
దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పాత కారు కొంటే తక్కువ ధరకు వస్తుందని ఎక్కువ మంది ఆలోచన. అయితే సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు చాలా విషయాలు గుర్తుంచుకోవాలి. వాహనం ఎంత పాతది? ఎన్ని కిలోమీటర్లు నడిచింది? కండిషన్ ఎలా ఉంది? గతంలో యాక్సిడెంట్ కు గురైందా? ఇంజిన్ నుండి బూట్ వరకు బాగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ముఖ్యమైన విషయాలను పట్టించుకోరు. దానివల్ల కొనేశాక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక పాత కారు కొనే ముందు ఎలాంటి పత్రాలు చెక్ చేయాలో అవగాహన పెంచుకోండి.
కొనుగోలుదారులకు పాత కారు గురించి ఎన్నో విషయాలు తెలియవు. కొన్నిసార్లు నేర సంబంధిత కేసుల్లో ఇరుక్కున్న వాహనాలను తక్కువ ధరకు అమ్ముతారు. అలాంటి వాహనాలు పోలీసులకు చిక్కుకుని బయటపడతాయి. అందుకే పాత వాహనం కొనే ముందు నెంబర్ ప్లేట్ పై అధికారిక కేసులు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. https://www.digitalpolicecitizenservices.gov.in/centercitizen/login.htm లో చెక్ చేయవచ్చు. నేర సంబంధిత కేసులు ఉంటే వాహనం కొనకండి.
ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తారు. అలాంటి కార్లు కొనకపోవడమే మంచిది. వాహనాలకు భారీ జరిమానాలు విధించాక వాటిని కట్టకుండా అమ్మేస్తూ ఉంటారు. పాత వాహనం కొనే ముందు చలాన్లు ఉన్నాయా అని చూసుకోవాలి. వాహనం మీ పేరు మీదకు మారితే బకాయిలు మీరే చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి చలాన్లు ఉంటే ముందుగా చెల్లించమని మీకు అమ్మే వారికి అడగండి. https://echallan.parivahan.gov.in లో చలాన్ల వివరాలు చూడవచ్చు.
సెకండ్ హ్యాండ్ వాహనం కొనే ముందు దాని RC బుక్ చూడటం మర్చిపోకండి. దాని చూడడం వల్ల వాహనం గురించి ముఖ్యమైన సమాచారం తెలుస్తుంది. వాహనం ఫైనాన్స్ లో ఉంటే బ్యాంక్ లేదా లోన్ ఇచ్చిన సంస్థ పేరు ఉంటుంది. వాయిదాలు పూర్తయ్యాయని అమ్మేవారు చెబితే NOC అడగండి. NOC ఇచ్చినా RC లో బ్యాంక్ పేరు ఉంటే తొలగించమని చెప్పండి. లోన్ లో ఉన్న వాహనం కొంటే బకాయిలు మీరే చెల్లించాల్సి వస్తుంది.
పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే పాత వాహనం కొన్నా కూడా సమస్యలు రాకుండా ఉంటాయి. లేకుంటే ఇబ్బందుల్లోకి పడతారు. ప్రతిదీ సరిగ్గా చెక్ చేసుకుని కొనాల్సిన అవసరం ఉంది.