నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ విప్లవం తారా స్థాయిని చేరిన సంగతి తెలిసిందే . కరెన్సీ రహిత చెల్లింపుల దిశగా కేంద్రం కూడా ప్రోత్సహించడంతో రూపుదిద్దుకున్నదే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) . 2017-18 ఆర్ధిక సంవత్సరానికి గాను యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్య 92 కోట్లు వుండగా.. అది 2022-23కు వచ్చేసరికి 8,357 కోట్లకు చేరినట్లు కేంద్రం తెలిపింది.
నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ విప్లవం తారా స్థాయిని చేరిన సంగతి తెలిసిందే. కరెన్సీ రహిత చెల్లింపుల దిశగా కేంద్రం కూడా ప్రోత్సహించడంతో రూపుదిద్దుకున్నదే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ). గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి యాప్స్ సాయంతో ఎలాంటి చిన్న ట్రాన్సాక్షనైనా చిటికెలో జరిగిపోతుండటంతో ప్రజలు వీటిని బాగా ఇష్టపడుతున్నారు. ఈ డిజిటల్ పేమెంట్స్ విషయంలో యూపీఐ ప్రధాన పాత్ర పోషిస్తోంది.
అయితే గడిచిన ఐదేళ్లలో యూపీఐ గొప్ప పురోగతి సాధించిందని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి భగవత్ కె కరాడ్ పార్లమెంట్‌లో ప్రకటించారు. యూపీఐ పేమెంట్లు పెరగడంతో గతేడాది చెలామణిలో వున్న నోట్ల విలువలో వృద్ధి కూడా 7.8 శాతానికి తగ్గినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. 2017-18 ఆర్ధిక సంవత్సరానికి గాను యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్య 92 కోట్లు వుండగా.. అది 2022-23కు వచ్చేసరికి 8,357 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. దీని వార్షిక వృద్ధి 147 శాతంగా వుందని కేంద్ర మంత్రి తెలిపారు.
యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ 2017-18లో రూ. లక్ష కోట్లు వుండగా.. అది 2022-23లో రూ.139 లక్షల కోట్లకు చేరినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి గాను 2023-24లో డిసెంబర్ 11 వరకు యూపీఐ మొత్తం ట్రాన్సాక్షన్ల సంఖ్య 8,572 కోట్లుగా వున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. అలాగే చెలామణిలో వున్న నోట్ల విలువలో వృద్ధి 2021-22లో 9.9 శాతంగా వుండగా.. 2022-23లో 7.8 శాతానికి తగ్గిందన్నారు. యూపీఐతో రూపే క్రెడిట్ కార్డులు లింక్ చేసుకునేందుకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. గడిచిన 9 ఏళ్లలో 57 బ్యాంక్‌లను మూసివేసినట్లు కరాడ్ లోక్‌సభలో ప్రకటించారు. అలాగే పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, యెస్ బ్యాంక్‌లను పునరుద్ధరించినట్లు చెప్పారు.
కాగా.. డిజిటల్ మనీ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ వినియోగదారులకు గొప్ప ఉపశమనం కలిగించడానికి రిజర్వ్ బ్యాంక్ కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అంటే ఆసుపత్రులు, విద్యాసంస్థలకు యూపీఐ పేమెంట్ పరిమితిని ఒక్కో లావాదేవీకి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. వివిధ రకాల యూపీఐ లావాదేవీల పరిమితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆసుపత్రులు, విద్యా సంస్థలకు చెల్లింపుల కోసం UPI లావాదేవీ పరిమితిని పెంచాలని ప్రతిపాదించబడింది. ప్రతి లావాదేవీకి 1 లక్ష నుండి ఇప్పుడు రూ. 5 లక్షలు వరకు.. వినియోగదారుల విద్య, ఆరోగ్య ప్రయోజనాల కోసం UPI వినియోగదారులు మరిన్ని చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుంది," అని అన్నారాయన.