
సినిమాలను చూసి సమయాన్ని వృధా చేసుకునే వారిని మనం ఇంతవరకు చూసుంటాము. కానీ ఒక సినిమా చూశాక తన జీవితాన్ని, విధిని మార్చుకున్న వ్యక్తి రాజా నాయక్. అత్యంత పేదరికంలో పుట్టిన రాజా నాయక్ కు చదువు కూడా దక్కలేదు. ఎటువంటి మద్దతు లేదు. కానీ ఒకే ఒక్క సినిమా అతడి జీవితాన్ని మార్చేసింది. ఫుట్ పాత్‌పై బతికిన ఒక వ్యక్తిని కోట్ల విలువైన సంపదకు అధిపతిని చేసింది.
బెంగళూరులోని ఒక పేద కుటుంబంలో జన్మించాడు. రాజా నాయక్ చదువుకోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితి. దీంతో 15 ఏళ్ల వయసులోనే చదువు దూరం అయిపోయింది. ఆకలి, పేదరికం మాత్రమే తనకు తెలిసిన ప్రపంచం. వాటిని భరించలేక 17 ఏళ్ల వయసులోని ఇల్లు వదిలి ముంబై పారిపోయాడు. ముంబైలో బతకడం కోసం చిన్న చిన్న పనులు ఎన్నో చేశాడు. ఓ రోజు అమితాబచ్చన్ నటించిన త్రిశూల్ అనే సినిమా చూశాడు. ఆ సినిమాలో అమితాబ్ కూడా పేదరికంతో జీవించిన వ్యక్తిగా కనిపించాడు. అయినా కూడా ఆ పేదరికం నుంచే తనను తాను మార్చుకొని చివరికి రియల్ ఎస్టేట్ కింగ్ గా ఎదిగాడు. ఆ సినిమా చూశాక రాజా నాయక్ కూడా పేదరికం తనకు అడ్డేమీ కాదనిపించింది. తన సొంత ఆలోచనలతో వ్యాపారం చేసి జీవితంలో కోటీశ్వరుడు అవ్వాలని నిర్ణయించుకున్నాడు.
ముంబై వెళ్లిన రాజా నాయక్ కు అక్కడ ఎంత ప్రయత్నించినా మంచి పని దొరకలేదు. దాంతో తిరిగి ఇంటికి వచ్చాడు. తన తల్లి నుండి కొంత డబ్బును అప్పుగా తీసుకొని తమిళనాడులోని తిరుపూర్ కు వెళ్ళాడు. అక్కడ చవకగా బట్టలు దొరికేవి. అతడు ఎక్కువగా షర్టులనే కొనేవాడు. వాటిని తీసుకొని బెంగళూరులోని ఫుట్ పాత్ లపై అమ్మడం మొదలుపెట్టాడు. ఇంటి పక్కన ఒక ఫ్యాక్టరీ ఉండేది. ఆ ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగులంతా తెలుపు లేదా నీలం చుక్కలను మాత్రమే వేసుకునేవారు. దాంతో ఆయన రాజా నాయక్ తెలుపు, నీలం రంగు చొక్కాలను మాత్రమే కొని వాటిని ఫుట్ పాత్‌లపై పెట్టాడు.దీంతో ఆ ఫ్యాక్టరీ ఉద్యోగులంతా వచ్చి కొనడం మొదలుపెట్టారు. ఒక్కరోజులోనే అన్ని అమ్ముడు అయిపోయాయి. సరైన పద్ధతిలోపనిచేస్తే లాభాలు వస్తాయని గ్రహించాడు. రాజా నాయక్ మొదటి రోజే అతనికి ఐదువేల రూపాయల లాభం వచ్చింది. సరైన మార్గం విజయాన్ని అందిస్తుందని అతను అర్థం చేసుకున్నాడు.
ఎన్నో నెలల పాటు అలా చొక్కాలనే అమ్మాడు. అమ్మిన తర్వాత వచ్చిన లాభాన్ని వృధాగా చేయకుండా ఒకచోట పొదుపు చేశాడు. చివరికి తన వ్యాపారాన్ని నెమ్మదిగా విస్తరించడం ప్రారంభించాడు. షర్టులతో పాటు బూట్లు, చెప్పులు, ఇంటికి పనికి వచ్చే వస్తువులు... ఫుట్పాత్ పైన అమ్మడం మొదలు పెట్టాడు. దీంతో అమ్మకాలు విపరీతంగా సాగాయి. ఇక ఫుట్ పాత్ పైన వ్యాపారం నడపడం కష్టమని అర్థం అయిపోయింది. దాంతో 1991లో ప్యాకేజింగ్ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. అదే అతడే మొదటి కంపెనీ. దీనికి అక్షయ్ ఎంటర్ప్రైజెస్ అని పేరు పెట్టి నడిపించాడు. ఈ ప్యాకేజింగ్ వ్యాపారంలో కూడా బాగానే కలిసి వచ్చింది. దాంతో 1998లో లాజిస్టిక్స్ అలాగే వాటర్ బేవరేజెస్, ఫుడ్, దుస్తుల వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టాడు. ఇలా అంచెలంచెలుగా అతడు ఒక్కో వ్యాపారాన్ని పెంచుతూ చివరికి 100 కోట్ల టర్నోవరుకు తన వ్యాపారాన్ని చేర్చుకున్నాడు. ఒకప్పుడు చదువుకోవడానికి డబ్బులు లేని వ్యక్తి ఇప్పుడు ఎంతోమంది పిల్లలకు యూనిఫామ్ లను తన కంపెనీ నుంచే పంపిస్తున్నాడు.
