చైనాపై సుంకాల మోతకే ట్రంప్ మొగ్గు: చర్చలకు డ్రాగన్ తెర?

By Arun Kumar PFirst Published Sep 17, 2018, 10:56 AM IST
Highlights

చైనాపై తాజాగా 200 బిలియన్ల డాలర్ల దిగుమతి సుంకాలు విధించాలన్న నిర్నయానికే కట్టుబడి ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. దీనివల్ల చైనాకే ఎక్కువ నష్టం అని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ సంగతి గమనించినందునే ట్రంప్.. తన వైఖరిని మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు.

వాషింగ్టన్‌: చైనాతో ప్రతిపాదిత చర్చల ఫలితాలు ఎలా ఉన్నా ఆ దేశం నుంచి మరిన్ని దిగుమతులపై సుంకాలు విధించాలన్న నిర్ణయాన్ని అమలు చేసేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొగ్గు చూపుతున్నారు.  దాదాపు 200 బిలియన్‌ డాలర్ల దిగుమతులపై కొత్తగా దిగుమతి సుంకాలను అమలు చేసే విషయంలో ట్రంప్‌ ముందుకే వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ సుంకాల అమలు సోమవారం నుంచే ప్రారంభంకావచ్చని ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది.

సుంకాలు గతంలో విధించిన 25 శాతం కన్నా తక్కువ స్థాయిలో సుమారు 10 శాతం మేర ఉండొచ్చని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ కథనాన్ని ప్రచురించింది. టారిఫ్‌ల వివాదంపై చర్చించుకునేందుకు అమెరికాను ఆహ్వానించినట్లు చైనా వెల్లడించిన నేపథ్యంలో ఈ కథనం ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు 50 బిలియన్‌ డాలర్ల దిగుమతులపై ఇరు దేశాలు 25% టారిఫ్‌లు విధించాయి.

ఒకవేళ అమెరికా గానీ మరో దఫా తమ దిగుమతులపై సుంకాలు విధించిన పక్షంలో.. ప్రతిగా తాము 60 బిలియన్‌ డాలర్ల పైగా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు ప్రకటించడం ఖాయమని చైనా కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. కాగా, అల్యూమినియం, స్టీల్‌ ఉత్పత్తులపై అమెరికా విధించిన సుంకాల ప్రభావం మన దేశ పరిశ్రమపైనా ప్రభావం చూపిస్తుందని అసోచామ్‌ తన నివేదికలో పేర్కొంది.

ఒకవేళ తాజాగా అమెరికా తమ ఉత్పత్తులపై దిగుమతి సుంకం విధిస్తే, ఇకముందు ఆ దేశంతో ద్వైపాక్షిక చర్చలు జరుపరాదని జీ జిన్ పింగ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల చైనాకే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే చర్చల పేరిట రాజీ కోసం చైనా ప్రయత్నించిందన్న మాటలు వినిపిస్తున్నాయి. చైనాపై ఒత్తిడి పెంచి తన దారికి తెచ్చుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. 

click me!