సుంకాలపై రూట్ మార్చిన ట్రంప్: 50 భారత్ ఉత్పత్తులపై రాయితీలు రద్దు

By sivanagaprasad kodatiFirst Published Nov 2, 2018, 7:57 AM IST
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేసేలా ఉన్నారు. విదేశీ వస్తువుల్లో తమకు అవసరమైన వాటిపైనా ఇప్పటివరకు కల్పిస్తున్న జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ కింద కల్పిస్తున్న రాయితీలు ఎత్తేయనున్నారు.

ఇప్పటి వరకు చైనా, మెక్సికో తదితర దేశాలపై అవసరానికి అనుగుణంగా ఆంక్షలు విధించి, సుంకాలు పెంచడం గానీ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిలో ఎటువంటి మార్పు లేదు.

దీంతో  భారత్‌-అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య సమస్యలపై అగ్రరాజ్యం తన వైఖరిని ఏ మాత్రం మార్చుకునేందుకు సిద్ధంగా లేదని మరోసారి స్పష్టమైంది. తాజాగా అమెరికా దిగుమతి చేసుకునే 90 వస్తువులపై సుంకం రాయితీలను ఎత్తివేసింది. వీటిలో 50 వస్తువులు భారత్‌ నుంచి దిగుమతి చేసుకునేవే కావడం గమనార్హం.

జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ (జీఎస్‌పీ) కింద అమెరికా కొన్ని దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాల్లో పూర్తి రాయితీ కల్పిస్తుంది. తాజాగా ఈ జాబితా నుంచి 90 వస్తువులను తీసేస్తున్నట్లు ఫెడరల్‌ రిజిస్టర్‌ ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నవంబర్ ఒకటో తేదీ నుంచి నుంచి 90 వస్తువులపై సుంక రహిత రాయితీని ఎత్తివేస్తున్నట్లు గత మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 

అమెరికా వాణిజ్య ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఒకటో తేదీ నుంచి కొన్ని నిర్దేశిత వస్తువులను జీఎస్పీకి చెప్పామని, అవి ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ వస్తువుల జీఎస్‌పీ కిందకు రావు’ అని తెలిపారు. కాగా.. దేశాలను పరిగణనలోకి తీసుకుని ఈ వస్తువులను ఎంపిక చేయలేదని, ఆయా వస్తువుల ప్రాధాన్యం ప్రకారమే నిర్ణయించామని ఆ ప్రతినిధి తెలిపారు.

అమెరికా జీఎస్‌పీ వల్ల ఎక్కువగా లాభపడుతున్న దేశాల్లో భారత్‌ ప్రథమ స్థానంలో ఉంది. ట్రంప్‌ తాజా నిర్ణయం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. రాయితీ ఎత్తివేసిన 90 వస్తువుల్లో దాదాపు 50 వస్తువులు భారత్‌ నుంచి దిగుమతి చేసుకునేవే. కందులు, గుండు పోకలు, మామిడి పండ్లు, వెనిగర్‌, ఇసుకరాయి తదితర వస్తువులపై రాయితీ ఎత్తివేసింది.

తాజా నిర్ణయం భారత్‌లోని చిన్న, మధ్య తరహా వ్యాపారాలపై అధిక ప్రభావం చూపనున్నది. ముఖ్యంగా హస్తకళలు, వ్యవసాయ రంగాల ఉత్పత్తులకు అమెరికాలో గిరాకీ తగ్గే అవకాశముంది. భారత్‌తో పాటు అర్జెంటినా, బ్రెజిల్‌, థాయ్‌లాండ్‌, పాకిస్థాన్‌, టర్కీ, ఫిలిప్పీన్స్‌, ఈక్వెడార్‌, ఇండోనేషియా లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కూడా అమెరికా రాయితీని ఎత్తివేసింది.

click me!