Trump Tariffs: ట్రంప్ దెబ్బకి కోటి కోడిగుడ్లు, వందల కిలోలు రొయ్యలపై ఎఫెక్ట్.. వారికి ఆకలి, మనకి నష్టం

Published : Aug 07, 2025, 10:40 AM IST
Eggs and Prawns

సారాంశం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతీయ ఉత్పత్తులపై విధించిన 50 శాతం సుంకం ప్రభావం కోడిగుడ్లపైనే అధికంగా పడింది. కోడిగుడ్లు, కోళ్లు, రొయ్యలు కూడా ఈ సుంకం జాబితాలోకి వచ్చాయి. దీనివల్ల అమెరికాకు సరఫరా కావాల్సిన కోటి కోడిగుడ్లు ఇండియాలోనే ఉండిపోయాయి. 

అమెరికా అధ్యక్షుడు ప్రపంచ దేశాలపై సుంకాల యుద్ధం మొదలుపెట్టాడు. తాను చెప్పినట్టు తలాడించని దేశాలపై సుంకాల విధిస్తూ పరోక్షంగా బెదిరింపులకు దిగాడు. భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ట్రంప్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. భారత్, రష్యా స్నేహాన్ని తెగ్గొట్టేందుకు ట్రంప్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. దానిలో భాగంగానే అడ్డదిడ్డంగా సుంకాలు వేస్తూ పోతున్నాడు. మన దేశంపై 50 శాతం సుంకాలను విధించాడు. దీనివల్ల కేవలం ఇండియా ప్రజలకే కాదు, అమెరికన్ పౌరులకు కూడా ఇబ్బందే. భారత వస్తువులపై ట్రంప్ విధించిన ఈ సుంకాల వల్ల పౌల్ట్రీ వ్యాపారులకి ఎంతో నష్టం వాటిల్లుతోంది. ఇక అమెరికా పౌరులకు తినేందుకు ఈ ఎగ్స్, రొయ్యలు వంటివి దొరకకుండా ఇబ్బంది పడుతున్నారు.

భారతదేశం నుండి అమెరికాకు 20 కోట్ల విలువైన గుడ్లు ఎగుమతి అవుతాయి. దాదాపు కోటి గుడ్లను పౌల్ట్రీ వ్యాపారులు అమెరికాకు పంపిస్తారు. వాటిలో ఎక్కువగా తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ నుంచే వెళ్తాయి. తమిళనాడులోని నామక్కల్ అనే ప్రాంతంలో ప్రతిరోజూ ఎనిమిది కోట్లకు పైగా గుడ్లు ఉత్పత్తి అవుతాయి. వాటిలో ఏడు కోట్ల గుడ్లు తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలకు, అరబ్ దేశాలకు, అమెరికాకు ఎగుమతి అవుతాయి

గుడ్లు, రొయ్యలు ఎగుమతి మననుంచే

నామక్కల్ పౌల్ట్రీ పరిశ్రమతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అమెరికాకు ఎక్కువగానే గుడ్లను ఎగుమతి చేస్తారు. జూన్ లోనే కోటి గుడ్లకు పైగా అమెరికాకు ఎగుమతి అయ్యాయి. అలాగే రొయ్యలు మన దేశం నుంచి అధిక శాతం అమెరికాకు సరఫరా అవుతున్నాయి. అందులోనూ ఆంధ్రప్రదేశ్ రొయ్యలు ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ నుంచి 75% రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి. మన దేశం నుంచి ఏటా 2.7 బిలియన్ డాలర్ల విలువైన రొయ్యలు ఎగుమతి అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ట్రంప్ వేసిన సుంకాలవల్ల కోడిగుడ్లు, రొయ్యలు అమెరికాకు చేరడం కష్టమవుతుంది. దీనివల్ల పౌల్ట్రీ పరిశ్రమలు, రొయ్యల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. మొదట భారతీయ వస్తువుల పై 25 శాతం సుంకం వేసిన ట్రంప్ ఇప్పుడు 50 శాతానికి పెంచాడు. దీనివల్ల 20 కోట్ల విలువైన గుడ్లు ఎగుమతి ఎక్కడికక్కడే ఆగిపోయింది. దాదాపు కోటి గుడ్లకు పైగా ఇండియాలోనే ఉన్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు ఇప్పుడు విదేశీ కొనుగోలుదారుడు ఎవరూ కూడా సిద్ధంగా లేరు.

