రూ.18 వేలు కట్టాకే విదేశీ యానం:నరేశ్ గోయల్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

By rajesh yFirst Published Jul 10, 2019, 10:45 AM IST
Highlights

జెట్ ఎయిర్వేస్ మాజీ ప్రమోటర్ నరేశ్ గోయల్‌కు ఢిల్లీ హైకోర్టు గట్టి షాకే ఇచ్చింది. విదేశాలకు వెళ్లాలనుకుంటే జెట్ ఎయిర్వేస్ సంస్థ రుణాల కోసం బ్యాంకర్లకు ఇచ్చిన గ్యారంటీ కింద రూ. 18,000 కోట్లు కట్టాలని ఆదేశించింది. తాను జెట్ సంస్థకు అవసరమైన నిధుల సమీకరణతోపాటు బ్రిటన్, దుబాయి నివాస పర్మిట్లను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉందన్న గోయల్ వాదనను అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణిందర్ సింగ్ ఆచార్య తోసిపుచ్చారు. 

న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌కు ఢిల్లీ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. విదేశీ ప్రయాణం చేయాలని భావిస్తే ఆయన స్థాపించిన కంపెనీ జెట్‌ఎయిర్‌వేస్‌ బ్యాంకర్లకు బకాయి పడిన రూ.18వేల కోట్లను గ్యారంటీ కింద డిపాజిట్‌ చేయాలని తేల్చి చెప్పింది. 

దేశం విడిచి వెళ్లేందుకు గోయల్‌ చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. తనకు వ్యతిరేకంగా జారీ చేసిన లుకవుట్‌ సర్క్యులర్‌ జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేశ్ గోయల్ దాఖలు చేసిన పిటిషన్‌పై దీనిపై కేంద్ర ప్రభుత్వ స్పందనను కోర్టు కోరింది.

‘ఈ సమయంలో గోయల్‌కు ఎటువంటి మధ్యంతర ఉపశమనం కల్పించేది లేదు. మీరు 18వేల కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు సిద్ధపడితే, విదేశానికి వెళ్లొచ్చు’ అని ఢిల్లీ హైకోర్టు జస్టిస్‌ సురేష్‌ కైత్‌ అన్నారు.

ఈ ఏడాది మే 25వ తేదీన దుబాయికి వెళ్లే విమానం నుంచి, గోయల్, అతని భార్య అనిత్‌ను విమానాశ్రయంలో దించేసిన సంగతి తెలిసిందే. అయితే, తనపై ఎటువంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాకున్నా, లుకవుట్‌ నోటీసు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ గోయల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. తమ స్పందన తెలియజేయాలని హోం, కార్పొరేట్, న్యాయ శాఖలను  ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్ట్‌ 23కు వాయిదా వేసింది.

గోయల్‌ దంపతుల తరఫున న్యాయవాది మణిందర్‌సింగ్‌ వాదనలు వినిపించారు. మే 25న వారిని విమానం నుంచి దించేసినప్పుడు, వారు విచారణను తప్పించుకునే ప్రయత్నం చేశారని చెప్పేందుకు ఏ ఆధారం చూపలేదన్నారు. 

హైకోర్టులో గోయల్‌ పిటిషన్‌ దాఖలు చేసే వరకు ఆయనపై ఎటువంటి కేసు నమోదు కాలేదని, జూలై 6న మాత్రం, పిటిషన్‌ విచారణకు వచ్చినప్పుడు, ఎస్‌ఎఫ్‌ఐవో నుంచి విచారణకు రావాలని గోయల్‌కు సమన్లు అందినట్టు వివరించారు. 

తమ క్లయింట్లు ఎన్‌ఆర్‌ఐ హోదా కలిగిన వారని, జెట్‌ గ్రూపు కోసం నిధులు సమకూర్చుకునేందుకు దుబాయి, లండన్‌ వెళ్లాలనుకున్నట్టు మణిందర్ సింగ్ తెలిపారు. గోయల్‌కు బ్రిటన్‌ నివాస వీసా, యూఏఈ నివాస పర్మిట్‌ ఉన్నాయని, ఇవి ఈ నెల 10, 23వ తేదీల్లో గడువు రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉన్నందున వెంటనే బ్రిటన్, యూఏఈ వెళ్లాల్సి ఉందన్నారు. 

నరేష్‌ గోయల్‌ అభ్యర్థనకు వ్యతిరేకంగా అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ మణిందర్‌ ఆచార్య వాదిస్తూ... ఇది తీవ్రమైన రూ.18,000 కోట్ల మోసమని, ఎస్‌ఎఫ్‌ఐవో ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్నట్టు తెలిపారు. ఈ విచారణలో గోయల్‌ పాల్గొని తన స్పందనను తెలియజేయాల్సి ఉందన్నారు. 

click me!