ఒకప్పుడు రాజా నాయక్ జీవితం వేరు. తల్లిదండ్రులతో పాటు ఆయనకి నలుగురు తోబుట్టువులు. అందరినీ స్కూలుకు పంపడం ఎంతో కష్టమై చదువును మధ్యలోనే ఆపించేశారు తల్లిదండ్రులు. తండ్రికి స్థిరమైన ఆదాయం లేదు... తల్లి పని చేసినా కూడా వచ్చిన డబ్బు తినడానికే సరిపోయేది కాదు. దీంతో తల్లి తన ఇంట్లో వస్తువులనే తాకట్టు పెట్టి ఆ డబ్బుతో పిల్లల పొట్ట నింపేది. ఇంట్లోనే కష్టాలను, కన్నీళ్ళను రాజా నాయక్ దగ్గరుండి చూసాడు. జీవితాంతం అదే పేదరికంలో ఉండడం అనేది వైఫల్యంగానే భావించాడు. అందుకే తన విధిని తానే మార్చుకున్నాడు.
వ్యాపారులెవరైనా తెలివిగా ఆలోచించడం ఎంతో ముఖ్యం. రాజా నాయక్ చేసింది అదే పని. చేతిలో డబ్బులు ఉన్నప్పుడే అతడు అవకాశం ఉన్న చోటల్లా దాన్ని రెట్టింపు నగదుగా మార్చుకునేందుకు ప్రయత్నించాడు. రియల్ ఎస్టేట్ జోరుగా ఉన్న సమయంలో పెట్టుబడి పెట్టాడు. అదే నాలుగింతలై తిరిగి తన చేతికి వచ్చింది. ఎంతోమంది లాగా జీవితంలో అడ్డంకులను ఎదుర్కొన్నాడు. కానీ అదృష్టవతాస్తూ ఆయన వ్యాపారంలో తీసుకున్న నిర్ణయాలు కలిసి వచ్చాయి. వ్యాపారంలో వచ్చిన నష్టం కూడా అతడికి ఆ తర్వాత అదృష్టంగానే మారింది.
ఎవరైనా పేదవారు లేదా వైఫల్యంతో కుమిలిపోతున్న వారు తన దగ్గరికి వస్తే .. ‘నా జీవితాన్నే ఉదాహరణగా తీసుకోండి. ధైర్యవంతులకే అదృష్టం కూడా దక్కుతుంది. మీరు రిస్క్ తీసుకోవడానికి, మీ కలలను నిజం చేసుకోవడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉండండి’ అని చెబుతాడు.
రాజా నాయక్ చిన్నప్పుడు పెరిగిన ప్రాంతంలో పొరుగువారు, స్నేహితులు ఇప్పటికీ అక్కడే ఉన్నారు. రాజా నాయక్ చిన్నప్పుడు వారంతా మంచి స్థాయిలోనే ఉన్నారు. వారి తల్లిదండ్రులు ఒక కంపెనీలో గుమస్తాలుగా, ఉద్యోగులుగా ఉండేవారు. ఆ రోజుల్లో వారి పరిస్థితి రాజా నాయక్ కన్నా మెరుగ్గా ఉండేది. వారికి చదువుకునే అవకాశం ఉండేది. కానీ రాజా నాయక్ కు అప్పట్లో ఆ పరిస్థితి లేదు. కానీ తన విధిని తానే మార్చుకున్నాడు. ఇప్పుడు భారతదేశంలోని విఐపి లతో వేదికను పంచుకునే స్థాయికి ఎదిగాడు. కేవలం డబ్బు వల్ల ఇది జరగలేదు. గత 35 ఏళ్లుగా ఆయన చేసిన కృషి ఫలితమే ఇదంతా.
అతడికి చదువుకునే అవకాశం దక్కలేదు. తన చెల్లికి కూడా స్కూల్లో అడ్మిషన్ ఇవ్వలేదు. అది తన మనసులో ఎంతో ప్రభావాన్ని చూపించండి. అందుకే తన దగ్గర కొంత డబ్బు కూడినప్పుడు చిన్న ఇంటిని అద్దెకి తీసుకొని దాన్ని స్కూల్ గా మార్చి కొంతమంది ఉపాధ్యాయులను నియమించాడు. పేద పిల్లల కోసం నర్సరీ పాఠశాలను ప్రారంభించాడు.
రాజా నాయక్ పెళ్లి చేసుకున్నది కూడా తనలాంటి ఒక వ్యక్తినే. ఆమె పేరు అనిత. రాజా నాయక్ స్థాపించిన చిన్న పాఠశాలలో ఉద్యోగం కోసం ఆమె పదహారేళ్ళ వయసులో వచ్చింది. పేదరికమే ఆమెకు చదువును దూరం చేసింది. ఆమె తండ్రి ఆటో రిక్షా డ్రైవర్ గా ఉండేవాడు. అనిత పాఠశాలలో ఉద్యోగం చేస్తూ ఆ స్కూలును నడిపేందుకు సహకరించింది. ఆ సమయంలోనే అనిత పద్ధతులు రాజా నాయక్ కు నచ్చి ఇద్దరూ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లికి ఏకైక సాక్షి పాఠశాలలో ఉండే ఒక సిబ్బంది.
ఒంటరిగా మొదలైన ప్రయాణం తర్వాత జంటగా, మరింత దూకుడుగా సాగింది. బాధ్యతలను పంచుకుంటూ భార్యాభర్తలు తమ కంపెనీలను నిలబెట్టేందుకు ఎంతో కృషి చేశారు. ఆ కృషి ఫలితమే ఇప్పుడు వారు 100 కోట్ల టర్నోవర్ ను సాధించారు.