అమెరికాలో ఒక్కోగుడ్డు ధర ఎంత?

మన దగ్గర ఒక్కో గుడ్డు స్థానికంగా 4. 50 రూపాయలకు అమ్మితే, అమెరికాకు రవాణా చేయడానికి ఒక్కో గుడ్డుకు 7.50 రూపాయలు ఖర్చు అవుతాయి. అదే గుడ్డును అమెరికా చేరాక 15 రూపాయలకు అమ్ముతారు. అమెరికాలో గుడ్లను తినేవారి సంఖ్య కూడా ఎక్కువే. వారికి ఇప్పుడు కావాల్సినంత గుడ్లు, రొయ్యలు దొరకవు. ఆహారపరంగా అమెరికాలో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది.

ట్రంప్ ఇదే పట్టుదలతో ఉంటే ఈ గుడ్లు అమెరికాకు చేరుకోలేవు. దీనివల్ల పౌల్ట్రీ వ్యాపారులు తక్కువ ధరకే వాటిని స్థానికంగా అమ్మాల్సి వస్తుంది. అలాగే రొయ్యల ధరలు, గుడ్లు ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధారణ ప్రజలకు మాత్రం ఇది శుభవార్తగానే ఉంటుంది. కానీ వ్యాపారులకు మాత్రం తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు, వ్యాపారులు, సాంప్రదాయ మార్కెట్ల వైపే ఆసక్తి చూపిస్తున్నారు. కోడిగుడ్లు, రొయ్యలు స్థానికంగా ఉన్న మార్కెట్లలో నష్టం రాకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అమెరికాలో కోడిగుడ్ల వ్యాపారులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ దేశంలో ఉన్న వారికి సడిపడినంత కోడిగుడ్లు అక్కడ ఉత్పత్తి కావు. అందుకే ఇతర దేశాలపై ఆధారపడతారు. ముఖ్యంగా ఇండియా నుంచి అమెరికాకు కావలసిన రొయ్యలు, చేపలు, కోడిగుడ్లు వంటివి ఎగుమతి అవుతాయి. అమెరికా ప్రజలు తినే ఆహారాలలో సగానికి పైగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. 50శాతం కంటే ఎక్కువ ఉత్పత్తులను అమెరికాలో ప్రతిరోజూ దిగుమతి చేసుకొని తింటారు. వాటిలో పండ్లు, కూరగాయలు, నట్స్, సీడ్స్ వంటివి ఎన్నో ఉన్నాయి.

తినేదంతా ఇతర దేశాల ఆహారమే

టమోటోలు, అవకాడోలు, మిరియాలు, స్ట్రాబెర్రీలు వంటి వాటిని మెక్సికో నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇక అరటి పండు కోసం గ్వాటేమాలా దేశం పై ఆధారపడి ఉంటుంది. బ్లూబెర్రీస్, ద్రాక్ష పండ్ల కోసం చిలీ దేశం నుంచి తెచ్చుకుంటుంది. రొయ్యలు, కోడిగుడ్ల కోసం భారతదేశంలో ఆధారపడుతుంది. ఇక మటన్ కోసం ఆస్ట్రేలియా పై, పీతల కోసం కెనడాపై ఆధారపడాల్సి వస్తుంది.

అలాగే బియ్యం థాయిలాండ్ నుంచి, పంచదార మెక్సికో నుంచి, జీడిపప్పు వియత్నం నుంచి, కాఫీ కొలంబియా నుంచి, వంటనూనె కెనడా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇలా వారు తినే ఆహారంలో సగానికి పైగా ఉత్పత్తులను ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఎక్కువ డబ్బులు ఇచ్చి అమెరికా కొంటుంది. కాబట్టి ఈ దేశాలన్నీ అమెరికా వ్యాపారం పైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే ట్రంప్ వేసిన సుంకాలకు విలవిలాడుతున్నాయి. నిజానికి అమెరికన్ పౌరులు కూడా ఎంతో ఇబ్బంది పడతారు. ఆహారం సరిగ్గా దొరక్కా... దొరికిన కొంచెం ఆహారమే ఎక్కువ రేట్లు పెట్టి అమ్మడం వల్ల మొదట ఇబ్బంది పడేది అమెరికన్లే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !