
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. గత రెండు రోజులుగా ఈ కల్చరల్ సెంటర్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు, మత గురువులు, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ గ్లోబల్ మ్యూజియం స్టాండర్డ్ క్రింద రూపొందించినట్లు తెలిపారు. ఇక్కడ, భారతదేశంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాత్మక వస్తువులను స్టోర్ చేశారు. ఈ సాంస్కృతిక కేంద్రం అత్యాధునిక సౌకర్యాలతో ఉంది. అయితే ఈ కల్చరల్ సెంటర్ లో మూడో రోజు కూడా పలు కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ కల్చరల్ సెంటర్లో మూడోరోజు రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ తల్లి కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ చేతులు మీదుగా 'సంగం' ఆర్ట్ హౌస్ ప్రారంభించారు. ఈ ప్రత్యేక ప్రదర్శనలో 5గురు భారతీయ, 5గురు అంతర్జాతీయ కళాకారుల నుండి 50కి పైగా కళాఖండాలు ఉన్నాయి, ఇవి భారతదేశపు విభిన్న సాంస్కృతిక, సంప్రదాయాలను ప్రతి బింబిస్తాయి.
అమెరికన్ క్యూరేటర్ జెఫ్రీ డీచ్, భారతదేశపు ప్రముఖ సాంస్కృతిక సిద్ధాంతకర్త రంజిత్ హోస్కోటేచే నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన భారతీయ సంస్కృతి నుంచి ప్రేరణ పొందింది. అన్సెల్మ్ కీఫెర్, సిసిలీ బ్రౌన్ . ఫ్రాన్సిస్కో క్లెమెంటే వంటి అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన కళాకారులు తయారు చేసిన కళాఖండాలు భారతదేశంలో మొదటిసారిగా ప్రదర్శిస్తున్నారు. అలాగే భూపేన్ ఖాఖర్, రంజనీ షెట్టర్, రతీష్ టి, శాంతిబాయి వంటి భారతీయ కళాకారుల కళాకృతులు కూడా 'సంగం' ఆర్ట్ హౌస్ లో మూడో రోజు ప్రదర్శిస్తున్నారు. మూడో రోజు నీతా అంబానీ, అలాగే ఆమె కుమార్తె ఇషా అంబానీ 'ఇండియా ఇన్ ఫ్యాషన్: ది ఇంపాక్ట్ ఆఫ్ ఇండియన్ డ్రెస్ అండ్ టెక్స్‌టైల్స్ ఆన్ ది ఫ్యాషన్ ఇమాజినేషన్' -అనే కాఫీ టేబుల్ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు.
NMACC కల్చరల్ సెంటర్ ప్రత్యేకతలు ఇవే..
NMACC కల్చరల్ సెంటర్ భారతీయ మరియు అంతర్జాతీయ కళాకారుల ప్రదర్శనలకు నిలయం. 2,000 సీట్ల గ్రాండ్ థియేటర్, సాంకేతికంగా అభివృద్ధి చెందిన 250-సీట్ స్టూడియో థియేటర్, డైనమిక్ 12S-సీట్ క్యూబ్‌తో సహా మూడు ప్రదర్శన కళల వేదికలు ఇందులో ఉంటాయి. అందులో నాలుగు అంతస్థుల ఆర్ట్ హౌస్ కూడా సిద్ధం చేశారు. భారతదేశంలోని అతిపెద్ద పిచ్వాయ్ పెయింటింగ్‌లలో ఒకటైన 'కమల్ కుంజ్'తో సహా ప్రఖ్యాత భారతీయ, గ్లోబల్ కళాకారులచే ఆకట్టుకునే పబ్లిక్ ఆర్ట్ మిక్స్ కూడా ఇందులో ఉంటుంది, ఇది సెంటర్ ప్రాంగణంలో విస్తరించి ఉంది.
ఈ సెంటర్‌లో ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్ పేరుతో మ్యూజికల్ థియేటర్, ఇండియా ఇన్ ఫ్యాషన్ అనే కాస్ట్యూమ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ మరియు సంగమ్ కన్‌ఫ్యూజన్ అనే విజువల్ ఆర్ట్ షో ఉన్నాయి. NMACC భారతదేశంలోనే మొట్టమొదటి సాంస్కృతిక కేంద్రం. ఈ కేంద్రం పిల్లలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ఉచితం అని నీతా అంబానీ దీని గురించి చెప్పారు. ఇతరులు నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ అధికారిక వెబ్‌సైట్ - nmacc.com లేదా BookMyShow ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.