట్లే తాము ప్రధానంగా సంపద సృష్టిపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నామని అన్నారు. 

అంటే దేశంలో సంపద సృష్టికి సంపన్నులు, పారిశ్రామికవేత్తలకు గరిష్టంగా మేలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఈఏ కృష్ణమూర్తి సుబ్రమణ్యం పరోక్షంగా తెలిపారు. సంపన్నులు సంపద సృష్టిస్తేనే సమాజంలోని వారందరికీ దానిని పంపిణి చేసేందుకు వీలుపడుతుందని అన్నారు. సంపన్నుల సంపద వల్ల సమాజంలోని అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందన్నది కాదనలేని సత్యమని ఆయన తెలిపారు.

నవభారత నిర్మాణానికి సర్వే ప్రతిపాదించిన పది ఐడియాలు కూడా దేశంలోని ధనికులకే మేలు చేసేలా ఉన్నాయి. దేశంలో గరిష్టంగా సంపద సృష్టించాలని ఆర్థిక సర్వే సూచించింది. సంపద సృష్టి పేరుతో సర్కారు ఆధీనంలో ఉన్న విలువైన సంపదను ధనికులకు అప్పగించే వీలుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

కాలం చెల్లిన సర్కారీ విధానాలకు మంగళం పాడాలని సర్వే తెలిపింది. అంటే ఆర్థిక సంస్కరణల వేగం పెంచాలన్నది సర్వే అంతరంగంగా కనిపిస్తోంది. మరోవైపు మార్కెట్ల ఆధారిత సంపద సృష్టించాలని సర్కార్‌కు సూచించింది. సాధారణంగా మన దేశంలో మార్కెట్లు సామాన్య ప్రజలకు అంతగా చేరువలో లేవు. మార్కెట్ల ద్వారా సంపద సృష్టి అంటే ఎక్కువగా డిజిన్వెష్ట్‌మెంట్‌లు చేయొచ్చని స్పష్టమవుతోంది. 

వ్యాపారానుకూల విధానాలను అమలు చేయడంవల్ల అన్ని రకాల పరిశ్రమల వారికి మేలు జరుగుతుందని ఆర్థిక సర్వే తెలిపింది. మోదీ విధానాలతో ఆర్థికంగా చితికిపోయిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలు  ఇప్పడు సర్కార్ చేయూతనందించినా కోలుకోలేని స్థితిలోకి జారుకున్నారు. ఫలితంగా ఈ దిశగా తీసుకునే నిర్ణయాల వల్ల కూడా సంపన్నులకే మేలు జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలున్నాయి. చిన్న పరిశ్రమల ప్రయోజనార్థం చేపట్టే పథకాల పేరుతో అత్యధికంగా పెద్దలకే మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దేశంలో సృష్టించేందుకు సంపదను పలు రకాల సూచనలు చేసిన ఆర్థిక సర్వే ఆ సంపదను దేశ వాసులందరికీ చేర్చే దిశగా సూచనలే చేయలేకపోయిందన్న విమర్శ వినిపిస్తున్నది. దేశంలోని పరిస్థితులను క్యాష్‌ చేసుకొని సంపదను  సృష్టించుకుంటున్న సంపన్నులు ప్రజలకు మేలు చేసే విధంగా ఎంతవరకు కృషి చేస్తున్నారో ఇటీవల కాలంలో తేలిపోయింది.

దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమన పరిస్థితుల్లోకి జారుకొని ఉద్యోగాలు కొండెక్కుతున్నా, సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా ధనికులు తమ ఖాతాల్లోంచి డబ్బులు తీసి ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేలా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు. దీనికి తోడు సర్కారు నుంచి ఇంకా పన్ను రాయితీలు కోరుతూ వచ్చారు. 

దేశంలోని ధనికులందరూ కూడబలుక్కొని పెట్టుబడులను పెంచితే ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం ఇట్టే మాయమయ్యేదని.. ఉద్యోగ కల్పన జరిగేదని, ఆర్థిక వ్యవస్థ కదలికలో వేగం పెరిగేదని నోబెల్‌ అవార్డు గ్రహీత ఆర్థిక వేత్త అభిజిత్‌ బెనర్జీ ఇటీవల విశ్లేషించిన సంగతి తెలిసిందే. లాభాలు వచ్చినప్పుడు జేబులో వేసుకుంటున్న ధనికులు నష్టం వస్తున్నప్పుడు నిశ్శబ్ధంగా ఉండిపోతున్నారు. 

పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ ‘‘ఆరు నెలల్లో ప్రవేశపెడుతున్న రెండో ఆర్థిక సర్వే ఇది. ఈసారి సర్వే థీమ్‌ వెల్త్‌ క్రియేషన్‌. ఆగస్టు15న ప్రధాని సంపద సృష్టిపై మాట్లాడారు. సంపద సృష్టికర్తలను గౌరవించాలి.

also read Budget 2020: మళ్లీ అదే ఎర్రని వస్త్రం బ్యాగుతో నిర్మల... తొలుత రాష్ట్రపతి వద్దకు.. ఆపై పార్లమెంట్‌కు!!

వారు సంపదను సృష్టించకపోతే.. సంపదను పంచలేం. ఆర్థిక సర్వే కవర్‌ను రూ.100 నోటు పై నుంచి తీసుకొన్న ఊదారంగును వాడాం. పాత కొత్తల ఆలోచన కలయికే ఈ ఆర్థిక సర్వే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో.. భారత ఆర్థిక వ్యవస్థ కూడా మందగించింది. నాన్‌-ఫుడ్‌ క్రెడిట్‌ విభాగంలోని కార్పొరేట్‌ రుణాలు 2013లో అత్యధికంగా ఉన్నాయి.. ఆ తర్వాత బాగా తగ్గాయి. పెట్టుబడులు తగ్గాయి. ఇది జీడీపీపై ప్రభావం చూపింది’’ అని అన్నారు. 

‘ప్రజల వినిమయం తగ్గడం, ఎన్‌బీఎఫ్‌సీలు ఒత్తిడికి గురికావడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, తక్కువ పన్ను ఆదాయాలు వంటి వాటికి అత్యవసర చికిత్స అవసరం.  సంపద సృష్టికర్తల నుంచి ప్రతి ఒక్కరు లబ్ధిపొందారని రుజువైంది. ఒక పెద్ద సంస్థ పరిస్థితి బాగోకపోతే.. దాని ప్రభావం మిగిలిన వాటిపై కూడా పడుతుంది’ అని ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యం పేర్కొన్నారు.

‘చైనాలో కార్మికులు ఎక్కువగా అవసరమైన రంగాలు ఉన్నాయి.. భారత్‌లో కూడా అలాంటి రంగాల అవసరం ఉంది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులు లేకపోతే మనం సామాజిక కార్యక్రమాలపై రెట్టింపు మొత్తాన్నివెచ్చించే వారం. మనం ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే మార్కెట్లోని పరోక్షశక్తులను బలోపేతం చేయాలి. ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలు వ్యాపార అనుకూలంగా ఉన్నాయనే విషయాన్ని స్టాక్‌ మార్కెట్లు వెల్లడిస్తున్నాయి’ అని కృష్ణమూర్తి సుబ్రమణ్యం చెప్పారు. 
 

click me!